Skip to content
బిజినెస్ › వార్తలు

Microsoft Offers Voluntary Exit Scheme: 4,800 ఉద్యోగాల కోత తర్వాత మైక్రోసాఫ్ట్ మరో సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్

jagan 27 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Microsoft Offers Voluntary Exit Scheme: 4,800 ఉద్యోగాల కోత తర్వాత మైక్రోసాఫ్ట్ మరో సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్

Microsoft Offers Voluntary Exit Scheme

Microsoft Offers Voluntary Exit Scheme: ప్రపంచ ప్రముఖ సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన అంతర్జాతీయ ఉద్యోగ బృందాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో నిర్బంధ లేఆఫ్‌లకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి వైదొలిగేందుకు వీలుగా ‘వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్’ (Voluntary Exit Offer) ను అధికారికంగా ప్రకటించింది. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 60,000 మంది ఉద్యోగులు ఈ ప్యాకేజీకి అర్హులని కంపెనీ వెల్లడించడంతో టెక్ రంగంలో తీవ్ర చర్చ మొదలైంది. రెడ్‌మండ్ ప్రధాన కార్యాలయం తర్వాత మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంజినీరింగ్ కేంద్రమైన హైదరాబాద్ క్యాంపస్‌పై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

లెవల్ 70 అండర్ ఉద్యోగులకు అర్హత – పలు విభాగాలు మినహాయింపు

మైక్రోసాఫ్ట్ అంతర్గత గ్రేడింగ్ నిబంధనల ప్రకారం లెవల్ 70 లేదా అంతకంటే తక్కువ శ్రేణిలో ఉన్న ఉద్యోగులందరికీ ఈ ఆఫర్‌ను పొందేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్లాన్ ఎంచుకోవడానికి ఎటువంటి వయోపరిమితి, కనీస సర్వీసు కాలం లేదా పనితీరు (Performance)తో ప్రమేయం లేదు. అయితే కంపెనీ తన వ్యాపార ప్రాధాన్యతలను బట్టి కొన్ని కీలక విభాగార్థులకు మినహాయింపు ఇచ్చింది. సేల్స్, మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, కొన్ని క్లిష్టమైన ఇంజినీరింగ్ విభాగాల సిబ్బందికి ఈ ఆఫర్ వర్తించదు. దీనికి భిన్నంగా కోపైలట్ (Copilot), కోర్ ఏఐ (CoreAI), విండోస్+డివైజెస్, ఎక్స్‌బాక్స్ గ్యామింగ్, ఫైనాన్స్, , హెచ్‌ఆర్ (HR) విభాగాల్లోని అర్హులైన ఉద్యోగులు ఈ బైఅవుట్ ప్యాకేజీని ఎంచుకుని గౌరవప్రదంగా తప్పుకోవచ్చు. ఆఫర్ అంగీకరించిన వారికి ప్రామాణిక సెవరెన్స్ సెటిల్‌మెంట్‌తో పాటు వేరే కెరీర్ అవకాశాలు వెతుక్కునేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్‌లోని 10 వేల మంది సిబ్బందిపై దృష్టి

ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 23,000 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ , కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని భారీ క్యాంపస్‌లోనే 10,000 మందికి పైగా సిబ్బంది సేవలు అందిస్తుండటంతో, ఇక్కడ పనిచేస్తున్న ఏఐ, హెచ్‌ఆర్, కార్పొరేట్ విభాగాలకు చెందిన ఎంతమంది ఉద్యోగులు ఈ ఆఫర్‌ను ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. భారత్‌లోని బెంగళూరు, చెన్నై, గుర్గావ్, ముంబై, నోయిడా, పుణె ఆఫీసుల్లోని సిబ్బందికి కూడా దీనిపై సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ఏఐ రీ-ఆర్గనైజేషనే ప్రధాన కారణం

నేరుగా లేఆఫ్‌లు ప్రకటించి వివాదాస్పదం కావడం కంటే, కొత్త దిశగా అడుగులు వేయాలనుకునే ఉద్యోగులకు మద్దతుగా ఈ స్వేచ్ఛా నిష్క్రమణ ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆమీ కొలెమాన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాదితో ముగిసే కాలానికి ఏఐ (Artificial Intelligence) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ చిప్‌ల కోసం మైక్రోసాఫ్ట్ రూ. 1.75 బిలియన్ డాలర్ల వరకు భారీ వ్యయాన్ని కేటాయించింది. సంస్థాగతంగా కోపైలట్ వంటి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకం పెరగడం వల్ల తక్కువ మంది మానవ వనరులతోనే ఎక్కువ ఉత్పాదకత సాధించవచ్చని తేలింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు రీ-ఆర్గనైజ్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.