Skip to content
జాతీయం › వార్తలు

Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన, పలువురు నేతలు అరెస్ట్..

jagan 02 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన, పలువురు నేతలు అరెస్ట్..

Jantar Mantar Protest

Jantar Mantar Protest: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ(ఎం), ఏఐఎస్ఏ సహా వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల ప్రతినిధులు , వేలాది మంది యువత ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఏకంగా 1,100 మందికి పైగా కార్యకర్తలను, కీలక నేతలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ ఆందోళనల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులు, ఢిల్లీ మాజీ సీఎం అతిషి, సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా, సంజయ్ సింగ్, ఏఐఎస్ఏ ఉద్యమకారిణి నేహా బోరా , సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కారత్ వంటి అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. జంతర్ మంతర్ ప్రాంతానికి విపక్ష నేతలు, ప్రదర్శనకారులు చేరుకోకుండా నగరంలోని పలు కీలక రహదారులను పోలీసులు ముందస్తుగా దిగ్బంధించినప్పటికీ, అడ్డంకులను దాటుకుని వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు , ఉద్యమకారులకు మధ్య తీవ్ర నెట్టివేతలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు.

పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీపీఐ(ఎం) నేత బృందా కారత్, తమను జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నంత మాత్రాన ఆందోళనలు ఆగవని, ప్రస్తుతం ఢిల్లీలోని ప్రతి వీధి ఒక జంతర్ మంతర్‌గా మారిపోయిందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నిరసనల గురించి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో బిజెపి మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాయని చెప్పారు.

ఢిల్లీలో విపక్షాల ఆధ్వర్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో వేలాది మంది యువత, సీనియర్ నేతలు సీఈసీకి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్ తక్షణమే సీఈసీ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.