లక్కీ భాస్కర్ తర్వాత మదర్ రోల్స్ వచ్చాయి…‘ప్రజాపక్షం’ ఇంటర్వ్యూలో హీరోయిన్ మీనాక్షి చౌదరి
‘లక్కీ భాస్కర్’ తర్వాత మదర్ రోల్స్ వచ్చాయి...‘ప్రజాపక్షం’ ఇంటర్వ్యూలో హీరోయిన్ మీనాక్షి చౌదరి
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ సరసన పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. దుల్కర్ సల్మాన్ సరసన ‘లక్కీ భాస్కర్’లో ఒక ఇల్లాలిగా నటించింది. ‘అనగనగా ఒక రాజు’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాల్లో నటిస్తూ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకుంటున్న మీనాక్షి చౌదరి తాజాగా నటించిన చిత్రం ‘వృషకర్మ’. నాగచైతన్య సరసన నటించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ప్రజాపక్షం’కు మీనాక్షి చౌదరి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
ప్రశ్న: మీ నేపథ్యం? మీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి?
మీనాక్షి చౌదరి: నేను హర్యానాలోని పంచకులలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాను. నా తండ్రి, దివంగత బి.ఆర్. చౌదరి, భారత సైన్యంలో కల్నల్‌గా పని చేశారు. నేను చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాను. పంజాబ్ రాష్ట్రం డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి డెంటల్ సర్జరీలో నేను బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాను.
ప్రశ్న: మీరు ‘మిస్ ఫెమినా ఇండియా’ కిరీటాన్ని గెలుచుకున్నారు? అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఎలా వచ్చింది?
మీనాక్షి చౌదరి: నాకు ఎందుకో గానీ చిన్నప్పటి నుంచే అందాల పోటీలు అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో కూడా నన్ను చాలా మంది నా స్నేహితులు నువ్వు అందంగా ఉంటావు అనేవారు. అందాల పోటీల్లో ట్రై చెయ్యమని సలహా ఇచ్చారు. అలా నేను ట్రై చేశాను. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆటమ్ బాల్ నైట్ సందర్భంగా ‘మిస్ ఐఎంఏ’గా ఎంపికయ్యాను. ఇది ప్రతి టర్మ్ చివరిలో సైనిక క్యాడెట్ల శిక్షణా కార్యక్రమం ముగింపును సూచించడానికి నిర్వహిస్తారు. 19 జూన్ 2018న ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2018లో నేను ఫస్ట్ రన్నరప్‌గా కిరీటాన్ని అందుకున్నాను. ఈ పోటీలో ‘మిస్ ఫోటోజెనిక్’ అవార్డు కూడా నాకు దక్కింది. ఫెమినా మిస్ ఇండియా 2019 పోటీల్లో కూడా నేను పాల్గొన్నాను.
ప్రశ్న: మీ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
మీనాక్షి చౌదరి: నా మూవీ కెరీర్ హిందీ ఫిలిమ్స్‌తో స్టార్ట్ అయింది. ‘అప్ స్టార్ట్స్’ (2019) అనే సినిమాలో ఒక చిన్న పాత్రతో నేను నటనను ప్రారంభించాను. అదే సంవత్సరంలో, డ్రామా సిరీస్ ‘డాక్టర్ పోస్టర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించాను. అలా నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం నటిస్తున్నాను. తెలుగులో నేను నటించిన మొట్టమొదటి చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ చిత్రంలో సుశాంత్ సరసన ఆర్కిటెక్చర్ ఇంటర్న్ పాత్రతో నేను టాలీవుడ్‌కు పరిచయం అయ్యాను. తరువాత మీకు తెలుసు కదా… ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో నాకు తెలుగులో మంచి స్టార్డం వచ్చింది.
ప్రశ్న: తాజాగా ‘వృషకర్మ’లో చేసిన దక్ష క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
మీనాక్షి చౌదరి: డైరెక్టర్ కార్తీక్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను డిజైన్ చేశారు. కథ చెప్తున్నప్పుడు కూడా ఈ క్యారెక్టర్‌ను ఎలా చేయాలి అనే విషయంపై చాలా ఆలోచనలు చేశాం. కార్తీక్ ఈ పాత్ర కోసం ఎలాంటి లక్షణాలు అనుకున్నారో, అలాంటి పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశారనే దానిపై నాకు ఒక క్లారిటీ వచ్చింది. దక్ష చాలా ఫోకస్డ్గా ఉండే అమ్మాయి. తనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. తను ఆర్కియాలజీలో థీసిస్ చేస్తుంది. ఈ పాత్ర ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌కు చాలా మంచి గ్రాఫ్ ఉంది. కథ చెప్పిన తర్వాత నాగచైతన్యతో కలిసి రెండు రోజులు వర్క్‌షాప్ చేశాం. డైరెక్టర్ విజన్ ఏంటి? దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అనే విషయాలపై ఒక అవగాహనకు వచ్చాం. వర్క్‌షాప్‌లో చాలా విషయాలపై రిహార్సల్స్ చేశాం. అలాగే ఆర్కియాలజీ గురించి చాలా లోతైన విషయాలు కూడా నేర్చుకున్నాను.
ప్రశ్న: వృషకర్మ సినిమాలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమిటి?
మీనాక్షి చౌదరి: నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. ఇందులో అలాంటి సీక్వెన్సులు ఉన్నాయి. అవి చాలా ఛాలెంజింగ్ అనిపించాయి. అదే సమయంలో చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాయి. అలాగే కొన్ని రఫ్ అండ్ టఫ్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. ఇంతకుముందు ఇంత హెవీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా నేను చేయలేదు. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్.
ప్రశ్న: మీరు హారర్ సినిమాలు ఇష్టపడతారా?
మీనాక్షి చౌదరి: చిన్నప్పుడు ఇంట్లో హారర్ సినిమాలు చూపించేవారు కాదు. ఎందుకంటే పీడకలలు వస్తాయని. కాకపోతే పెద్దయ్యాక అలాంటి సినిమాలను చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా అంగీకరించడానికి అది కూడా ఒక కారణం.
ప్రశ్న: మీ కెరీర్‌ను చూస్తే ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్ర చేస్తున్నారు?
మీనాక్షి చౌదరి: ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయడంపైనే నా దృష్టి ఉంది. కొత్త క్యారెక్టర్స్ ప్రయత్నించాలని కోరుకుంటాను. రెగ్యులర్‌గా ఒకే తరహా పాత్రలు, జానర్స్ వస్తే వాటిని చేయను. ‘లక్కీ భాస్కర్’ చూసిన తర్వాత చాలామంది మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. వాటికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్ చేశాను. కథ, పాత్ర కొత్తగా ఉన్నప్పుడే చేయాలని అనిపిస్తుంది.
ప్రశ్న: కొత్తగా చేస్తున్న సినిమాల గురించి?
మీనాక్షి చౌదరి: కార్తీతో చేస్తున్న సినిమా నా పోర్షన్ అరవై శాతం పూర్తయింది. అది చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. వీటితో పాటు హిందీ, తమిళ్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను.