Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఏకాకి అయిన సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌

Prajapaksham 07 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఏకాకి అయిన సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌

cec gyanesh kumar

తటస్థతకు ప్రతీకగా గౌరవం పొందాల్సిన భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ), దాని ప్రధానాధికారి (సిఇసి) జ్ఞానేశ్‌కుమార్‌ నడవడిక కారణంగా ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా చెప్పుచేతల్లోని పనిముట్టు అనే ఆరోపణకు గురై ప్రజలముందు ఏకాకిగా నిలబడటం ఉజ్వలమైన భారత ప్రజాతంత్ర చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సందర్భం. యావత్‌ రాజకీయ వ్యవస్థలో ఒక్క బిజెపి, దాని ఎన్‌డిఎ భాగస్వాములు తప్ప సిఇసిని బలపరిచేవారు లేరు. ఒకవైపు, ఓట్లు రివిజన్‌ను ఓటర్ల ఏరివేతగా మార్చిన ఆయన కుత్సితానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రతిపక్షం (కలసికట్టుగా, వేర్వేరుగా), విద్యార్థులు, జన్‌జీలు, పౌరసమాజ సంస్థలు ఈనెల 2 నుంచి ప్రారంభించిన ఆందోళన మంగళవారం ఐదవరోజుకు చేరుకుంది.

230 మందికిపైగా ప్రతిపక్ష ఎంపిలు విజ్ఞాపన పత్రం సమర్పించేందుకై ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి తలపెట్టిన ప్రదర్శనను పోలీసులు నిలువరించారు. కొందరిని బస్సుల్లో తరలించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధి నాయకత్వంలో చాలామంది ఎంపిలు ఆకాశవాణి భవన్‌ ఆవరణలో బైఠాయించారు. వారిని ఖాళీ చేయించేందుకు పోలీసు అధికారులు పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. శాంతియుతంగా నిరసన తెలియజేయటం తమ రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఇక్కడ తమ బైఠాయింపు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మరో ప్రదేశం చూపమని రాహుల్‌గాంధి కోరారు. సిఇసిని కలిసి మెమోరాండం ఇవ్వకుండా తాము వెనక్కివెళ్లబోమని స్పష్టం చేశారు.

చివరకు 8గంటలపాటు ఉద్రిక్తత తర్వాత రాహుల్‌ సహా ఎంపిలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదేరోజున దేశవ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమి పార్టీలు జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ప్రదర్శనలు జరిపారు. ఓటు చోరీ, ‘సర్‌’లో అక్రమాలకు వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన ఇప్పుడు ‘ఓటును రక్షించుకుందాం’, ‘దేశాన్ని కాపాడుకుందాం’ అనే నినాదాలతో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా పరిధి విస్తరించుకుని గ్రామాల వరకు వెళ్లింది. ఇంతటి విస్తృత ప్రజా ఉద్యమాన్ని దేశం ఇటీవలి దశాబ్దాల్లో చూచి ఉండలేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని కూడా కలుపుకుని ‘ప్రజాసేవలో నరేంద్రమోదీ పాతికేళ్లు’ కాలాన్ని ఒక పెద్ద ఉత్సవంగా బిజెపి జరుపుకుంటుండగా, సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌ను వెనుక ఉండి ఆడిస్తున్న మోదీ, జ్ఞానేశ్‌ కుమార్‌తోపాటు రాజీనామా చేయాలనే డిమాండ్‌ కూడా రావటం దేశంలో ప్రజల మధ్య బిజెపి అధికార దాహ రాజకీయాలు తెచ్చిన విభజన ఫలితం అనక తప్పదు.

సిఇసి కి వ్యతిరేకంగా, మోదీ ప్రభుత్వం ఆయన్ను మర్యాదగా సాగనంపేవరకు ఆందోళనలు దశలవారీ ఉధృతమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. రెండోవైపున, సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లు, వాటి విచారణ ప్రాథమిక దశలోనే న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు జ్ఞానేశ్‌ కుమార్‌ ‘ఏకపక్ష, నిరంకుశ’ చట్టవ్యతిరేక చర్యలపట్ల ప్రతికూల భావనను ప్రతిబింబిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం, ఇసిఐ సహా సంబంధిత ప్రతివాదులకు కోర్టు జారీచేసిన నోటీసులకు గడువులోగా సమాధానాలు దాఖలైతే వచ్చేవారం విచారణ మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఫారం మార్పులకు తమ ఆమోదం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టంగా చెప్పినప్పటికీ, కోర్టు ఆమోదంతోనే తాము అదనపు డిక్లరేషన్‌ జత చేశామని సమర్థించుకుంటూ జ్ఞానేశ్‌కుమార్‌ విడుదల చేసిన ప్రకటన కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. కోర్టుకు సమర్పించే అఫిడవిట్‌లో ఎన్నికల సంఘం తన వాదన వినిపించవచ్చు, ఆధారాలు ఉటంకించవచ్చు, కాని ముందే ప్రతికా ప్రకటన ద్వారా న్యాయమూర్తుల అభిప్రాయాన్ని నిరాకరించటం నిస్సందేహంగా అతిక్రమణ కిందకే వస్తుంది.

ఇసిలో నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో జరగాలన్న చట్ట ఆదేశాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించటం, చట్టవ్యతిరేకంగా, ఏకపక్షంగా నిర్ణయాలు జరిగి ఉంటే వాటిని రద్దు చేస్తామని హెచ్చరించటం, సుప్రీంకోర్టు జడ్జీలకు, ప్రధాన మంత్రికి సైతం లేని ఇమ్యూనిటీని ఎన్నికల కమిషనర్‌లకు (ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ) కల్పించిన 2023 చట్ట నిబంధనను ఒక న్యాయమూర్తి ప్రస్తావించటం వగైరాలు ఎన్నికల కమిషన్‌కు, సిఇసి కి, ప్రభుత్వానికి చురకలాంటివి.

జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలన్న పిటిషనర్‌ల వాదనను ధర్మాసనం తిరస్కరించకుండా, ఆ పనిచేస్తే ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారని ప్రశ్నించగా, మిగతా ఇద్దరు కమిషనర్‌లు చూసుకుంటారని పిటిషనర్‌ల న్యాయవాదులు సమాధానమివ్వటం సీరియస్‌గా తీసుకోవలసిన అంశాలు. అయితే పత్రిక కథనాలపై తాము నిర్ణయం చేయలేమని, ప్రతివాదులకు నోటీసులిచ్చి, వారి అఫిడవిట్‌లు దాఖలైనాక కేసును లోతుగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సర్‌ నిర్వహణకు ఇసికి అధికారముందని సుప్రీంకోర్టు చెప్పినందున, తమ చర్యలన్నిటికీ సుప్రీంకోర్టును అడ్డంపెట్టుకుంటున్న సిఇసి నిర్వాకం కోర్టులో పరీక్షకు గురికావాలి. ఓటును తొలగించే అధికారం ఇసికి లేదని రిటైర్డ్‌, వర్తమాన జడ్జీలు వ్యాఖ్యానించటం ఇసిని నిలదీయాల్సిన అంశం.
ప్రతిపక్షాలు తమ డిమాండ్‌ల పరిధి విస్తరించాయి. ‘జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి, సర్‌ రద్దు చేయాలి, అంతకుముందున్న ఓటరు జాబితాలు పునరుద్ధరించాలి. అన్ని ఎన్నికలు బ్యాలెట్‌ పేపరుతో జరపాలి’ అని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కుమార్‌ దుశ్చర్యలకు పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపే నిలువెత్తు సాక్ష్యం. 98లక్షలకు పైగా ఓట్లు తొలగించి అధికారాన్ని బిజెపికి కట్టబెట్టాడు. సుప్రీంకోర్టు ఆదేశంపై న్యాయాధికారులతో ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్‌ తమకు అందిన మొత్తం 38.31లక్షల అప్పీళ్లలో 1.26లక్ష మాత్రమే(కేవలం 3శాతం) పరిష్కరించాయి. వాటిని జాబితాలో చేర్చారు. ఈ లెక్కన మొత్తం అప్పీల్స్‌ పరిష్కారానికి 19ట్రిబ్యునల్స్‌కు 21సంవత్సరాలు పడుతుందని కలకత్తా హైకోర్టు జులైలో వ్యాఖ్యానించింది. మంగళవారం ఉప ఎన్నికలకు పోలింగ్‌ జరిగిన నందిగ్రాం, రెజినగర్‌ నియోజకవర్గాల్లో దాదాపు 19 వేల ఓటర్లు ఓటు హక్కు తొలగించబడిన బెంగాల్‌ ఓటర్లలో ఉన్నారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత కూడా సుప్రీంకోర్టుపై ఉంది.13 కోట్లకు పైగా ఓట్లు తొలగించినందున ఇలాంటి సమస్యలు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏ పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా కచ్చితమైన కాలనిర్ణయ పరిష్కార ఆదేశం సుప్రీంకోర్టు నుంచి రావాలి.