Tiger Shroff Shooting: ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరిక
Tiger Shroff Shooting
Tiger Shroff Shooting: ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జుహూ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ముంబైలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముంబై పోలీసులు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారని, కొందరు అనుమానితులను కూడా గుర్తించారని వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఘటన వెనుక ఉన్న గ్యాంగ్ ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్ర వెలుపల లేదా విదేశాల్లో ఉండి ఈ దాడిని నడిపించిన అసలు సూత్రధారులను కూడా చట్టం ముందుకు తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకోవడంతో పాటు, విదేశాల్లో ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతామని తెలిపారు.
మరోవైపు కుట్ర వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందన్న అనుమానాలపై స్పందిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఇప్పటికే సంబంధిత అభ్యర్థన పంపించామని, దానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. కేవలం కాల్పులు జరిపిన షూటర్లను అరెస్ట్ చేయడంతోనే దర్యాప్తు పూర్తవ్వదని, వెనుక ఉండి ఆదేశాలు ఇచ్చిన ప్రధాన సూత్రధారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జుహూలో అసలు ఏం జరిగింది?
ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి టైగర్ ష్రాఫ్ తన కారులో బయలుదేరుతుండగా.. రాత్రి 7 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా కారుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. అదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి తుపాకీ గాయాలు కాలేదు.
అయితే, సోషల్ మీడియాలో నిందితుల దాడికి సంబంధించి బయటకు వచ్చిన ఫొటోల్లో టైగర్ ష్రాఫ్ భుజం, ఛాతీ భాగాల్లో డ్రెస్సింగ్‌తో పాటు కుడి చేతికి కట్టుతో కనిపించారు. ఆదివారం రాత్రి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వయంగా వెళ్లి టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించారు. ఆ సమయంలో టైగర్ తల్లి ఆయేషా ష్రాఫ్ కూడా ఆయనతో ఉన్నారు. ఈ ఘటనపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నేపథ్యంతో ముంబైలోని సినీ ప్రముఖులు, నటీనటుల భద్రతను పునఃసమీక్షిస్తామని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. అవసరమైతే ప్రస్తుతం ఇస్తున్న భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేస్తామన్నారు. ముంబై పోలీసు వ్యవస్థపై సాధారణ ప్రజలతో పాటు బాలీవుడ్ పరిశ్రమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో శాంతిభద్రతలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, గతంలో తమ పాలనలో జరిగిన ఘటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలని వ్యాఖ్యానించారు.