Telangana Weather Update: తెలంగాణకు ఉపరితల ఆవర్తన గండం.. రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
Weather Alert
Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు మారిపోనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ అక్టోబర్ 18 (ఆదివారం) తో పాటు తదుపరి రోజులకు సంబంధించి పలు జిల్లాలకు అధికారులు పసుపు రంగు ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) జారీ చేశారు.
ప్రస్తుతం ఉత్తర తమిళనాడు , దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం తీవ్రంగా కొనసాగుతోంది. దీనికి తోడు రుతుపవనాల మలి విడత చురుకుదనం వల్ల ఏర్పడిన ఈ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మబ్బులు దట్టంగా అలుముకుని వర్షపాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు, విద్యుత్ స్తంభాలు , చెట్ల కింద నిలబడే ప్రజలు ఉరుములు, పిడుగుల పట్ల జాగ్రత్త వహించాలని వాతావరణ నిపుణులు సూచించారు.
రాబోయే 24 గంటల కాలంలో అంటే ఆదివారం నాటికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా సుమారు 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవల కాలంలో ఎల్ నినో ప్రభావం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర అల్లాడిపోతున్న ప్రజలకు ఈ ఉపరితల ఆవర్తన వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, హఠాత్తుగా వీచే బలమైన గాలుల వల్ల ఈవినింగ్ టైమ్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. నీటి నిల్వలు ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని , జీహెచ్ఎంసీ సహా స్థానిక అధికారులు అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.