Skip to content
బిజినెస్ › వార్తలు

Bank Strike September 28: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల సమ్మె, ముందే ఈ పనులు పూర్తి చేసుకోండి

Krishna Rao 27 Sep 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Bank Strike September 28: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల సమ్మె, ముందే ఈ పనులు పూర్తి చేసుకోండి

bank-strike

Bank Strike September 28: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. SBI, Bank of India సూచనలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ప్రైవేట్ బ్యాంకులపై ప్రభావం వివరాలు తెలుసుకోండి.

Bank Strike September 28: రాబోయే రోజుల్లో బ్యాంకుకు సంబంధించిన అత్యవసర పనులు ఏవైనా ఉంటే.. వాటిని ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని పాత ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

సమ్మె కారణంగా ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆదివారం కూడా తమ శాఖలను తెరిచి ఉంచాయి. సమ్మె సమయంలో శాఖల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.

ఎందుకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె?

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకారం.. దేశంలోని సుమారు 90 శాతం బ్యాంకు ఉద్యోగులకు తమ సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఉద్యోగులు ప్రధానంగా ఐదు రోజుల బ్యాంకింగ్ వారం అమలు, పెన్షన్ సంబంధిత సంస్కరణలు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఈ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 28 నుంచి సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిర్ణయించాయి. సమ్మె కారణంగా బ్యాంకు శాఖల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయే లేదా పరిమితంగా కొనసాగే అవకాశం ఉంది.

అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాబట్టి అత్యవసర లావాదేవీల కోసం కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.

డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని SBI సూచన

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ముందుగానే ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవాలని సూచించింది. అలాగే శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని కోరింది.

YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATMలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చని సూచించింది.

బ్యాంకు శాఖలు మూసి ఉన్నా లేదా సమ్మె కారణంగా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినా.. ఈ డిజిటల్ సేవల ద్వారా రోజువారీ అవసరాలకు సంబంధించిన అనేక లావాదేవీలను కొనసాగించవచ్చు.

Bank of India కూడా కీలక సూచనలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా తన ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. అత్యవసరమైన పలు బ్యాంకింగ్ సేవలు 24/7 డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది.

సమ్మె సమయంలో నగదు బదిలీ చేయడం, ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం, బిల్లులు చెల్లించడం లేదా ఇతర ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాల్సిన కస్టమర్లకు డిజిటల్ సేవలు ఉపయోగపడతాయి.

ఈ ప్రైవేట్ బ్యాంకులపై ప్రభావం తక్కువగా ఉండే అవకాశం

బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావం అన్ని బ్యాంకులపై ఒకే విధంగా ఉండదు. ICICI Bank, HDFC Bank, Axis Bank, IndusInd Bank వంటి ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని భావిస్తున్నారు.

అయితే కొన్ని శాఖల్లో పని వేళలు లేదా స్థానిక సేవల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల బ్యాంకుకు వెళ్లే ముందు సంబంధిత బ్యాంకు అధికారిక ప్రకటనలు లేదా శాఖ నుంచి తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.

కస్టమర్లు ఏం చేయాలి?

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె ప్రారంభం కానున్న నేపథ్యంలో నగదు ఉపసంహరణ, డిపాజిట్, చెక్‌కు సంబంధించిన పనులు, ఇతర అత్యవసర శాఖ సేవలు అవసరమైన వారు వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది.

అత్యవసరం కాని పనుల కోసం శాఖకు వెళ్లకుండా UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATMలు వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. దీంతో సమ్మె సమయంలో బ్యాంకు శాఖల వద్ద ఏర్పడే ఇబ్బందులను కొంతవరకు నివారించవచ్చు.

ట్యాగ్‌లు: business news