Skip to content
బిజినెస్ వార్తలు

EPFO WhatsApp: ఇక PF బ్యాలెన్స్‌ కోసం యాప్‌ అవసరం లేదు.. వాట్సాప్‌లోనే అన్ని వివరాలు…

Krishna Rao 14 Sep 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
EPFO WhatsApp: ఇక PF బ్యాలెన్స్‌ కోసం యాప్‌ అవసరం లేదు.. వాట్సాప్‌లోనే అన్ని వివరాలు…

EPFO Rules

EPFO WhatsApp Service: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన చందాదారులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF) ఖాతాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకునేందుకు ఉమాంగ్‌ యాప్‌ లేదా EPFO వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్‌ కావాల్సిన అవసరం లేకుండా వాట్సాప్‌ ద్వారానే సేవలను పొందే అవకాశం కల్పించింది. చందాదారుల అవసరాలను సులభంగా, వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ వాట్సాప్‌ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్‌లోనే PF వివరాలు
EPFO అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ హెల్ప్‌డెస్క్‌ ద్వారా సభ్యులు తమ PF ఖాతాకు సంబంధించిన పలు ప్రాథమిక వివరాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఖాతాలో ప్రస్తుతం ఎంత PF బ్యాలెన్స్‌ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల ఖాతాలో జమ అయిన చివరి ఐదు PF కాంట్రిబ్యూషన్ల వివరాలను కూడా పొందవచ్చు. ఇక PF ఖాతా నుంచి విత్‌డ్రాయల్‌ లేదా అడ్వాన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సభ్యులు తమ క్లెయిమ్‌ ప్రస్తుతం ఏ దశలో ఉందో వాట్సాప్‌ ద్వారానే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖాతాకు సంబంధించిన సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే వాటిపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది.

ముందుగా మొబైల్‌ నంబర్‌ చెక్‌ చేసుకోవాలి
వాట్సాప్‌ ద్వారా EPFO సేవలను వినియోగించుకునే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. సభ్యుడి UANకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ నుంచే వాట్సాప్‌ ద్వారా సందేశం పంపాల్సి ఉంటుంది. వేరే మొబైల్‌ నంబర్‌ నుంచి ఈ సేవలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే ఖాతా వివరాలు అందుబాటులోకి రాకపోవచ్చు.

రీజినల్‌ ఆఫీస్‌ నంబర్‌కు మెసేజ్‌
EPFO తన ప్రాంతీయ కార్యాలయాల పరిధిని బట్టి వేర్వేరు వాట్సాప్‌ నంబర్లను కేటాయించింది. కాబట్టి ముందుగా మీ PF ఖాతా ఏ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఆ కార్యాలయానికి సంబంధించిన అధికారిక వాట్సాప్‌ నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.

ఆ తర్వాత సేవ్‌ చేసిన నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ లేదా ‘Help’ అని మెసేజ్‌ పంపాలి. సందేశం వెళ్లిన తర్వాత ఆటోమేటెడ్‌ మెనూ కనిపిస్తుంది. అందులో PF బ్యాలెన్స్‌, క్లెయిమ్‌ స్టేటస్‌, చివరి లావాదేవీల వంటి అందుబాటులో ఉన్న సేవల్లో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఈ సూచనలు పాటిస్తే క్షణాల్లో సమాచారం
మెనూలో సంబంధిత సేవను ఎంచుకున్న తర్వాత వాట్సాప్‌ చాట్‌లో అడిగిన వివరాలను సూచించిన విధంగా నమోదు చేయాలి. ప్రక్రియ పూర్తయిన అనంతరం మీ PF ఖాతాకు సంబంధించిన సమాచారం వాట్సాప్‌ స్క్రీన్‌పైనే కనిపిస్తుంది. దీంతో ప్రతిసారి EPFO కార్యాలయాన్ని సంప్రదించడం లేదా ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.

EPFO వెబ్‌సైట్‌లో నంబర్‌ వివరాలు
మీ PF ఖాతాకు సంబంధించిన రీజినల్‌ ఆఫీస్‌ అధికారిక వాట్సాప్‌ నంబర్‌ ఏదో తెలుసుకోవాలంటే EPFO అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Contact Us’ లేదా సంబంధిత WhatsApp Service విభాగాన్ని పరిశీలించవచ్చు. అధికారికంగా అందించిన నంబర్లనే ఉపయోగించడం ముఖ్యం. గుర్తుతెలియని నంబర్లకు PF ఖాతా లేదా వ్యక్తిగత వివరాలను పంపకుండా జాగ్రత్త వహించాలి.

కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గే అవకాశం
వాట్సాప్‌ ఆధారిత సేవలతో PF సభ్యులకు సేవలు మరింత సులభతరం అవుతాయని EPFO భావిస్తోంది. చిన్నచిన్న ఖాతా సంబంధిత సందేహాలు, ప్రాథమిక అభ్యర్థనల కోసం కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు కస్టమర్‌ కేర్‌ కాల్‌ సెంటర్లపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉన్న PF సభ్యులకు వేగంగా సమాచారాన్ని అందించేందుకు ఈ సేవ ఉపయోగపడనుంది.

మేలోనే మంత్రి ప్రకటన
సభ్యుల సేవలను మరింత క్రమబద్ధీకరించడంతో పాటు వారి సందేహాలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో వాట్సాప్‌ ఆధారిత చాట్‌బాట్‌ సేవలను తీసుకురావాలనే ప్రణాళికను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా మే నెలలో వెల్లడించారు. వినియోగదారుల ప్రశ్నలు, ప్రాథమిక ఖాతా సంబంధిత అభ్యర్థనలను సులభంగా నిర్వహించేలా ఈ వ్యవస్థను రూపొందించాలని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ఈ వాట్సాప్‌ ఆధారిత సేవలను EPFO అందుబాటులోకి తీసుకురావడంతో PF సభ్యులకు మరో డిజిటల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లైంది.

ట్యాగ్‌లు: EPFO whatsapp