Skip to content
జాతీయం వార్తలు

ప్రజాధనం పట్ల ఇంతటి నిర్లక్ష్యమా! ఏదీ శిక్ష?

Prajapaksham 24 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రజాధనం పట్ల ఇంతటి నిర్లక్ష్యమా! ఏదీ శిక్ష?

Modi and Block Money

మేరుగు రాజయ్య

16వ,లోకసభ ఎన్నికలు 2014 ఏప్రిల్‌ 7 నుండి 12 వరకు జరిగాయి. మే 16న వెలువడిన ఫలితాలలో బీజేపీ 282 స్థానాలలో గెలుపొందింది. ఎన్డీఏ(జాతీయ ప్రజాస్వామ్య కూటమి)తో కలిసి 336 మంది ఎంపిల నాయకుడి గా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ లోక సభ ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి 125 వాగ్దానాలు ప్రకటించింది. అందులో 10వ, హామీలో విదేశాలలో జమ చేసిన నల్లధనాన్ని గుర్తించి, 100 రోజుల్లోగా 80 లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికీ గత 12 ఏండ్లు గా బిజెపినే అధికారంలో ఉంటున్నప్పటికీ విదేశాలలో దాయబడిన దేశీయ నల్లధనం వెనక్కి రాలేదు. పైగా దేశీయ బ్యాంకుల నుండి అప్పుగా తీసుకున్న కార్పోరేట్‌ కంపెనీల అధినేతలు కొందరు విదేశాలకు పారిపోయారు. బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా మొండికేసిన కంపెనీలు, వ్యక్తుల వివాదాల పరిష్కారంకై ‘నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌” (ఎన్సీఎల్టీ)ను ఏర్పాటు చేశారు. కార్పోరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 408 కింద ఎన్సీఎల్టీ 2016 మరియు ‘ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రాప్ట్సీ కోడ్‌(ఐబిసి)2016 తెచ్చారు. ఇవి కంపెనీల వివాదాలు, ఆర్థిక దివాళా ప్రక్రియలను పరిష్కారం చేస్తాయి. తద్వారా బ్యాంకులలో రుణ లభ్యతకు, రుణదాతలైన బ్యాంకులకు ఊతం ఇవ్వాలి.

బ్యాంకులలో ఎన్పీఏ(నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌ /నిరర్ధక ఆస్తులు)ల తగ్గింపుకు, రుణ దాతల, వాటా దారుల హక్కులను సమతుల్యం చేసి మోసాలను, దుర్వినియోగాలను నివారించడానికి తోడ్పడాలి. కాని ఇటీవల మీడియాలో వైరల్‌ అయిన ‘జీ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ సుభాష్‌ చంద్ర’ ఎన్సిఎల్టీ దివాళా కేసు చర్చనీయాంశం అయింది. ఇతను 2016 నుండి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బిజెపి మద్దతుతో హర్యానా రాష్ట్రం నుండి ఎన్నికయ్యారు. రుణ దాతలు చెప్పినట్లుగా వెలువడిన సమాచారం ప్రకారం 2017లో సుభాష్‌ చంద్ర నికర ఆస్తి సుమారు రూ.45,888 కోట్లు, 2018లో రూ.40,562కోట్లు చూపించగా ప్రస్తుతం రూ.31.79 కోట్లు మాత్రమే చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమైనవి. వ్యక్తిగత దివాళా కేసులో ఆయన అంగీకరించిన రూ.22,006 కోట్ల క్లెయిమ్స్‌కు బదులు కేవలం రూ.6.25 కోట్లు చెల్లించి పరిష్కరించుకోవడానికి వీలుగా ‘జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్‌’ (ఎన్సీఎల్టీ) రుణ చెల్లింపు ప్రణాళిక చెప్పింది.

దానిపై రుణదాతలైన ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐడిబిఐ, హెచ్డిఎఫ్సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుభాష్‌ చంద్ర ఆస్తులను మరింత లోతుగా పరిశీలించాలని కోరుచున్నవి. బ్యాంకులపై దాదాపుగా ప్రజలందరికీ విశ్వాసం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించిన ‘ఇండియా ఇన్‌ క్లూజివ్‌ పైనాన్స్‌ రిపోర్ట్‌ 2025’ లో 91 శాతం భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని పేర్కొంది. కాని 69 శాతం ఖాతాదారులు మాత్రమే లావాదేవీలు జరుపుచున్నారని తెలిపింది. ప్రపం చ బ్యాంకు కూడా గ్లోబల్‌ ఇండెక్స్‌ 2025లో భారత దేశం లో బ్యాంకు ఖాతాల యాజమాన్యం 89 శాతానికి చేరుకుందని హైలెట్‌ చేసింది. నిజంగా బ్యాంకులు ప్రజలకు చేస్తున్నదేమిటి? ప్రజలు పొదుపు(దాచుకున్న)చేసిన డబ్బులను తిరిగి రుణాల (అప్పులు)పేర వడ్డీలకు ఇస్తున్నాయి. పొదుపు చేసిన ప్రజలకు 2.50 శాతం నుండి 8.50 వడ్డీ చెల్లిస్తున్నాయి. అప్పులు తీసుకున్న వారి నుండి 9.98 శాతం నుండి 24 వరకు, 10.60 శాతం నుండి 16.50 వరకు, ఫ్యాక్టరీ లోన్స్‌ పై 9 శాతం నుండి 27 వరకు ఇంకా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు 9 శాతం నుండి 30 శాతం వరకు వడ్డీలను వసూలు చేస్తున్నవి.

ఇంకా ఖాతాదారుల (ప్రజలు)నుండి ఖాతా నిర్వహణ ఖర్చులను, ఎటిఎం(ఆటో మెటిక్‌ టెల్లర్‌) పరిమితికి మించి డబ్బు ల ఉపసంహరణ ఛార్జీలు, చెక్‌ లావా దేవీల, చెక్‌ బుక్‌ ఛార్జీ లు, లోన్స్‌ ప్రాసెస్‌, ఎన్‌ఇఎఫ్టి(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌), ఆర్టీజిఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌ మెంట్‌)నగదు బదిలీల ఛార్జీలు, ఎస్‌ఎంఎస్‌(షార్ట్‌ మెసేజ్‌ సర్వీస్‌) ఫోన్‌ మెసేజ్‌ సమాచారం, డిమాండ్‌ డ్రాప్ట్‌, లాకర్‌ రెంట్‌ , ఓవర్‌ డ్రాఫ్ట్‌, ముందస్తు ఖాతా ముగింపు ఛార్జీలు, హౌసిం గ్‌, వెహికిల్‌, గోల్డ్‌ లోన్స్‌ పై వడ్డీలు, బంగారు ఆభరణాల మూల్యాంకన ఛార్జీలు మొదలగు సేవలకు రుసుములు వసూలు చేస్తూ బ్యాంకులు లాభాలను సాధించుచున్నవి. అయినప్పటికీ ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకులు భాగమైనవి.సమాజంలో మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలు పరిఢవిల్లుతున్నట్లుగానే బ్యాంకులతో కూడా ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నవి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 12 ఉన్నవి.దేశ వ్యాప్తంగా 60,646 శాఖ బ్యాంకులున్నవి. 1969 జూలై 19న బ్యాంకుల జాతీయకరణ నుండి లాభాలను సాధించుచున్నవి.

గడిచిన 2025 ఆర్థిక సంవత్సరంలో 3.21లక్షల కోట్లు నిర్వహణ లాభాలు కాగా, నికర లాభాలు రూ.1.98(యుఎస్‌ $ 22.59 బిలియన్లు)లక్షల కోట్లు సాధించినవి. మొత్తం డిపాజిట్లు 156.3 లక్షల కోట్ల వరకు చేరుకున్నవి. ప్రజల పొదుపు, డిపాజిట్లు, రకరకాల లోన్స్‌ పై వడ్డీలు,సేవలపై చార్జీలతో సాధించిన లాభాలను (మదుపు/ఇన్వెస్ట్‌)మరింత సంపదను సృష్టించడానికి వెచ్చించి ఉంటే బాగుండేది.అందులో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, చేతి వృత్తులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సరళంగా రుణ సౌకర్యం కల్పించినట్లయితే ఉపాధి అవకాశాలతో పాటుగా అభివృద్ధి సాధ్యపడేది. కాని కార్పోరేట్‌ శక్తులు, బ్యూరోక్రసీ(ప్రభుత్వ యంత్రాంగం) రాజకీయ శక్తులు తయారు చేసిన చట్టాలు,విధానాల వలన బ్యాంకు ల డబ్బులు “కాకులను కొట్టి గద్దలకు మేపిన చందం గా ఉంది. 2018 మార్చి 14 న విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె అక్బర్‌ బ్యాంక్స్‌ లోన్స్‌ తీసుకున్న వ్యాపార వేత్తలు 31 మంది విదేశాలకు పరారీ అయినారని లోక సభలో చెప్పారు. 2018 జూలై 25 న విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్‌ (రిటైర్డ్‌) విజయ్‌ కుమార్‌ సింగ్‌ విదేశాలలో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల పేర్లను లోక్‌సభలో చెప్పారు.

2019 జనవరి 4న ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా లోక సభలో 27 మంది దేశం విడచి పారిపోయిన రుణ ఎగవేత దారుల పేర్లను చెప్పాడు. 2020 ఫిబ్రవరి 5 న ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా లోక సభలో విదేశాలలో పరారీలో ఉన్న 72 మందిని భారత్‌ కు తీసుక రావడానికి ప్రయత్నాలు జరుగుచున్నావని చెప్పాడు. విదేశాలలో పరారీలో ఉన్న వారి రుణాల మొత్తంపై మరియు ఎంత మంది ఉన్నారన్న విషయాలపై స్పష్టత లేదు. కేవలం 12 మంది పరారీలో ఉన్నవారి రుణాలు మాత్రం రూ.35,587.19 కోట్లుగా వెల్లడైనవి. గత 8 ఏండ్లుగా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసి), రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ (ఆర్సిఎన్‌) సిబిఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌),ఇడి(ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌) ద్వారా పరారీలో ఉన్న రుణ ఎగవేత దారులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుచున్నావని
చెప్పుచూనే ఉన్నారు.
బ్యాంకుల నుండి తీసుకున్న వేల కోట్ల రుణాలను చట్టబద్ధంగా ఎగనామం పెట్టడం ఏలా సాధ్యమవుతుందని ప్రజలకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.సామాన్యంగా తాకట్టు, పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు ఇయ్యవు.తాకట్టు పెట్టిన బంగారం మార్కెట్‌ విలువలో 70 నుండి 85 శాతం వరకు గోల్డ్‌ లోన్‌ ఇస్తారు.ఇల్లు లేదా ఆస్తిని తాకట్టు పెట్టుకుని మార్కెట్‌ విలువలో 50 నుండి 70 శాతం వరకు పర్సనల్‌ లోన్‌ ఇస్తారు.అలాగే ఉద్యోగి లోన్‌ తీసుకోవడానికి సదరు ఉద్యోగి, పూచీకత్తు పడే ఉద్యోగి కూడా తన వేతనాన్ని తమ బ్యాంకు ద్వారా తీసుకునే వారికి మాత్రమే లోన్‌ ఇస్తారు .రైతులకు కూడా పట్టాదారు పాసు బుక్కులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తారు. కాని కార్పోరేట్‌ కంపెనీలకు,బడా పారిశ్రామిక వేత్తలకు ఏమి తాకట్టు,జమానాతు పెట్టుకోకుండా వేల కోట్ల రుణాలను ఏలా ఇస్తున్నారు.ఇచ్చిన రుణాలను మొండి బకాయిల పేర, నిరర్థక ఆస్తుల పేర ‘నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌ రప్టీ కోడ్‌ 2016 మార్గదర్శకంగా ఎట్లా మాఫీ చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
2024 ఆగస్ట్‌ 8న ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆర్థిక బిల్లుపై పార్లమెంటులో ప్రసంగించాడు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ‘హెయిర్‌ కట్‌ పథకాన్ని’ బట్టబయలు చేశాడు. కేవలం 43 కంపెనీలు తీసుకున్న బ్యాంకు రుణాలు రూ.5,44,434 కోట్లు చెల్లించవలసి ఉండగా రూ.1,90,779 మాత్రమే చెల్లింపచేసి రూ.3,53,655 కోట్లను మాఫీ చేసిందని తెలిపాడు.అందులో కొన్ని కంపెనీల పేర్లను కూడా పేర్కొన్నాడు.
ప్రభుత్వ వర్గాల నుండి తీసుకున్న ఈ సమాచారాన్ని ధృవీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎంపీ సంజయ్‌ సింగ్‌ పార్లమెంటుకు చెప్పాడు. విద్య, ఆరోగ్య, రైతులకు రుణ మాఫీ, ప్రజల ద్రవ్యోల్బణం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరినప్పుడు డబ్బు లేదని అంటుందని, కాని పెట్టుబడిదారులకు రుణ మాఫీ చేయడానికి మాత్రం డబ్బు ఉంటుందని ఎద్దేవా కూడా చేశాడు. కాంగ్రెస్‌ హయాంలో రూ.70,000 కోట్ల రుణాలను మాఫీ చేయగా బిజెపి కేవలం 43 కంపెనీలకే రూ.3,53,655 కోట్లు మాఫీ చేశారని ఆందోళన తెలిపారు.

పూణేకు చెందిన ‘సజగ్‌ నాగరిక్‌ మంచ్‌”అధ్యక్షుడు వివేక్‌ వెలంకర్‌ సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బిఐ)2016 ఆర్థిక సంవత్సరం నుండి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య రుణ ఎగవేత దారుల పేర్లను వెల్లడించమని కోరినాడు. దానికి బ్యాంకు వారు బ్యాంకు విశ్వసనీయ హోదా, వాణిజ్య గోప్యత కలిగి ఉన్న మూడవ పక్షాల వ్యక్తిగత సమాచారం అయినందున సహా చట్టం 2005,సెక్షన్‌ 8(1)(డి),8(1)(ఇ) మరియు 8(1)(జె) కింద పేర్లను బహిర్గతం చేయడం నుండి మినహాయింపు ఉందని తెలిపారు.
ఎన్సీఎల్టీ మరియు ఇతర ఫోరమ్‌ లకు 309 రుణ ఖాతాలను ఎస్బీఐ తీసుకెళ్లగా రూ.1,49,895 కోట్ల క్లెయిమ్స్‌కు బదులుగా పరిష్కార ప్రణాళిక ద్వారా కేవలం రూ.49,727 కోట్లు వసూలు చేసుకోగలిగింది. ఇంకా రూ.100,168 కోట్లను నిరర్థక ఆస్తులుగా రద్దు చేసుకుంది.
బ్యాంకుల రుణ ఎగవేత దారులను నియంత్రించడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. బ్యాంకులలో ప్రజల పొదుపు డిపాజిట్లతో, లోన్స్‌ పై వసూ లు చేస్తున్న వడ్డీలతో, బ్యాంకుల సేవలపై వసూలు చేస్తున్న చార్జీలతో ఏటా లక్షల కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నవి. బ్యాంకుల లాభాలను మదుపు చేయడంలోనూ,మరింత సంపదను సృష్టించడానికి వెచ్చించకుండా పరోక్షంగా బడా పెట్టుబడి సంస్థల రుణ ఎగవేతకు సహకరిస్తుంది.పైగా ఇప్పుడు నగదు బదిలీల రుసుం వసూలుకు బిజెపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)నియంత్రణలో ఎన్పీసీపీ ద్వారా యూపీఐ పేమెంట్స్‌ 2016 నవంబర్‌ 4నుండి సాఫీగా జరుగుచున్నవి.ప్రతి సెక్‌ండ కు సగటుగా దాదాపు రూ.7,500 లావాదేవీలు జరుగుచున్నవి. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌ టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా యుపిఐ ఎదిగింది.
ప్రతి రోజు 640 మిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తుంది. ఇప్పుడు యూపీఐ చెల్లింపులపై కూడా ఛార్జీలను వసూలు చేయడానికి కసరత్తులు జరుగుచున్నవి.దానితో నగదు బదిలీలకు అలవాటు పడిన ప్రజలలో ఆందోళన మొదలైంది.ఇప్పటికే బ్యాంకులలో రక రకాల రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీలతో, బ్యాంకు సేవలపై వసూలు చేస్తున్న చార్జీలతో,ప్రజల పొదుపు డిపాజిట్ల డబ్బులతో పోగవుతున్న లక్షల కోట్ల రూపాయల లాభాలను రుణ ఎగవేత దారుల పాలు కాకుండా చర్యలు తీసుకుని, ఉత్పత్తి, ఉత్పాదక రంగాల అభివృద్ధికి వెచ్చించి సామాజిక అభివృద్ధికి, దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.