Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

సిఇసి ఇష్టారాజ్యం!

Prajapaksham 30 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
సిఇసి ఇష్టారాజ్యం!

cec gyanesh kumar

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేశ్‌ కుమార్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ఆయన అనుసరిస్తున్న విధానాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నవి. వాస్తవానికి, ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం విశ్వసనీయత దాని అధికారాల విస్తృతితోనో, దాని అధిపతి హోదాతోనో నిర్ణయమవదు. ఆ అధికారాలను ఎంత పారదర్శకంగా వినియోగిస్తోంది? తన నిర్ణయాలపై వచ్చే ప్రశ్నలకు ఎంత బాధ్యతాయుతంగా సమాధానమిస్తోంది? సంస్థలోని భిన్నాభిప్రాయాలకు ఎంత విలువ ఇస్తోంది? అనే అంశాలే దాని నైతిక బలాన్ని నిర్ణయిస్తాయి. ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యత లు నిర్వర్తించే సంస్థ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తే, ఆ మౌనాన్ని సాధారణ పరిపాలనా లోపంగా కాకుండా, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ప్రశ్నార్థకం చేసే దుష్ట సంప్రదాయంగా మారుతుంది. సిఇసి వ్యవహారశైలిపై, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వెలువడిన ఆరోపణల నేపథ్యంలో, ప్రజాస్వామ్యానికి జవాబుదారీతనం బోధించాల్సిన సంస్థ తన జవాబుదారీతనాన్ని ఎలా నిరూపించుకుంటుంది? అనే ప్రశ్న తెరపైకి వస్తున్నది. ఎందుకంటే, సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) నోటీసును సిఇసి బేఖాతరు చేస్తున్న తీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ, ప్రజా సంస్థల నిర్ణయాల వెనుక ఉన్న సమాచారం తెలుసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా సమాచార హక్కు దరఖాస్తుకు 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. అయితే, ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సంబంధించిన పత్రాలను కోరుతూ దాఖలైన దరఖాస్తుకు గడువు ముగిసినా సమాధానం రాలేదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. పదవీ విరమణ చేసిన నౌకాదళ అధికారి, సమాచార హక్కు కార్యకర్త దాఖలు చేసిన ఈ దరఖాస్తులో, ఇద్దరు కమిషనర్లు నమోదు చేసిన విభేదాలు, వాటిపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న చర్యలు, సంబంధిత ఫైల్‌ నోటింగ్స్‌ వివరాలను కోరారు. అక్టోబర్‌ 26 నాటికి 30 రోజుల గడువు ముగిసినా సమాధానం అందలేదని, దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని మళ్లీ విజ్ఞప్తి చేసినట్లు అందుబాటులో ఉన్న సమాచారం స్పష్టం చేస్తున్నది. కోరిన ప్రతి పత్రాన్ని ఏ పరిస్థితిలోనైనా వెల్లడించాలనే నియమం లేదు. చట్టంలో పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తే సంబంధిత ప్రజా సమాచార అధికారి కారణాలతో కూడిన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, అలాంటి మినహాయింపు వర్తిస్తే దానిని స్పష్టంగా తెలియజేయాలి. చట్టబద్ధమైన గడువులో సమాధానం ఇవ్వడం, సమాచారం నిరాకరిస్తే అందుకు కారణాలు చెప్పడం ప్రజా సంస్థ బాధ్యత. మౌనం ఈ రెండింటికీ ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల రూపకల్పన, ఓటు హక్కు వినియోగం, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలపై పారదర్శకతకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు పది నెలల వ్యవధిలో కనీసం 14 సందర్భాల్లో తమ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారన్న వార్త సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ప్రత్యేకమైన రాజ్యాంగ హోదా ఉన్నప్పటికీ, మిగతా ఇద్దరు కమిషనర్లను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరించే అధికారం ఆయనకు లేదు. ఈ వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషన్‌పై విమర్శలు తీవ్రతరం కావడానికి మరో కారణం సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం రాకపోవడం. ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై తీసుకున్న చర్యలు, వాటికి సంబంధించిన ఫైల్‌ నోటింగ్‌ను కోరిన దరఖాస్తుకు చట్టబద్ధమైన గడువులో స్పందించకపోవడం అనుమానాలను పెంచుతుంది. సమాచార హక్కు చట్టం ప్రకారం నిర్ణీత గడువులో స్పందించకపోతే దరఖాస్తును తిరస్కరించినట్లుగా పరిగణించే నిబంధన ఉంది. దరఖాస్తుదారుడు తదుపరి అప్పీల్‌ ప్రక్రియను ఆశ్రయించవచ్చు. ఈ చట్టపరమైన వ్యవస్థను పౌరులు వినియోగించుకోవాల్సిన పరిస్థితి రావడం ఒక అంశమైతే, ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థే గడువును పాటించకపోవడం మరో తీవ్రమైన అంశం. ఇదే సమయంలో సిఇసి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయన్న సమాచారం కూడా రాజకీయ, ప్రజాస్వామ్య చర్చలో భాగమైంది.
అక్టోబర్‌ 2 నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రజల ఆందోళనలను పూర్తిగా పట్టించుకోనవసరం లేదన్న భావనతో వ్యవహరించడం మాత్రం బాధ్యతాయుతమైన ప్రజా నాయకత్వానికి తగదు. విమర్శల కు సమాధానం ఇవ్వడం బలహీనత కాదు. సమాధానం చెప్పకుండా ఉండటమే అనుమానాలకు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాజకీయంగా రక్షణ కల్పిస్తోందా? అనే అనుమానం కూడా బలంగా ఉంది. ఎందుకంటే, ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రజలకు సందేహాలు కలిగించే పరిస్థితులు ఏర్పడితే వాటిని తొలగించే బాధ్యత ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘంపైనా ఉంటుంది. రాజ్యాంగ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తోందని చెప్పడం మాత్రమే సరిపోదు. దాని నిర్ణయాలు, చర్యలు కూడా ఆ స్వతంత్రతను ప్రతిబింబించాలి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలకు సంస్థ పారదర్శకమైన ప్రక్రియలతో సమాధానం చెప్పాలి. లేకపోతే, పరోక్షంగా సిఇసికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని స్పష్టమవుతుంది. సమస్య గంభీరతను బట్టి, దానిపై తలెత్తిన సందేహాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అందుకే, ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఈ ప్రశ్నలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఓటర్ల జాబితా ఎన్నికల ప్రక్రియకు పునాది. అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండాలి. అనర్హమైన నమోదులను తొలగించాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యతను కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత. సవరణ ప్రక్రియలో భారీ సంఖ్యలో పేర్లు తొలగించినప్పుడు, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగలేదని నిరూపించే పారదర్శక వ్యవస్థ ఉండాలి. అభ్యంతరాలు, అప్పీళ్లు, పేర్ల పునరుద్ధరణకు స్పష్టమైన విధానాలు అమలులో ఉండాలి. సాంకేతిక వ్యవస్థల నిర్వహణలోనూ అధికారులందరికీ తగిన సమాచారం, బాధ్యతలకు అనుగుణమైన ప్రాప్యత ఉండాలి. ఓటు హక్కు వినియోగంపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రజలు పరిశీలించలేని పరిస్థితి ఏర్పడితే, ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలి, ఇద్దరు కమిషనర్లు నమోదు చేసిన అభ్యంతరాలపై తీసుకున్న చర్యలను వివరించాలి, అవసరమైతే స్వతంత్ర పరిశీలనకు సహకరించాలి. ఆరోపణలు నిరాధారమైతే ఆధారాలతో వాటిని ఖండించాలి. ప్రక్రియలో లోపాలు ఉంటే సరిదిద్దాలి. అప్పుడే సిఇసి నిజాయితీ నిగ్గుతేలుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. అయితే కమిషన్‌లో నిర్ణయాలన్నిటినీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పటం ఈ సందర్భంగా గమనించదగింది.