Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

‘దశహరా’కు వక్ర భాష్యాలు ఆపండి!

Prajapaksham 17 Oct 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
‘దశహరా’కు వక్ర భాష్యాలు ఆపండి!

dussehra festival

డాక్టర్ దేవరాజు మహారాజు,
(కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌)


దశ హరా = దశరా (దసరా) అంటే పది మంది ఓడిపోయారని అర్థం. హరించుకు పోయారని కూడా చెప్పకోవచ్చు. ఎవరు ఆ పది మందీ? అసలు విషయం చెప్పకుండా దశకంఠుడనే రావణుడు చనిపోయాడు గనుక, ఇది దశహరా అని చెప్తారు. రావణుడు రామాయణంలో ఓ కల్పిత పాత్ర. రాముడు ఎలాగైతే ఓ కల్పిత పాత్రో రావణుడు కూడా అలాగే ఓ కల్పిత పాత్ర. ఒక కావ్యంలో ఒక పాత్ర చనిపోతే అర్థం లేకుండా? దాని ఆధారంగా రావణుడి ప్రతిమను పెద్ద ఎత్తున తగలబెట్టడం కొందరు చేస్తే, దానికి విరుద్ధంగా రాముడి ప్రతిమను మరి కొందరు తగలబెడుతున్నారు. వీటికి పైగా, రావణ్‌లీలా/రామ్‌లీలా అని పేర్లు పెట్టుకోవడం అవసరమా? భ్రమల్లో బతికే వారికి బాగా ఉంటుందేమో గానీ, వాస్తవాలు తెలుసుకోదలుచుకుంటే అవి వేరే విధంగా ఉంటాయి.
ఈ దేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. ఆయనే ఆ వంశంలో మొదటి రాజు. అలాగే చివరి రాజు బృహదత్తు మౌర్య. వీరి మధ్య మొత్తం పది మంది మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇక్కడ చివరి రాజు బృహదత్తుడి దగ్గర మోసపూరితంగా ఒక బ్రాహ్మణుడు సైన్యాధ్యక్షుడయ్యాడు. అతని పేరు పుష్యమిత్ర శృంగుడు. అదను చూసి, పుష్యమిత్రుడు రాజు బృహదత్తు మౌర్యను హత్య చేస్తాడు. దానితో పది తరాలుగా వస్తున్న మౌర్య వంశం వారి సామ్రాజ్యం పతనమయ్యింది. అసలు దశహరా అంటే ఇది. దీన్ని కప్పిపుచ్చడానికి పదితలలున్న రాక్షస రాజును సృష్టించి కథలు అల్లారు. పది తరాలుగా వస్తున్న మౌర్యవంశం పతనమైందనీ, తమ శృంగుల రాజ్యం స్థాపించబడిందనీ పుష్యమిత్ర శృంగు డు తన బ్రాహ్మణ వర్గీయులతో చేసుకున్న విజయోత్సవమే దశహరా. మౌర్య చక్రవర్తులంతా బౌద్ధాన్ని అనుసరించిన వారు. మౌర్యుల కాలంలో బ్రాహ్మణుల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శ్రార్ధ కర్మలు ఉండేవి కావు. హింసాత్మకంగా బలులు ఇచ్చేవారు కాదు. విగ్రహారాధన, పూజలు, అర్చనలు ఉండేవి కావు. ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయడం చేతకాని బ్రాహ్మణులకు గుడ్డుకాలం దాపురించింది. ఎలాగైనా బౌద్ధాన్ని నాశనం చేయాలి. మౌర్య సామ్రాజ్యాన్ని పడగొట్టాలి. తమ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి… కూర్చుని తింటూ ఉండాలి! అని కుట్రలకు, కుతంత్రాలకు పూనుకున్నారు. హింసకు కూడా వెనుకాడలేదు. రాజు పుష్యమిత్ర శృంగుడు బౌద్ధ భిక్షువుల తలలు నరికి తెమ్మన్నాడు. ఒక్కొక్క తలకు వంద వరహాలిస్తానని కూడా ప్రకటించాడు. ఇకనేం? బౌద్ధ భిక్షువలు లెక్కలేనంత మంది నరికి చంపబడ్డారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపొయ్యారు.
జమ్మిచెట్టు ఆచారం
దసరా రోజు జమ్మి చెట్టును దర్శించి, దాని ఆకు తీసుకుని బంధుమిత్రుల్ని కలవడం ఆచారంగా వస్తోంది. దానికి చెప్పిన కథ ఏమిటీ? మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలు జమ్మిచెట్టు మీద పెట్టారని. అవి ఇతరులకు శవంలాగా కనిపిస్తాయని చెపుతారు. అవి తీసుకుని, మహాభారత సంగ్రామానికి పాండవులు బయలుదేరి వెళ్ళారని చెపుతారు. అసలు చెట్టు మీద శవం కనబడితే ఎవడూ పైకెక్కి ఏమిటీ అని చూడడా? ఆనాటి ఆ ప్రజలు అంత పిరికి వారా? సరే, ఆ విషయం వదిలేద్దాం. దశహరా అని ఒకటి రామాయణం కథ చెప్పారు. మరొకటి భారతం లోది చెప్పారు. అంటే ముక్కలు ముక్కలుగా అతుకుల బొంతలాంటి కథలు చెప్పడమేనా మనువాదుల పనీ? సరే దీని గూర్చిన వాస్తవాలేమిటీ? చరిత్ర ఏం చెపుతుందో చూద్దాం మొదట క్రూరుడిగా ఉన్న అశోకుడు కళింగను ఆక్రమించుకోవడానికి అతి భీకరంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. అంతర్మథనానికి లోనయ్యాడు. యుద్ధంతో మానవాళికి జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్నాడు. బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడయ్యాడు. ఫలితంగా యుద్ధం ముగిసిన పది రోజుల తర్వాత సరిగ్గా దశమి రోజున బౌద్ధ ధమ్మ దీక్ష సీకరించాడు. విజయం సాధించినందుకు ఆ దశమి విజయ దశమి అయ్యింది. ఆ రోజు తన రాజ్యమంతా విజయోత్సవాలు, వేడుకలు చేసుకోవాలి. కానీ, అందుకు భిన్నంగా అదే దశమి రోజున బుద్ద విగ్రహం పాదాల దగ్గర తన ఆయుధాలు పెట్టి, అశోకుడు అహింస సిద్ధాంతాన్ని స్వీకరించాడు. బౌద్ధ గురువు మొగలి పుత్త తిస్స ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధం వ్యాపించడానికి అశోకుడు చేసిన విశేషమైన కృషి ఏమిటో మనకు తెలుసు. దేశ వ్యాప్తంగానూ. విదేశాల్లోనూ ఉన్న బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు, ఆరామాలే ఆనాటి వాస్తవాల్ని ఈ నాటికీ వివరిస్తూనే ఉన్నాయి. అసలు విజయ దశమి రోజున జరిగింది ఇదయితే వైదిక సంప్రదాయ వాదులేం చేస్తున్నారూ? రక్తం తాగుతున్న దేవతా (స్త్రీ) మూర్తిని పెట్టుకుని, దానికి ఎదురుగా జంతువుల్ని బలి ఇస్తున్నారు. ఆ దేవతామూర్తి చేతిలో కూడా ఖడ్గం ఉంటుంది. అది రక్తసిక్తమైందన్నట్టుగా ఆ బొమ్మ ఖడ్గానికి ఎరుపు రంగు పూస్తారు. అంటే హింసను ప్రేరేపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారన్నమాట! గొర్రెపిల్ల మెడను ఒకడు పంటితో కొరికి చంపడం, ఆ రక్తంతో దేవతా మూర్తులకు అభిషేకాలు చేయడం ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారాలు. ఇలాంటివి ఇంకా అవసరమా? అని జనం ఆలోచించాలి కదా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ‘శాంతిని బోధిస్తున్న బౌద్ధానికి వ్యతిరేకంగా బ్రాహ్మనిజం చేస్తున్నదే ఈ విజయదశమి’ అని!
మనుస్మృతి రచన
బౌద్ధాన్ని నాశనం చేయడానికి చేసిన ఎన్నో కుతంత్రాలలో భాగమే మనుస్మృతి రచన! దాని ప్రకారమే రాజును, రాజ్యాన్ని తమ చెప్పు చేతలలో ఉంచుకుని తమ స్థానాన్ని రాజగురు స్థానంలో లేదా పండిత/పూజారి స్థానాల్లో మహోన్నతంగా స్థిరపరుచుకున్నారు మతాచార్యులు. మిగతావారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, వారి రెక్కల కష్టాన్ని దోచుకుతింటూ శతాబ్దాలుగా కాలం గడుపుతూ వస్తున్నారు. ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకున్న డా: బి.ఆర్‌.అంబేద్కర్‌ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశాన్ని మౌర్యులు, నాగ వంశ పాలకులు పరిపాలించారు. ఈ నాగజాతి వారంతా బౌద్ధులే! వారే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రచారం చేశారు. నాగజాతి వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతం నాగపూర్‌. అక్కడ ప్రవహించే నది నాగానది. ఇలాంటి చారిత్రక అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన తర్వాత డా.అంబేద్కర్‌ 1956లో అక్టోబరు 14న దీక్షభూమి, నాగపూర్‌లో విజయదశమి రోజు బౌద్ధం స్వీకరించారు. అంటరానితనం అంతరించాలనీ, మనుషులందరికీ సమాన స్థాయీ, హక్కులూ ఉండాలన్నది ప్రధానంగా ఆయన కోరుకున్నారు. ఆయన స్వీకరించడమే కాకుండా, ఆయన అనుయాయుల్ని ఆరులక్షల మందిని బౌద్ధంలోకి తీసుకుపోయారు. ఈ కార్యక్రమమంతా ‘భదంత్‌ చంద్రమణి మహాథేరో, భంతే ప్రజ్ఞాతిస్స, యం.సంఘ్‌ రతన్‌ మహాథేరో’ ఇంకా బౌద్ధ భిక్షుల ఆధ్వర్యంలో జరిగింది. అంబేద్కర్‌ మరణం తర్వాత కూడా అధిక సంఖ్యలో ఆయన అనుచరులు బౌద్ధం స్వీకరిస్తూ వచ్చారు. బౌద్ధానికి ఈ దేశంలో ఒకప్పుడు ఉన్న ఆదరణ ప్రస్తుతం లేకపోవచ్చు కానీ, ఆధునిక కాలంలో కూడా అంతరించిపోకుండా స్థిరంగా కొనసాగుతూ ఉంది. మతాల పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న దుశ్చర్యలకు విసిగిపోయి మానవ వాదులంతా బ్రాహ్మనిజం సమాజంలో అసమానత్వాన్ని ప్రభోదిస్తే, బౌద్ధం సమానత్వం కోసం పాటుపడింది. అందువల్ల మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే వారంతా ఈ వైపుకురావడం తథ్యం!
మొఘలుల కాలం నుండి, బ్రిటీషు కాలం నుండి హిందూ మతస్తులు చాలా మంది ముస్లిం, క్రైస్తవ మతాల్లోకి ఎందుకు మారారు? హిందూ మతంలోని అమానవీయ అంశాలకు విసిగి, వేసారి మారారు అనేది నిజం!. ప్రపంచంలో ఎక్కడా లేని సతీసహగమనాన్ని ఎలా సమర్థించుకుంటారూ? స్త్రీలను నిమ్నవర్గాల్లో కలి పి, వారికి చదువు, స్వేచ్ఛా లేకుండా ఎందుకు చేశారు? వారి శ్రమను ఎందుకు దోపిడి చేశారు? జంతువులకన్నా హీనంగా అంటరానితనాన్ని ఎందుకు పాటించారు? ఇలాంటి అతి నీచమైన పద్ధతులు ఉండడం వల్లనే, వాటి ని తప్పించకోవడానికి కొందరు ఇతర మతాల్లోకి పారిపోయారు. ‘ధర్మం’ పేరుతో ఆలయాలు కట్టేవాళ్లు, పునరుద్ధరించేవాళ్లు పునరాలోచించుకోవాలి. వాళ్లు పెంచేది బిచ్చగాళ్ల సంఖ్యే తప్ప మరేమీ కాదు. జీవితకాలమంతా అట్టడుగు వర్గాల ప్రయోజనం కోసం నిలబడ్డ వాళ్లు సైతం, ఈ రోజు ప్లేటు ఫిరాయించి మనువాద స్వాముల కాళ్లమీద పడి భజనలు చేస్తూ దిగజారి పోతున్నారు.
బుద్ధుడి ప్రభావాన్ని కాదనలేకే కదా అతణ్ణి తమ కాల్పనిక దశవతరాల్లో చేర్చుకున్నారు. ఒక చారిత్రక పురుషుడైన బుద్ధుడి ఆహార్యం, జీవితాంశాలు తీసుకునే కదా పురాణ పురుషుడైన రాముడి పాత్రకు రూపకల్పన చేసుకున్నారు. సాధారణ శకానికి పూర్వం (బిసిఇ) ఆరవ శతాబ్ధం నుండి సాధారణ శకం(సిఇ)లోని పదిహేనవ శతాబ్ధం వరకు సుమారు రెండు వేల ఏళ్లు ఈ దేశంలో బౌద్ధం విలసిల్లింది. తర్వాత కాలంలో దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒకప్పటి శృంగులు, తర్వాత కాలాల్లో త్రిమతాచార్యులు అంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వారి వారి అనుయాయులు కొన్ని శతాబ్ధాలుగా అహేతుకమైన, అసంబద్ధమైన దేవీదేవతల మహిమలు ప్రచారం చేసి సమాజాన్ని మూఢత్వంలోకి లాగారు. ఇప్పుడు అందులోంచి బయటపడడం జనానికి చాలా కష్టంగా ఉంది. నిజాలు తెలుసుకుని జనం ఎక్కడ వివేకవంతులవుతారోనని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల సొమ్మును ఆలయాలకు, విగ్రహాలకు ఖర్చుపెడుతున్నాయి. ఇది మనం చూస్తున్నదే! దీని వల్ల దేశం వెనకడుగులు వేయడమే తప్ప ముందడుగు వేసినట్టు ఎంత మాత్రమూ కాదు!