Nobel Peace Prize 2026 Navi Pillay: బస్సు డ్రైవర్ కుమార్తె నుంచి నోబెల్ శాంతి బహుమతి విజేతగా…
Navi Pillay
Navi Pillay: “శాంతి చట్టం” వ్యాప్తికి ఆమె చేసిన కృషికి లభించిన ఈ బహుమానం భారతీయులుగా మనకూ గర్వకారణం. ఎందుకంటే, ఆమె తమిళ ఒప్పంద కార్మిక కుటుంబం మనుమరాలు. ఆమె తాత కుటుంబం 1890ల్లో చెరకు తోటల్లో పనిచేయటానికి నాటల్(దక్షిణాఫ్రికా) వెళ్లారు. ఇండియన్ యూనివర్శిటీలో తనకు లభించిన మండేలా అవార్డును ఆమె తమ కుటుంబంలాగా 1860ల నుంచి వలసవచ్చి దాదాపు బానిస పరిస్థితుల్లో పనిచేసిన వేలాదిమందికి అంకితం చేశారు. అది ఆమె జీవిత గమ్యాన్ని సూచించింది.
Navi Pillay: 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయకోవిదురాలు నవీ పిళ్లయ్‌కి దక్కింది. ఓస్లో పోడియం నుంచి కమిటీ చైర్మన్ జోర్గన్ వట్నీ ఫ్రైడ్నెస్ శుక్రవారం చేసిన ఈ ప్రకటన ఆమెతోపాటు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నోబెల్ కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రకటన చేసినపుడు 85 సంవత్సరాల వృద్ధనారి నవీ పిళ్లయ్ న్యూరెంబర్గ్‌లో మానవ హక్కుల న్యాయవాదుల సమావేశంలో ఉన్నారు. ఆమె కమిటీ ఫోన్ అందుకోలేదు. ఆమె కన్నా ఆమె స్నేహితులకే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ముందుగా తెలిసింది. సమాచారం తెలిశాక ఆమె తొలి స్పందన “నిజమా?” ఔను నిజం. ప్రవాస సంతతికి చెందిన నవీని ఈ బహుమతి వరించటం నిజంగా చరిత్రాత్మకం. “శాంతి చట్టం” వ్యాప్తికి ఆమె చేసిన కృషికి లభించిన ఈ బహుమానం భారతీయులుగా మనకూ గర్వకారణం. ఎందుకంటే, ఆమె తమిళ ఒప్పంద కార్మిక కుటుంబం మనుమరాలు. ఆమె తాత కుటుంబం 1890ల్లో చెరకు తోటల్లో పనిచేయటానికి నాటల్(దక్షిణాఫ్రికా) వెళ్లారు. ఇండియన్ యూనివర్శిటీలో తనకు లభించిన మండేలా అవార్డును ఆమె తమ కుటుంబంలాగా 1860ల నుంచి వలసవచ్చి దాదాపు బానిస పరిస్థితుల్లో పనిచేసిన వేలాదిమందికి అంకితం చేశారు. అది ఆమె జీవిత గమ్యాన్ని సూచించింది.
ఆమె జీవితం కృషి గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్లేముందు, నోబెల్ శాంతి బహుమతిని ఆశించి రెండవసారి భంగపడిన నిరాశోపహతుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాధను పంచుకుందాం. ఇరాన్‌పై అంతర్జాతీయ న్యాయచట్టానికి విరుద్ధంగా 8నెలలకు పైబడి బాంబుదాడుల యుద్ధం సాగిస్తున్న ఈ పెద్దమనిషి శాంతి బహుమతిని ఆశించటమే విడ్డూరం. ఆ ఆకాంక్షను బహిరంగంగా వ్యక్తం చేయటం, నోబెల్ కమిటీని నిందించటం మరో వింత. తాను 8 యుద్ధాలు ఆపుదల చేశానని, ఆ విధంగా ప్రపంచ శాంతిని కాపాడానని, అందువల్ల నోబెల్ బహుమతి తనకు రావాలని గత సంవత్సరం(2025) కూడా ఆయన క్లెయిం చేశారు. ఇజ్రాయెల్, పాకిస్థాన్ లాంటి బహుకొద్ది తొత్తుదేశాలే ఆయన పేరు ప్రతిపాదించాయి. అయితే బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోను వరించింది. కాగా వెనిజులా ఆయిలు సంపదపై కన్నువేసిన ట్రంప్ ఈ ఏడాది జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను సతీసమేతంగా మాదక ద్రవ్యం మాఫియా వంటి దుర్మార్గపు ఆరోపణతో సైనిక బందిపోటుతనంతో కిడ్నాప్ చేయించి అమెరికాలో జైల్లోపెట్టి కేసులు బనాయించాడు. మళ్లీ ఈ సంవత్సరం (2026) పాతపాటే పాడుతూ శాంతి బహుమతిని ఆశించి భంగపడ్డాడు. నోబెల్ కమిటీని బెదిరించాడు కూడా. తాను అధికారం చేబట్టిన 48గంటల్లోనే రష్యా యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్, ఇయు ఒత్తిడికి లొంగి ఉక్రేన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతిస్తూ రష్యాను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రయిక్ తదుపరి భారత్ యుద్ధాన్ని తాను నిలువరించానని ట్రంప్ చెప్పుకోవటాన్ని భారత్ నిరాకరించినా ఆయన అలా చెప్పుకోవటంలో సెంచరీ కొట్టాడు. ఏకపక్ష టారిఫ్ విధానాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కల్లోల పరిచాడు. ఆయన నోబెల్ శాంతి బహుమతిని ఆశించటమే వింత. బరాక్ ఒబామాకు ఎందుకు శాంతి బహుమతి ఇచ్చారో తనకు అర్ధం కావటం లేదని అనటంలోనే ట్రంప్ ఈర్ష్య, జాత్యహంకారం ప్రదర్శితమవుతున్నాయి.
శ్రీమతి నవీ పిళ్లయి 1941 సెప్టెంబర్ 23న దర్బన్ శివారు మురికివాడలో నవనీతం నాయుడు ఐదవ సంతానంగా జన్మించారు. ఆమె తండ్రి నారాయణస్వామి బస్సు డ్రైవర్. నవీ తమ ఐదవ ఏట తననుండి 5 పౌండ్లు గుంజుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. అతనికి శిక్ష పడింది కాని ఆ డబ్బులు తిరిగి రాలేదు. తీర్పుకు మధ్యనున్న ఈ అగాధానికి వ్యతిరేకంగా ఆమె 70ఏళ్లుగా పోరాడుతున్నారు. దర్బన్‌లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి మహిళ ఆమె. పిళ్లయ్ భర్తపేరు నుంచి వచ్చింది. ఎఎన్‌సి, యూనిటీ మూవ్మెంట్, నల్లజాతి చైతన్య ఉద్యమం నుండి ఆమెకు క్లెయింట్లు వచ్చేవారు.
1995లో అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆమెను హైకోర్టు జడ్జీగా నియమించారు. దేశంలో శ్వేతజాతియేతర తొలి మహిళా జడ్జీ ఆమెయే. సంవత్సరంలోనే ఐరాస జనరల్ అసెంబ్లీ ర్వాండాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్‌కు ఆమెను ఎన్నుకుంది. ఆమె అక్కడ నాలుగేళ్లు దాని ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2003 నుంచి ఐసిసిలోని అప్పీల్స్ చాంబర్లో జడ్జీగా పనిచేశారు. వికీలీక్స్‌పై ఆర్థిక ఒత్తిడికి అభ్యంతరం చెప్పారు. ఎల్జిబిటి హక్కులపై ఐరాస తీర్మానాన్ని బలపరిచారు. 2013లో, శ్రీలంకలో అంతర్యుద్ధం ముగింపులో తమిళ ప్రజలపై అత్యాచారాలను ఖండించారు. గాంబియా 2019లో రొహింగ్యాల విషయం లో మయన్మార్‌పై తమ ఊచకోత కేసులో ఆమెను తాత్కాలిక జడ్జిగా నియమించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై ఐరాస దర్యాప్తు కమిషన్ చైర్మన్‌గా 2025 నవంబర్ వరకు పనిచేశారు. హమస్, ఇజ్రాయెల్ రెండూ 2024 జూన్‌లో యుద్ధ నేరాలకు ఒడిగట్టాయని, ఇజ్రాయెల్ 2025 సెప్టెంబర్‌లో గాజాలో మానవ సంహారానికి పాల్పడిందని ఆ కమిషన్ నిర్ధారించింది. మానవ హక్కులు, చట్టం న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి నవీ పిళ్లయి.