Skip to content
తెలంగాణ › వార్తలు

ఆస్తులు పంచుకుంటున్న కుమారులు.. ఆత్మహత్యల పాలవుతున్న తల్లిదండ్రులు

Prajapaksham 03 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఆస్తులు పంచుకుంటున్న కుమారులు.. ఆత్మహత్యల పాలవుతున్న తల్లిదండ్రులు

Sons dividing assets... parents driven to suicide.

కుటుంబంలో పెద్దల మాటే నిర్ణయం. వృద్ధ తల్లిదండ్రులు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవారు. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పిల్లలే అండగా నిలిచేవారు. కాలం మారింది. ఉమ్మడి కుటుంబా లు కనుమరుగవుతున్నాయి. ఆస్తుల పంపకాలు త్వరగా జరుగుతున్నాయి. పిల్లలు తమ తమ జీవితాల్లో బిజీ అవుతున్నారు. కానీ ఆస్తులు పంచుకున్నంత సులభంగా తల్లిదండ్రుల బాధ్యతలను పంచుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇదే అనేక కుటుంబాల్లో కొత్త సమస్యలకు దారితీస్తోంది. తాజాగా.. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారనుకున్న కుమారులే పట్టించుకోకపోవడం తో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం చప్తా గ్రామంలో చోటుచేసుకుంది.
తమను కుమారులు సరిగా చూసుకోవడం లేదని, కనీసం భోజనం కూడా సక్రమంగా పెట్ట డం లేదన్న మనస్తాపంతోనే ఈ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న కొన్ని విషాద ఘటనలు ఈ అంశంపై సమాజం మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులు తమ జీవితమంతా పిల్లల కోసం త్యాగం చేసిన తర్వాత, చివరి దశలో ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ నిర్లక్ష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు విడివిడిగా జీవించడం తప్పు కాకపోయినా తల్లిదండ్రులను మాత్రం విడిచిపెట్టడం కుటుంబ బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది.
ఆస్తి తీసుకోవడం కాదు.. బాధ్యత తీసుకోవాలి
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వడం సాధారణమే. అయితే భూమి, ఇల్లు, నగదు వంటి ఆస్తులను పిల్లలకు బదిలీ చేసిన తర్వాత తల్లిదండ్రుల జీవన భద్రత ఏమిటన్నది చాలా కుటుంబా లు ఆలోచించడం లేదు. ఆస్తి తమ పేర్లకు మారిన తర్వాత వృద్ధ తల్లిదండ్రుల అవసరాలను పట్టించుకోకపోవడం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఆస్తి తీసుకున్న పిల్లలు బాధ్యతను కూడా స్వీకరించాలి. ఎవరి వద్ద తల్లిదండ్రులు ఉంటారో, వైద్య ఖర్చులు ఎవరు భరిస్తారో, రోజువారీ అవసరాలు ఎలా తీరుస్తారో, అత్యవసర సమయంలో ఎవరు అండగా ఉంటారో ముందుగానే కుటుంబంలో నిర్ణయించుకోవాలి. ఇది కేవలం ఆర్థిక ఒప్పందం కాదు..కుటుంబ విలువలకు సంబంధించిన బాధ్యత.
ఆస్తి పంచే ముందు ఈ విషయం ఆలోచించాలి&
తల్లిదండ్రులు కూడా తమ జీవిత భద్రత గురించి ముందుగానే ఆలోచించాలి. తమకు ఉన్న ఆస్తిని పూర్తి గా పిల్లల పేర్లకు బదిలీ చేసే ముందు వృద్ధాప్యంలో తమకు అవసరమైన ఆర్థిక భద్రత, నివాస హక్కు, వైద్య ఖర్చులు, రోజువారీ జీవన అవసరాలు వంటి అంశాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణకు సంబంధించిన చట్టపరమైన రక్షణలు కూడా ఉన్నాయి. అయితే కోర్టులు, చట్టాల వరకు పరిస్థితి వెళ్లకుండా కుటుంబంలోనే సమస్య పరిష్కరించుకోవడం అత్యుత్తమ మార్గం.
నారాయణఖేడ్‌ వంటి ఘటనలు కేవలం ఒక కుటుంబ విషాదంగా మిగిలిపోకుండా, ప్రతి కుటుంబం ముందుగానే మేల్కొనే హెచ్చరికగా మారాలి. తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో భద్రత, గౌరవం, ఆప్యాయత కల్పించే కుటుంబ సంస్కృతి ని తిరిగి బలపరచాల్సిన సమయం ఆసన్నమైంది.
తెలంగాణలో నమోదైన సంబంధిత ఘటనలు..

  • ఆగసు 20, 2023నాడు… రాజన్న సిరిసిల్ల చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి కనికరపు దేవయ్య (69),లక్ష్మీనర్సవ్వ(60) ఆస్తి పంపకాల్లో తమకు రావాల్సిన 18 అంకళాల స్థలం విషయంలో పెద్ద కుమారుడి వేధింపులు ఉన్నాయని పోలీసుల వివరాల ఆధారంగా వార్తలు వచ్చాయి. దంపతులు పురుగుల మందు తాగి మృతి చెందారు.
    -2025 ఆగస్టు… నారాయణపేట మద్దూర్‌ మండలం ఖాజీపేట వడ్ల నాగమ్మ(83) భర్త మరణం తర్వాత ఉన్న 14 ఎకరాల భూమి, పొదుపు మొత్తాన్ని ముగ్గురు కుమారులు పంచుకున్నారని, తనను పట్టించుకోకుండా వదిలేశారని ఆమె ఆరోపించారు. చివరకు జీవనం కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై తెలంగాణ లోకాయుక్త స్వయంగా విచారణకు ఆదేశించింది. ఇది మరణ ఘటన కాదు; వృద్ధుల నిర్లక్ష్యాని కి ముఖ్యమైన ఉదాహరణ.
    -6 ఏప్రిల్‌ 2026…కరీంనగర్‌ సైదాపూర్‌ మండలంఎలబోతారం నూనె వెంకటమ్మ (80) మొదట బావిలో పడి మృతి చెందిన ఘటనగా నమోదైంది. తరువాత పోలీసుల దర్యాప్తులో, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వెంకటమ్మను ఇద్దరు కుమారులు బావిలో పడేసినట్లు తేల్చారు. కుటుంబంలో ఉన్న మూఢనమ్మకం కారణంగా ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య కేసు.
    -18 సెప్టెంబర్‌ 2026… జనగామ రఘునాథపల్లి మండలం గబ్బెట గైనీ పుల్లయ్య, గైనీ లక్ష్మి దంపతులకు ఉన్న ముగ్గురు కుమారులు వివిధ కారణాలతో మరణించడంతో, వృద్ధాప్యంలో తమ ను చూసుకునేవారు లేకపోవడం, కుమారుల మరణంతో తీవ్ర మనోవేదనకు గురికావడం కారణం గా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
    -21 జూన్‌ 2026… పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల గ్రామంలో మేరుగు యశోద(75) అనే వృద్ధురాలు అనారోగ్యం, ఒంటరితనం భరించలేక వ్యవసాయ బావిలో దూకి మృతి చెందారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నప్పటికీ వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారని, భర్త గతంలోనే చనిపోయారు.
    సెప్టెంబర్‌ 29న… సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలంలోని చప్టా(కె) గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ముంగె నర్సారెడ్డి (88), ముంగె అంజమ్మ(85) తమ భూములు పంచుకున్న కుమారులు తమను నిర్లక్ష్యం చేయటంవల్ల ఆకలి తో అలమటిస్తూ తమ వ్యవసాయ భూమిలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.