Hyderabad Police Reshuffle: హైదరాబాద్ నగరంలో భారీగా ఎస్ఐల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సజ్జనార్..
Sajjanar
Hyderabad Police Reshuffle: నగరంలో పండగల సీజన్ సమీపిస్తున్న వేళ హైదరాబాద్ పోలీసు శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 75 మంది సబ్-ఇన్స్పెక్టర్లను (ఎస్ఐ) బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్, కంట్రోల్ రూమ్ విభాగాల్లో విధులను నిర్వర్తిస్తున్న అధికారులను ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ముఖ్యంగా ఒకే పోలీస్ స్టేషన్లో సుదీర్ఘకాలంగా తిష్ట వేసి పనిచేస్తున్న అధికారులను ప్రత్యేకంగా గుర్తించి, వారిని వేర్వేరు స్టేషన్లు , విభాగాలకు బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
బదిలీ అయిన ఎస్ఐలందరూ ఎలాంటి కాలయాపన చేయకుండా తక్షణమే తమ కొత్త పోస్టింగ్‌లలో బాధ్యతలు స్వీకరించాలని కమిషనర్ వి.సి. సజ్జనార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శించినా, విధుల్లో ఆలస్యం చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ తీవ్రంగా హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో వరుస పండగలు ఉండటం, నగరంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకునే ఈ ముందస్తు మార్పులు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పండగ సమయాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అసాధారణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ బదిలీలు దోహదపడతాయని భావిస్తున్నారు.