Skip to content
ప్రపంచం › వార్తలు

Trump’s Immigration Policy: అమెరికా ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ ఉక్కుపాదం.. నెలకు 52 వేల నుంచి 26 వేలకు పడిపోయిన ఇమ్మిగ్రెంట్ వీసాలు..

jagan 19 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Trump’s Immigration Policy: అమెరికా ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ ఉక్కుపాదం.. నెలకు 52 వేల నుంచి 26 వేలకు పడిపోయిన ఇమ్మిగ్రెంట్ వీసాలు..

US Green Card Alert: భారతీయులకు అమెరికా గ్రీన్ కార్డ్‌లో కొత్త చిక్కులు.. సెప్టెంబర్ 18 నుంచి కఠిన నిబంధనలు

Trump’s Immigration Policy: అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన వీసా నిబంధనలు చట్టబద్ధమైన వలసలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 2025 చివరలో ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానాల ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అమెరికాకు వచ్చే చట్టబద్ధ వలసదారుల సంఖ్య ఏకంగా సగానికి పడిపోయింది. ప్రభుత్వ అధికారిక డేటాను విశ్లేషిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల పౌరులను తీవ్రంగా ప్రభావితం చేసింది.

గతంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నెలకు సగటున 52,000 ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసేది. గ్రీన్ కార్డ్ , శాశ్వత నివాస హోదా పొందేందుకు ఈ వీసాలు అత్యంత కీలకమైనవి. అయితే, నూతన ఆంక్షల అమలు తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 26,000 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. ఇది మునుపటితో పోలిస్తే సరిగ్గా 50 శాతం తగ్గుదలను సూచిస్తోంది.

నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో 91 దేశాలకు చెందిన పౌరులకు అమెరికా వలస దాదాపు అసాధ్యంగా మారింది. మరొక 61 దేశాల పౌరులకు కేటాయించే వీసాల సంఖ్యలో కూడా ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఈ విధానాల వల్ల ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ముస్లిం మెజారిటీ దేశాలు: ఈ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలసలు 90 శాతానికి పైగా తగ్గాయి.
సెంట్రల్ ఆసియా: ఇక్కడి నుంచి వలసలు అత్యధికంగా 99% మేర క్షీణించాయి.
ఆఫ్రికా: ఆఫ్రికన్ దేశాల నుంచి వలసలు 89% తగ్గాయి.
తూర్పు యూరప్: ఇక్కడి నుంచి వీసా ఆమోదాలు 84% పడిపోయాయి.
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్): పశ్చిమాసియా ప్రాంతం నుంచి వలసలు 81% మేర తగ్గాయి.

ఈ కఠిన ఆంక్షల నుంచి అమెరికా పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. తత్ఫలితంగా, కెనడా నుంచి అమెరికాకు వచ్చే వలసలు 142 శాతం పెరగ్గా, మెక్సికో నుంచి 17 శాతం పెరగడం విశేషం. జాతీయ భద్రత దృష్ట్యా తనిఖీలను కఠినతరం చేయడం, కొత్తగా వచ్చేవారు అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై భారం కాకుండా చూడటమే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధించినట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంటోంది.

కేవలం శాశ్వత నివాస హోదా కల్పించే ఇమ్మిగ్రెంట్ వీసాలే కాకుండా, విద్యార్థులు, పర్యాటకులు, నిపుణులు, వ్యాపారవేత్తలకు జారీ చేసే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల (హెచ్-1బి మొదలైనవి) సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.