Cyclone Arnab Alert: ఏపీ వైపు అతి తీవ్ర తుపానుగా దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్, విద్యా సంస్థలకు సెలవులు, విహారయాత్రలు రద్దు..
Four Storms Churning at Once
Cyclone Arnab Alert: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘అర్నబ్’ (Cyclone Arnab) వేగంగా బలపడి అతి తీవ్ర తుపానుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు బీభత్సకరమైన వేగంతో దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల వ్యవధిలో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 300 కి.మీ, కాకినాడకు 360 కి.మీ, మచిలీపట్నానికి 460 కి.మీ , బాపట్లకు 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ అర్నబ్ తుపాను మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 28న ఉదయానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ, గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచనున్నాయి.
అల్లకల్లోలంగా విశాఖ తీరం – రుషికొండ బీచ్ మూసివేత
తుపాను తీవ్రత పెరగడంతో విశాఖపట్నం తీరంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా, సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో విశాఖ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అలాగే భీమిలి తీరంలో కూడా అలల ఉద్ధృతి విపరీతంగా పెరగడంతో తీరప్రాంతాల్లో పర్యాటకుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించారు.
కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పునరావాస చర్యలు
అతి తీవ్ర తుపాను ప్రభావం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ , కాకినాడ జిల్లాలపై అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. సముద్రంలో నీటిమట్టం ఒకటిన్నర మీటరు వరకు పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో కాట్రేనికోన, ఐ.పోలవరం వంటి తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి విపత్తు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాకినాడ జిల్లా పరిధిలో ఇప్పటికే 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధి చెందిన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డుపైకి సముద్రపు అలల తాకిడికి భారీగా రాళ్లు కొట్టుకురావడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. హోప్ ఐలాండ్ లో చిక్కుకున్న 130 మంది మత్స్యకారులను తూరంగి వద్ద ఉన్న ఐలాండ్ కాలనీకి సురక్షితంగా తరలించారు. అత్యవసర సహాయం కోసం కాకినాడ జిల్లా కలెక్టరేట్ (0884-2356801, 9849903879), ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.
మొదలైన తుపాను బీభత్సం – ఉత్తరాంధ్రలో విరుచుకుపడుతున్న వర్షాలు
అర్నబ్ తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో వర్షాల ప్రభావం మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే క్రమంలో బుధవారం నాడు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ (Red Alert) జారీ చేసింది. గురువారం వరకు కోస్తాంధ్ర అంతటా అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరించారు.
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత – పాపికొండల విహారయాత్ర రద్దు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఘాట్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాలకు కొండపై నుంచి రాళ్లు, మట్టి పెళ్లలు జారిపడే ప్రమాదం ఉన్నందున భక్తులను కేవలం మహామండపం మార్గం ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు, గోదావరి నదిలో వరద ముప్పు , బలమైన గాలుల కారణంగా పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్-కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి నడిచే 16 పర్యాటక బోట్ల సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. సహాయక చర్యల కోసం ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను రంగంలోకి దించి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది.