తరగతి గదిలోనే పొదుపు పాఠాలు నేర్పలేమా?
Saving tips
బిఎంఆర్
నేటి విద్యావ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాఠాలు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎంత ఖర్చు పెడితే అంత గౌరవం పెరుగుతుందనే దురభిప్రాయంలో యువత కొట్టుమిట్టాడుతోంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పొదుపు పట్ల అవగాహన కల్పించాలి. పొదుపుకు, పిసినారితనానికి వ్యత్యాసం నేర్పాలి. సంపాదించిన నెలసరి వేతనంతో కొంత మేరకు పొదుపు చేయడం కనీస కర్తవ్యమని నేర్పుకోవాలి. మొక్కై వంగనిది, మానై వంగదు కదా. లేత మనసుల్లో ఆర్థిక అక్షరాస్యత బీజాలు నాటాలి. చిన్నతనంలో పొదుపు పాఠాలు నేర్చిన పిల్లలు రేపటి కుటుంబానికి సుఖ సంతోషాలను అందించగలరని తెలుసుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా పొదుపు ప్రాధాన్యాన్ని అవగాహన కల్పించటానికి ప్రతి ఏట 31 అక్టోబర్ రోజున ప్రపంచ పొదుపు దినోత్సవం (వరల్ త్రిఫ్ట్ లేదా సేవింగ్స్ డే) పాటించడం 1925 నుంచి ఆనవాయితీగా వస్తున్నది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 31 అక్టోబర్ 1984 రోజు మరణించడంతో, 1985 నుంచి ప్రపంచ పొదుపు దినాన్ని భారత ప్రభుత్వం 30 అక్టోబర్ రోజున నిర్వహించడం కొనసాగుతున్నది. 2026 ప్రపంచ పొదుపు దినోత్సవం ఇతివృత్తంగా ‘ఏఐ సలహాలు, మానవుడి నిర్ణయాలు’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం కొనసాగుతున్నది.
నేటి డిజిటల్ యువత ఉద్యోగాలు చేస్తూ పరిమిత వేతనాలను పొందుతున్నారు. తాము పొందిన వేతనాలతో కుటుంబాలను సజావుగా నడపడం లేదు. ప్రాధాన్యాలు మరిచి పోతున్నారు. విలాసాలు కూడా కనీస అవసరాలు అనుకుంటున్నారు. డబ్బు చేతిలో ఉన్నపుడు చేతులకు ఎముకలు లేవన్నట్లు అనాలోచితంగా ఖర్చు చేస్తున్నారు. ధనం ఉన్నపుడు ఎగిరి పడడంతో పాటు లేనపుడు అప్పులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. విలాసాలకు, కనీస అవసరాలకు వ్యత్యాసాలు మరిచి పోతున్నారు. ఎంత సంపాదించిన నెలలోని తొలి వారంలోనే ఖర్చు పెడుతున్నారు. రేపటి అనుకోని ఆపదలను తట్టుకోవడానికి పొదుపు ధనం వినియోగపడుతుందనే కనీస అవగాహన కోల్పోతున్నారు. నేటి విద్యాలయాలు మార్కులు, ర్యాంకుల పాఠాలు నేర్పుతున్నారు. ఉద్యోగాలు పొందడానికి అవసర విద్యను బోధిస్తున్నారు. సంపాదించిన ధనాన్ని పొదుపుగా వాడుకోవడాన్ని నేర్పే విద్య కరువైయ్యింది. చాప ఉన్నంత వరకే కాళ్లు చాపుకోవడం నేర్పాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవడం బోధించాలి. ప్రమాదాలు చెప్పి రావని, అనారోగ్యాలు అడిగి రావని తెలుసుకోవాలి. అనుకోని విపత్తుల్లో ఆదా చేసిన డబ్బు ఆదుకుంటుందనే ఇంగితం మరువరాదు.
చిన్నతనం నుంచే పాకెట్ మనీని దాచుకోవడం నేర్పించాలి. తొలి దశలో గళ్ల గురిగిలో చిల్లర డబ్బుల్ని దాచుకోవడం నేర్పాలి. పిల్లలతో పాటు యువతకు డబ్బు ప్రాధాన్యాన్ని, ఖర్చు చేసే పద్దతులను, పొదుపు చేయవలసిన అవసరాన్ని బోధించాలి. తమ బ్యాంక్లో పొదుపు ధనాన్ని దాచుకోవడం బోధించాలి. ప్రతి నెల వేతనంలో కొంత శాతాన్ని విధిగా పొదుపు చేయడం నేర్చుకోవాలి. మన అలవాట్లకు, వ్యయానికి సమీప సంబంధం ఉందని తెలపాలి. నేటి పొదుపు రేపటి భరోసా కావాలి. వృత్తిలో ఎదగడం, కుటుంబంలో శాంతి నెలకొనడం, పిల్లల చదువులు, గృహ నిర్మాణం, వాహనాల నిర్వహణ, పిల్లల పెళ్లిళ్లు, అనుకోని ఖర్చులు లాంటివని మన ఆర్థిక క్రమశిక్షణతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంటాయని మరువరాదు. తెలియక పోవడం పొరపాటు కాకపోవచ్చని, తెలుసుకోకపోవడం నేర సమానమని తెలుసు కోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కుటుంబాల్లో మానసిన ఒత్తిడి, అనారోగ్యాలు, అశాంతి, గొడవలు, పిల్లల పెంపకంలో ఇబ్బందులు, భవిష్యత్తు పట్ల అనిశ్చితి లాంటివని వెంటాడుతుంటాయి. నేటి విద్యావిధానంలో పాఠ్యాంశాలు, నైపుణ్యాలు, మానవీయ విలువలు, మంచి అలవాట్లు, కంప్యూటర్ అక్షరాస్యత లాంటి అంశాలతో పాటు ఆర్థిక అక్షరాస్యతను చిన్నతనం నుంచే కూడా విధిగా బోధించాలి.
సకల విలువలను నేర్పే కేంద్రాలుగా తరగతి గదులు మారాలి. నేటి బాలలే రేపటి పౌరులని, నేటి ఆదాయమే రేపటి ప్రమాదాలకు చికిత్స అని, నేటి పొదుపు చేసిన ధనమేరా రేపటి కుటుంబ సంతోషాలకు పునాది అని తెలుసుకుందాం. పొదుపు మంత్ర మహత్యాన్ని చిన్నారుల మనస్సుల్లో ముద్రిద్దాం.