Telangana Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. హైదరాబాద్లో భారీ వర్ష సూచన
Telangana Rain Alert:
Telangana Rain Alert: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. నాగర్కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
వర్షాలకు కారణమిదే
ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మంగళ, బుధవారాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ట్రాఫిక్కు అంతరాయం
శనివారం సాయంత్రం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
రైతులకు కొంత ఊరట
రాష్ట్రంలో కొంతకాలంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కురుస్తున్న వర్షాలు పంటలకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, విస్తృతంగా వర్షాలు కురిస్తేనే వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరనుంది. రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితిని బట్టి పంటలకు ఎంతమేర మేలు జరుగుతుందో స్పష్టత రానుంది.