El Niño Threat: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో నీటి కష్టాలు తప్పవా? గోదావరి నీటిపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..
Telangana Identifies Seven Seed Varieties for Farmers
El Niño Threat: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయే తీవ్ర ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద ఉన్న గోదావరి ఆనకట్టను సోమవారం పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రత, నీటి ఎద్దడిని తట్టుకునేందుకు గోదావరి నీటిని నిల్వ చేసే చర్యలను ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసిందని వెల్లడించారు.
వర్షాలు తగ్గి భూగర్భజలాలు గణనీయంగా పడిపోతే, అది కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా తాగునీటి సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. నీటి లభ్యత తగ్గితే భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రికి వివరించానని తెలిపారు. ఇందులో భాగంగానే దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆ పనులను తక్షణమే ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నీటి వనరులను ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు. తీవ్ర నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. దానికి బదులుగా తక్కువ నీటితో, తక్కువ సమయంలో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న నీటి నిల్వ చర్యలు , రైతులు పాటించే ముందస్తు జాగ్రత్తల ద్వారా రాబోయే గండం నుంచి వ్యవసాయాన్ని, తాగునీటి అవసరాలను గట్టెక్కించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.