ఆర్టీసి కార్మికులకు పరీక్షా సమయం
TGSRTC
9వ తేదీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో వివేకంతో ఓటు భవిష్యత్తుకు బాట :
తొత్తు సంఘాలను గెలిపిస్తే మొదటికే మోసం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్టీసి) ఒక సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటుంది. కార్పోరేషన్, ప్రభుత్వం లో విలీనానికి మధ్య ఊగిసలాడుతుంది. ఈ సంక్లిష్ట స్థితిలో దశాబ్దకాలం తర్వాత కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. విలీన ప్రక్రియ సజావుగా పూర్తి కావాలం టే కార్మిక పక్షపాత సంఘాలను గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసిలో 36వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వేలకోట్ల రూపాయల ఆస్తులు ఆర్ట్టీసికి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ట్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తయినా తెలంగాణలో మాత్రం ఆ ప్రక్రియకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో గుర్తింపు సంఘానికి సంబంధించి ఎన్నికలు జరిగాయి. 2019 నుండి అప్పటి ప్రభుత్వం ఆర్టిసిలో యూనియన్లను రద్దు చేసింది. ఎప్పుడైతే యూనియన్లు రద్దయ్యాయో అప్పటి వరకు యూనియన్ లీడర్లుగా చలామణి అయిన అనేక మంది ముఖం చాటేశారు.
కార్మిక సమస్యలను పట్టించుకోలేదు. సంఘం లేనప్పుడు ఎవరు ఏమైతే ఏమన్న భావనతో ఉండగా ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతూనే ఉంది. కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసింది. ధర్నాలు, గేట్ మీటింగ్‌లు, నిరాహార దీక్షలు, నిరసనలు, చలో హైదరాబాద్, చలో ఇందిరా పార్కు, చలో బస్ భవన్, అసెంబ్లీ ముట్టడి లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ఎంప్లాయీస్ యూనియన్‌తో పాటు టిఎం యు, ఎన్‌ఎంయు మరికొన్ని సంఘాలతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు సమ్మె చేసి ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వా న్ని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. అంతే కాదు 2021 వేతన సవరణకు ఈ ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ యూనియన్ కూటమి ఒప్పించగలిగింది, ఇది చారిత్రక సత్యం. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై ఒక కమిటీని వేయించి ఆ కమిటీ రిపోర్టును కూడా ప్రభుత్వం అంగీకరించే విధంగా చేయడంలో జెఎసి విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 56 వేలమంది ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 36వేలకు పడిపోయింది. అయినా ఉన్న కార్మికులు ఆర్టిసి ఆదాయానికి గండిపడకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో తీవ్రమైన శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఎనిమిది గంటల డ్యూటీ అనేది భూతద్దంతో చూసినా కనిపించడం లేదు. పని భారంతో విధుల్లోనే ఉంటూ కార్మికులు ప్రాణాలను కోల్పోతున్నారు. 16 నుంచి 18 గంటల పాటు డ్యూటీలు చేయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బదిలీల విషయంలో యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. చివరకు ఆర్టిసి పరిస్థితి రిటైర్‌మెంట్లు తప్ప రిక్రూట్‌మెంట్లు లేని పరిస్థితికి దిగజారింది. ఇప్పుడు ఇటువంటి ఒక సంక్లిష్ట స్థితిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దశాబ్దకాలం పాటు కార్మికులను పట్టించుకోని కొన్ని సంఘాలు అధికార అండతో తిరిగి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. గతంలో ఆర్టీసి కార్మికులను చిన్నాభిన్నం చేసి వంచించిన కొందరు నేతలు తిరిగి ఇప్పుడు అధికారానికి తొత్తుగా మారి కార్మికులను మళ్లీ వంచించేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులు చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన సమయం ఇది. మరల తొత్తు సంఘాలను గెలిపిస్తే విలీన ప్రక్రియ మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. విలీన ప్రక్రియలోనూ కార్మికులు ఆశించిన రీతిలో ఒప్పందాలను తొత్తు సంఘాలు అమలు చేయకపోవచ్చు. ఈ రాష్ట్రంలో ఆర్టిసికి అపారమైన ఆస్తులు ఉన్నాయి. ఒక పక్క విలీనం, మరో పక్క కార్మికుల డిమాండ్లు అన్నింటికి మించి ఆర్టీసి పరిరక్షణకు సంబంధిం చి తొత్తు సంఘాలతో అత్యంత ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వంలోని కొంత మంది అమాత్యులు తొత్తు సంఘాలను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తొత్తు సంఘాలను గెలిపిస్తే ఆర్టిసిని తమ కబంధ హస్తాల్లో బందీని చేయవచ్చునన్న ఆలోచనతోనే కార్మికులను వంచించిన నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసి పరిరక్షణ, విలీనం ఈ రెండు కూడా కార్మిక పక్షపాత సంఘాలతోనే సాధ్యమవుతుంది. డబ్బుతోనే అదీ అని నమ్ముతున్న అధికార పార్టీ నేతలు ఆర్టీసి ఎన్నికల్లో నూ డబ్బులు ఎరవేసి తొత్తు సంఘాలను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరి వారిని గెలిపించడం ద్వారా మరోసారి కార్మికులు మోసపోయే అవకాశం ఉంది. ఈనెల తొమ్మిదిన జరిగే ఎన్నికల్లో కార్మికులు యూనియన్లకు అతీతంగా ఆర్టిసి పరిరక్షణే ధ్యేయంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్, ఎన్‌ఎంయు, టిఎంయు కూటమిని గెలిపిస్తే కార్మిక హక్కులు పరిరక్షించడంతో పాటు ప్రభుత్వంపై పోరాడి మరికొన్ని హక్కులను సాధించడంతో పాటు విలీన ప్రక్రియలో కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే అవకాశం ఉంది. తొత్తు సంఘాలను గెలిపిస్తే ప్రభుత్వం చెప్పిన దానికి తానా తందానా అంటూ 36వేల మంది కార్మికుల జీవితాలను బలిపెట్టే అవకాశం ఉంది. ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలోని కూటమికి రాష్ట్ర గుర్తింపుకు, బస్సు గుర్తుకు, స్థానిక గుర్తింపుకు సంబంధించి కాగడ గుర్తుకు, టిఎంయు నిచ్చెన గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాల్సి ఉంది. యూనియన్ల కంటే ఆర్టిసి పరిరక్షణ పైనే కార్మికులు ఆలోచన చేయాల్సి ఉంది.
కార్మిక శ్రేయోభిలాషి