Dasara Navaratri 7th Day: నేడు దసరా నవరాత్రుల 7వ రోజు మహాలక్ష్మీ అమ్మవారి అలంకారం… పూజా విధానం, విశిష్టత, నైవేద్యం, వస్త్రం రంగు వంటి విశేషాలు మీకోసం..
Dasara Navaratri 7th Day
శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఏడవ రోజు అత్యంత పవిత్రమైనది. జగన్మాత ఈ రోజు అష్టైశ్వర్య ప్రదాత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. క్షీరసాగర మథనం సమయంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవి సర్వ శుభాలకు, ధనధాన్యాలకు, సుఖసంతోషాలకు మూలకారకురాలు. విజయవాడ ఇంద్రకీలాద్రితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శక్తిపీఠాలు, దేవీ ఆలయాలలో అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. పద్మాసనంలో ఆసీనురాలై, చతుర్భుజాలతో, అభయ వరద హస్తాలు కలిగి ఉన్న అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు తొలగి, ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
మహాలక్ష్మీ అలంకార ప్రాశస్త్యం , విశిష్టత
నవరాత్రులలో ఏడవ రోజు మహాలక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దుర్గమ్మ అవతారాల్లో లక్ష్మీదేవి రూపం సౌమ్యమైనది, సమృద్ధిని ఇచ్చేది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, నివాసంలో శాంతి సౌఖ్యాలు కోరుకునేవారు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి చేతిలో ఉండే పద్మం పవిత్రతకు, అభయ హస్తం అభయానికి, వరద హస్తం భక్తుల కోరికలను తీర్చడానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
ప్రియమైన వస్త్రం రంగు , పూజా పుష్పాలు
ఈ రోజు అమ్మవారి పూజకు గులాబీ లేదా కనకాంబరం రంగులు అత్యంత శ్రేష్ఠమైనవి. మహాలక్ష్మీ అమ్మవారికి గులాబీ లేదా ఎరుపు రంగు పట్టు వస్త్ర సమర్పణ చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. పూజలో తామర పువ్వులు, ఎర్రటి గులాబీలు, శంఖు పూలు , నూరిన చందనాన్ని ఉపయోగించి అర్చించడం శుభప్రదం. మహాలక్ష్మీదేవి కమలవాసిని కాబట్టి, తామర పువ్వులతో అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, ఈ రోజు సాయంత్రం వేళ దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా నివాసముంటుందని నమ్ముతారు.
నైవేద్యం , పూజా విధానం
ఈ రోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షీరాన్నం లేదా పరమాన్నం, దద్ధ్యోజనం, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ముఖ్యంగా ఆవుపాలు, బియ్యం, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం పెంపొందుతాయి. ఉదయం సూర్యోదయ వేళలో శౌచం పూర్తయ్యాక దేవీ పూజను ప్రారంభించి, మహాలక్ష్మి మంత్రాలను పఠిస్తూ ధ్యానం చేయాలి. మహాలక్ష్మీ పూజతో పాటు ఈ రోజు కనకధారా స్తోత్రం లేదా శ్రీసూక్తం పఠించడం ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
మహాలక్ష్మీ దేవి మంత్రం , స్తోత్రం
మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఈ రోజు పఠించాల్సిన ముఖ్యమైన మంత్రం , స్తోత్రం ఇక్కడ ఇవ్వడమైనది.
ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మ్యై
అస్మాకం కార్యసిద్ధిం కురు కురు స్వాహా.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే.
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే.
సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే.
ఈ విధంగా నవరాత్రులలో ఏడవ రోజైన నేడు మహాలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అష్టైశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు.