సినిమా మన జీవనశైలిలో భాగం అవుతున్నదా !
Cinema
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
హాలీవుడ్ పేరుకు ప్రేరణగా బొంబాయి కేంద్రంగా అంతర్జాతీయ స్థాయి చలనచిత్రాలను నిర్మిస్తున్న హిందీ సినీ పరిశ్రమను బాలీవుడ్ అని పిలుస్తున్నాం. 1970ల్లో ప్రారంభంపైన బాలీవుడ్ సినీ వైభవం నేడు హాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించడం, అత్యుత్తమ సినిమాలను తీస్తూ ప్రపంచ సినీ ప్రేక్షకుల మనసులు దోయడం జరుగుతోంది. హిందీ భాష సినిమాల ద్వారా భారతీయ నృత్యాలు, సాంస్కృతిక వారసత్వ సంపద, కళలు, గీతాలు, సంగీత మాధుర్యాల ను భారతీయ ప్రేక్షకులకు కాకుండా ప్రపంచ దేశాల ప్రజల మన్ననలు సహితం పొందడం మన బాలీవుడ్ విజయంగా భావించాలి. తెలుగు సినీ పరిశ్రమను టాలీవుడ్ అని, కేరళ మలయాళ సినీ పరిశ్రమను మాలీవుడ్ అని, కన్నడ సినీ పరిశ్రమను సాండల్వుడ్ అని, పంజాబీ సినీ పరిశ్రమను పాలీవుడ్ అని, గుజరాతీ సినీ పరిశ్రమను డాలీవుడ్ అని, బెంగాలీ/మరాటీ/ఒడియా సినీ పరిశ్రమను ఓలీవుడ్ అని, అస్సామీ సినీ పరిశ్రమను జాలీవుడ్ అని, భోజ్పురీ సినీ పరిశ్రమను భోజ్వుడ్ అని, తమిళ సినీ పరిశ్రమను కొలీవుడ్ (చెన్నై, కొడంబాకమ్ పేరుతో)అని, పాకిస్థానీ సినీపరిశ్రమను లాలీవుడ్ అని పిలవడం పరిపాటి అయ్యింది.
ప్రపంచ బాలీవుడ్ దినోత్సవం : భారత జాతీయ సినీ అవార్డుల ప్రదానం, అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహణ, ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాల నిర్వహణతో బాలీవుడ్ సినీ పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కావడం చూస్తున్నాం. మన హిందీ సినిమాలు ప్రపంచ దేశాల్లో కూడా మంచి ఆదరణ పొందడం నేడు సర్వసాధారణం అయ్యిం ది. బాలీవుడ్ సినిమా ద్వారా మనసులను రంజింపజేసే సుస్వర సంగీతం, ఆకర్షణీయ క్లాసికల్/నాన్- క్లాసికల్ డ్యాన్సులు, మన ఆచార వ్యవహారాలు, భారతీయ జీవనశైలి, మానవీయ విలువలు, చారిత్రక/పౌరాణిక చరిత్రలు, మరిచి పోలేని పాత్రలు ఎన్నో మన బాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడం జరిగింది. 24 సెప్టెంబర్ 1913 రోజున దాదాసాహెబ్ పాల్కే నిర్మించిన భారత తొలి పూర్తి నిడివి కలిగిన రాజా హరిశ్చంద్ర సినిమా విడుదల కావడంతో ఆ అపూర్వ ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏట 24 సెప్టెంబర్ రోజున ప్రపంచ బాలీవుడ్ దినోత్సవం (వరల్డ్ బాలీవుడ్ డే) పాటించడం 2014 నుంచి ప్రారంభమైంది. సామాజిక అంశాలతో కూడిన ఫామిలీ డ్రామాల కేంద్రంగా 1940ల్లో భారతీయ సినిమా స్వర్ణ యుగం ప్రారంభం అయ్యింది. ప్రపంచ సినీ ప్రభావంతో భారతీయ బాలీవుడ్ సినిమా కొత్త పుంతలు తొక్కుతూ, టెక్నాలజీని ఒంటపట్టించుకొని అద్భుతాలు తెరపై చూపిస్తూ బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉజ్వలంగా ముందుకు సాగుతోంది. 1990ల తర్వాత పూర్వపు సినీ పరిశ్రమ నూతన రంగురంగుల కాస్ట్యూమ్స్, అద్భుత సంగీత సరాగాలు, ఉద్విగ్న భరిత కథ గమనాల తో న్యూ బాలీవుడ్ రంగులు పూసుకొని ప్రపంచ మానవాళి మనసుల్లో తిష్ట వేస్తున్న ది.
సినిమా ఒక వినోదం మాత్రమే కాదని, ఆ పరిశ్రమ ద్వారా మన కళలను కాపాడుకోవడం, సంస్కృతులను రేపటి తరానికి పరిచయం చేయడం, ఆ కథల నుంచి స్ఫూర్తిని పొందడం జరగాలి. నేడు ఓటిటి వేదికలు రావడం, గ్రాఫిక్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక అతి పెద్ద ప్రజాదరణ పొందిన పరిశ్రమగా కొనసాగుతున్నది. భిన్న భాషల భారతం లో అనేక సినిమాలు విడుదల అవుతూ మనకు తెలియకుండానే మన సామాజిక జీవన విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. నేటి సినిమాలు మన సంస్కృతికి అద్దం పడుతూ, కళలను పోషిస్తూ, కథలతో కట్టిపడేస్తూ, పరిమిత స్థాయిలో పాశ్చాత్య రంగులను పులుముకుంటూ ముందుకు సాగాలని కోరుకుందాం.