E100 కార్లకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి విడుదల..
Ethanol Petrol: ఈ20 పెట్రోల్ దెబ్బకు చక్కెర, కోడిగుడ్ల ధరలు పైపైకి..? కారణం ఇదే..?
E100 Cars: దేశంలో ఎథనాల్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంద శాతం (100%) ఎథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లకు అనుమతినిస్తూ కేంద్ర మోటారు వాహన నిబంధనలలో (Central Motor Vehicles Rules) ప్రభుత్వం సోమవారం సవరణలు చేసింది. కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ సరికొత్త ఈ100 (E100) మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సవరణల ద్వారా ఎమిషన్ నిబంధనలలో ఇప్పటికే ఉన్న ఈ85 (E85) తో పాటు సరికొత్తగా ఈ100 నిబంధనలను కూడా చేర్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ85 , ఈ100 ఇంధనాలు కేవలం ప్రత్యేకంగా డిజైన్ చేసి, ధృవీకరించబడిన వాహనాల కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. సాధారణ కార్లు లేదా ఈ20 (E20) ఇంధనాన్ని వాడే సాధారణ వాహనాలలో ఈ కొత్త ఇంధనాన్ని ఉపయోగించడానికి వీపడదని తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత లేదా భవిష్యత్తులో ఇప్పటికే ఉన్న వాహనాల యజమానులు తమ కార్లను మార్పులు (Modify) చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ నిబంధన వారిని వర్తించదని పేర్కొన్నారు.
బ్రెజిల్, అమెరికా వంటి దేశాలలో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకే ట్యాంక్‌తో వివిధ మోతాదులలో ఎథనాల్, పెట్రోల్ మిశ్రమంతో నడిచేలా ఈ వాహనాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఎథనాల్ వాడకం వల్ల శిలాజ ఇంధనాల (Fossil fuels) ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ల విడుదల గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఎథనాల్ వినియోగం పెరగడం ద్వారా దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.