Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Editorial: ఫలప్రదమైన జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన

Prajapaksham 27 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: ఫలప్రదమైన జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన

Editorial: ఈ ఏడాది మే మాసంలో ట్రంప్‌ చైనా పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు కొంత వరకు మెరుగయ్యాయి. జిన్‌పింగ్‌ తాజా పర్యటన వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వైట్‌ హౌజ్‌లో జరిగిన అగ్రనాయక సమావేశాల్లో ట్రంప్‌, షీ జిన్‌పింగ్‌ నడుమ ప్రధానంగా ఆర్థిక అంశాలు, కృత్రిమ మేథస్సుతో పాటు, ఇరాన్‌ యుద్ధంపై చర్చ జరిగింది.

చైనా దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మూడు రోజుల అమెరికా పర్యటన శనివారం ముగిసింది. ప్రపంచ దేశాలు సంఘర్షణలు, ఆర్థిక, సరఫరా గొలుసుల అంతరాయాలతో సతమతమవుతున్న సమయంలో ఈ పర్యటన అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ప్రథమ స్థానంలో ఉన్న అమెరికాతో పోటీకి వస్తున్న చైనా అంటే ట్రంప్‌కు ఆది నుంచి అయిష్టతే. ఆయన అధ్యక్షుడిగా తొలి దఫా, మలి దఫాలో చైనాపై పలుమార్లు అక్కసును వెళ్లగక్కారు. చైనా నుంచి అమెరికా కంపెనీలు తిరిగి స్వదేశానికి వచ్చేయాలని పిలుపునిచ్చారు. అన్ని దేశాల కంటే చైనా ఎగుమతులపైనే అత్యధిక టారిఫ్‌లను విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడినాయి.

ఈ ఏడాది మే మాసంలో ట్రంప్‌ చైనా పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు కొంత వరకు మెరుగయ్యాయి. జిన్‌పింగ్‌ తాజా పర్యటన వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వైట్‌ హౌజ్‌లో జరిగిన అగ్రనాయక సమావేశాల్లో ట్రంప్‌, షీ జిన్‌పింగ్‌ నడుమ ప్రధానంగా ఆర్థిక అంశాలు, కృత్రిమ మేథస్సుతో పాటు, ఇరాన్‌ యుద్ధంపై చర్చ జరిగింది.

కృత్రిమ మేథస్సు విషయంలో మానవ నియంత్రణ ఉండాలన్న చైనా అధినేత అభిలాషకు భిన్నంగా ట్రంప్‌ ఆలోచన ఉంది. ఎఐ అభివృద్ధి విషయాన్ని కంపెనీలకే వదిలేయాలన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో కృత్రిమ మేథస్సును ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌గా కాకుండా సూపర్‌ ఇంటెలిజెన్స్‌గా వ్యవహరించాలనే ట్రంప్‌ సూచనకు చైనా సానుకూలంగానే స్పందించింది.

వాణిజ్య మండలి ఏర్పాటు, 30 బిలియన్‌ డాలర్ల విలువైన పరస్పర సుంకాల తగ్గింపు ఒప్పందం, కౌలాలంపూర్‌ సంప్రదింపులలో సాధించిన ఫలితాల విస్తరణ వంటి అంశాల రూపంలో తమ దేశాల ఆర్థిక, వాణిజ్య బృందాలు సాధించిన ఫలితాలను వారు ఈ సందర్భంగా గమనంలోకి తీసుకున్నారు. ఉభయ దేశాల మధ్య నవంబర్‌లో ముగియనున్న వాణిజ్య ఒప్పందాన్ని మరో రెండు నెలల పొడిగింపునకు అంగీకరించడం సానుకూల పరిణామం.

శిఖరాగ్ర సమావేశంలో ఎనిమిది అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. పరస్పర గౌరవం, చేయూత, నిష్పాక్షికంగా నిర్మాణాత్మక సంబంధాలను నిర్మించుకోవాలని నిర్ణయించారు. తాము అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమనే మాటను ఇరాన్‌ నిలబెట్టుకోవాలని, ఏ దేశం లేదా అంతర్జాతీయ జలాలలో రవాణా రుసుము వసూలు చేయకూడదనే విషయంలో ఉభయనేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తైవాన్‌ విషయంలో అమెరికా దుడుకుతనంతో వ్యవహరించవద్దనే ప్రస్తావన వచ్చినట్లు మీడియా వార్తలు చెబుతున్నాయి.

శిఖరాగ్ర భేటీల్లో ఉభయులూ సుభాషితాలు పంచుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్‌పై దాడి సమయంలో ఇరు దేశాలు కలిసి పని చేశాయని ట్రంప్‌ చెప్పగా, సంఘర్షణ కంటే ఘన చైనా పునరుజ్జీవం, మేకింగ్‌ అమెరికా గ్రేట్‌ అగెయిన్‌ లక్ష్యాల సాధనకు పరస్పరం సహకరించుకోవాలని జిన్‌పింగ్‌ మనోగతాన్ని వెల్లడి చేశారు. అదే సమయంలో అమెరికాను భాగస్వామిగా తప్ప, పోటీ పడే సూపర్‌ పవర్‌గా చూడబోమని అనడం ద్వారా ఇటీవల చైనా పదే పదే ప్రతిపాదిస్తున్న బహుళధ్రువ వాదాన్ని ముందుంచింది. అంతే గాక, ఎవరూ ఊహించని విధంగా విద్యార్థి బదిలీ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలో లక్ష మంది యువ అమెరికన్‌లు చైనాలో చదువుకునేందుకు రావాలని జిన్‌పింగ్‌ ఆహ్వానించారు.

దశాబ్దకాలంలో చైనా అధ్యక్షుడు అమెరికా పర్యటించటం ఇదే తొలిసారి. షీ జిన్‌పింగ్‌ పర్యటనకు ట్రంప్‌ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్ళిన షీ జిన్‌పింగ్‌కు ట్రంప్‌ తన సతీమణితో కలిసి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతేగాక వైట్‌ హౌజ్‌లో అమెరికా ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలతో ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో రెండు అగ్రదేశాధినేతలు కలవడం రెండవసారి. ఏడాది ముగిసే లోగా మరో రెండు మార్లు ఇరువురు భేటీ కానున్నారు.

నవంబర్‌ 18 తేదీలలో చైనాలోని షెన్‌జెన్‌ ఆతిథ్యమిస్తున్న ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ (ఎపెక్‌) శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్‌ హాజరుకానున్నారు. అలాగే, డిసెంబర్‌లో మియామీలో జరిగే జి 20 సమ్మిట్‌కు షీ జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. ఈ ఏడాదిలో రెండు అగ్రరాజ్య దేశాధినేతలు నాలుగుసార్లు కలుసుకోనుండడం సుహృద్భావ వాతావరణాన్ని తెలియపరుస్తోంది.

అయితే, ట్రంప్‌ తన మాటపై ఎంత వరకు నిలబడతారనేది చివరి వరకు చెప్పలేము. వచ్చే నెలలో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులకు వామపక్ష భావజాలం కలిగిన అభ్యర్థులు ధీటుగా పోటీనిస్తున్నారు. అంతర్జాతీయ కారణాలే కాకుండా, ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ అభ్యర్థులలో గందరగోళం సృష్టించేందుకు కూడా షీ జిన్‌పింగ్‌ పర్యటనను ఆయన ఉపయోగించుకుంటారని పరిశీలకుల భావన.

ఏదేమైనప్పటికీ పెళుసుబారిన అంతర్జాతీయ సంబంధాల మధ్య రెండు కీలక దేశాల మధ్య సమావేశం సానుకూల ఫలితాలివ్వాలని ఆశిద్దాం. ఇది సంఘర్షణల ముగింపునకు, మానవాళి పురోగతికి ఉపయోగపడితే ప్రయోజనం ఉంటుంది.

ట్యాగ్‌లు: editorial