AP Govt Employees Promotions: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్ల ప్రక్రియ షురూ…
AP Govt Employees Promotions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 2026-27 ప్రమోషన్లకు డీపీసీ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 15 వరకు చేపట్టే ప్రక్రియ, కీలక గడువులు, మార్గదర్శకాలు ఇవే.
AP Govt Employees Promotions : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. 2026-27 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సవరించిన షెడ్యూల్‌తో పాటు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ-డీపీసీ నిర్వహణకు అవసరమైన మార్పులతో సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత శాఖాధిపతులు నిర్ణీత గడువుల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సెప్టెంబర్ 30లోపు ఖాళీలు, సీనియారిటీపై సమీక్ష
ప్రమోషన్లకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల్లో అందుబాటులో ఉన్న ఖాళీలపై ప్రాథమిక అంచనాతో పాటు ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సమీక్షించాలి.
ఏదైనా శాఖలో డీపీసీ నిర్వహించాల్సిన అవసరం లేకపోతే ఆ విషయాన్ని కూడా సంబంధిత అధికారులు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
అదే సమయంలో పదోన్నతుల పరిశీలన పరిధిలోకి వచ్చే అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది.
అక్టోబర్ 7లోపు కీలక వివరాల సేకరణ
ప్రమోషన్లకు అర్హులైన అధికారులకు సంబంధించిన సర్వీస్ రికార్డులను అధికారులు పరిశీలించనున్నారు. అక్టోబర్ 7లోపు గత ఐదేళ్ల సర్వీస్ రికార్డులు (SR), ఆరోపణ పత్రాలు, సస్పెన్షన్ వివరాలు, ఏసీబీ కేసులు, క్రిమినల్ కేసులు, కోర్టు ఉత్తర్వులు తదితర సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం సూచించింది.
ఈ వివరాల ఆధారంగా ప్రమోషన్‌కు సంబంధించిన తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు.
అక్టోబర్ 14లోపు తాత్కాలిక డీపీసీ నోట్
సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అక్టోబర్ 14లోపు తాత్కాలిక డీపీసీ నోట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అధికారులకు సంబంధించిన జాబితాలను కూడా సిద్ధం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
పదోన్నతుల ప్రక్రియలో రిజర్వేషన్ నిబంధనలు, అర్హతలు, సీనియారిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
అక్టోబర్ 21 నాటికి తుది ఖాళీల అంచనా
ప్రమోషన్ల కోసం అందుబాటులో ఉన్న ఖాళీలకు సంబంధించిన తుది అంచనాను అక్టోబర్ 21లోపు ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం తుది డీపీసీ నోట్‌ను సంబంధిత సచివాలయ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
శాఖాధిపతుల స్థాయి నుంచి సచివాలయ శాఖకు, అక్కడి నుంచి సాధారణ పరిపాలన శాఖ (GAD-Services)కు అవసరమైన సమాచారాన్ని నిర్ణీత గడువుల్లో పంపించాల్సి ఉంటుంది.
నవంబర్, డిసెంబర్‌లో డీపీసీ సమావేశాలు
డీపీసీ సమావేశాలను కూడా దశలవారీగా పూర్తి చేయనున్నారు. గెజిటెడ్ స్థాయి అధికారుల పదోన్నతులకు సంబంధించి నవంబర్ 15, నవంబర్ 30, డిసెంబర్ 15లోపు సమావేశాల ప్రక్రియను పూర్తి చేయాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
దీంతో 2026-27 ప్యానల్ సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు నిర్దిష్ట గడువులు ఖరారయ్యాయి.
కేంద్ర ఆర్థికశాఖలో ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యత
ఇదిలా ఉండగా.. ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ నాగులాపల్లికి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించారు. 1998 బ్యాచ్‌కు చెందిన ఆయనను కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగం అదనపు కార్యదర్శిగా నియమించారు.
ఇప్పటివరకు ఆయన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పరిధిలో హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. తాజాగా ఆయన్ను ఆర్థికశాఖ వ్యయ విభాగానికి బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.