Editorial On Forest Rights: అడవిపై హక్కు ఎవరిది ?
Forest Rights: అటవీ హక్కుల చట్టం కింద హక్కుల గుర్తింపు ప్రక్రియకు గ్రామసభే ప్రారంభ స్థాయి సంస్థ. హక్కుల దావాలను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, హక్కులపై తీర్మానాలు చేయడం వంటి బాధ్యతలు గ్రామసభకు ఉన్నాయి.
Forest Rights: భారతదేశంలోని గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం అభివృద్ధి, సంక్షేమం, పేదరికం వంటి పరిమిత కోణాల్లో చూడటం చాలాకాలంగా జరుగుతున్న పొరపాటు. గిరిజనుల సమస్యకు కేంద్రంలో ఉన్న ప్రశ్న భూమి. ఆ భూమికి అర్థం అడవి. అడవికి అర్థం జీవనాధారం. జీవనాధారానికి అర్థం వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఉనికి. అందుకే గిరిజనుల విషయంలో అడవి భూమిని ఒక సాధారణ వనరుగా, ప్రాజెక్టుకు కేటాయించగల భూమిగా మాత్రమే చూడటం చారిత్రక వాస్తవాన్ని నిరాకరించడమే.
2006లో అమల్లోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే ఉద్దేశంతో వచ్చింది. వలస పాలన కాలం నుంచి కొనసాగిన అటవీ పాలనా వ్యవస్థలు అడవిపై ఆధారపడి జీవించిన సమాజాల సంప్రదాయ హక్కులను గుర్తించలేదు. ఈ చట్టం ఆ లోటును పూడ్చేందుకు ప్రయత్నించింది. వ్యక్తిగత సాగు, నివాస హక్కులతో పాటు సామూహిక అటవీ వనరులపై హక్కులు, మేత, నీటి వనరులు, జీవవైవిధ్యం, సంప్రదాయ జ్ఞానం, అడవిని సంరక్షించే హక్కులు వంటి అంశాలను చట్టం గుర్తించింది. గిరిజనుల జీవన విధానాన్ని చట్టబద్ధమైన హక్కుగా చూడటం ఇందులోని కీలకమైన మార్పు.
ఇప్పుడు అదే చట్టం అమలులో గ్రామసభ పాత్రపై కేంద్ర ప్రభుత్వంలోని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైఖరి మారిందన్న ఆరోపణ తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు, లేవనెత్తిన చట్టపరమైన ప్రశ్నలు రాజకీయ పార్టీల పరిధిని దాటి ఉంది. అది గిరిజనుల రాజ్యాంగబద్ధమైన హక్కులకు, అటవీ హక్కుల చట్టం ఉద్దేశానికి సంబంధించిన ప్రశ్న.
కాంగ్రెస్ పార్టీ వాదన ప్రకారం, ఆగస్టు 31న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ విద్యుత్ మంత్రిత్వ శాఖకు పంపిన ఒక సమాచారంలో, అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించే ప్రాజెక్టులకు గ్రామసభ సమ్మతి తప్పనిసరి అని అటవీ హక్కుల చట్టంలో నిబంధన లేదు. ఈ వైఖరి గతంలో అదే మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలు, వివరణలకు భిన్నంగా ఉందన్నది ఇక్కడ మొదట గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం.
అటవీ హక్కుల చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అంటే చట్టం నుంచి దూరంగా నిలబడి కేవలం ఇతర శాఖల నిర్ణయాలను సమన్వయం చేసే సంస్థగా దాని పాత్రను అర్థం చేసుకోవడం సరికాదు. చట్టం అమలుకు సంబంధించి గిరిజనుల హక్కులను రక్షించడం దాని ప్రాథమిక బాధ్యతల్లో ఒకటి.
అయితే, అటవీ హక్కుల చట్టం కింద హక్కుల గుర్తింపు ప్రక్రియకు గ్రామసభే ప్రారంభ స్థాయి సంస్థ. హక్కుల దావాలను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, హక్కులపై తీర్మానాలు చేయడం వంటి బాధ్యతలు గ్రామసభకు ఉన్నాయి. అంతే కాదు, అడవి, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, నీటి వనరులు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే బాధ్యతను కూడా చట్టం గ్రామసభకు అప్పగించింది.
అందువల్ల గ్రామసభను ఒక సాధారణ స్థానిక సంస్థగా చూడటం చట్టం ఉద్దేశాన్ని కుదించడం అవుతుంది. అది గిరిజన సమాజం తన భూమి, అడవి, జీవన వనరులపై నిర్ణయం చెప్పే ప్రజాస్వామ్య వేదిక. శతాబ్దాలుగా అడవిని ఉపయోగించిన, కాపాడిన, దాని సహజ వ్యవస్థతో జీవించిన సమాజానికి తమ భవిష్యత్తుపై మాట చెప్పే అవకాశం కల్పించడమే అటవీ హక్కుల చట్టం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన.
ఇక్కడే అభివృద్ధి అనే పదానికి మరోసారి అర్థం చెప్పుకోవాలి. రహదారి కావాలి. విద్యుత్ కావాలి. పాఠశాలలు, ఆసుపత్రులు కావాలి. సాగునీరు, ఉపాధి, సమాచార సదుపాయాలు కావాలి. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదని ఎవరూ చెప్పరు. చెప్పలేరు కూడా.
కానీ అభివృద్ధి కోసం ఎవరిని నిర్వాసితులను చేస్తున్నాం? ఎవరి భూమిని తీసుకుంటున్నాం? ఎవరి జీవన వ్యవస్థను మార్చుతున్నాం? నిర్ణయం తీసుకునే ముందు వారి అభిప్రాయాన్ని ఎందుకు తెలుసుకోకూడదు? అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా అభివృద్ధిని ముందుకు నడపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. గిరిజనుల అభ్యంతరాన్ని ప్రాజెక్టు వ్యతిరేకతగా చిత్రీకరించడం కూడా సరైనది కాదు.
ఒక గ్రామానికి అడవి అంటే కేవలం చెట్లు కాదు. అక్కడి ఆహారం, ఔషధం, పశువుల మేత, నీటి ప్రవాహాలు, పండుగలు, ఆచారాలు, పూజా స్థలాలు, పూర్వీకుల జ్ఞాపకాలు, వేట, సేకరణకు సంబంధించిన సంప్రదాయాలు అన్నీ దానితో ముడిపడి ఉంటాయి. ఒక ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాజెక్టుగా మార్చినప్పుడు కేవలం భూమి విస్తీర్ణాన్ని కోల్పోవడం జరగదు. ఒక సమాజం యొక్క జీవన పద్ధతిలో మార్పు వస్తుంది.
ఈ వాస్తవాన్ని భారత సుప్రీంకోర్టు కూడా న్యాయపరంగా గుర్తించింది. 2013లో ఒడిశాలోని నియమగిరి కొండలపై బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో గ్రామసభల పాత్రకు అత్యంత ప్రాధాన్యం లభించింది. ఆ తీర్పు తర్వాత నియమగిరి ప్రాంతంలోని గిరిజన గ్రామసభలు తమ మత, సాంస్కృతిక, సామాజిక హక్కులకు సంబంధించిన అంశాలపై నిర్ణయం చెప్పే ప్రక్రియ జరిగింది. అటవీ హక్కులు కాగితంపై ఉన్న హక్కులు కావని, వాటి నిర్ధారణకు స్థానిక సమాజానికి వాస్తవమైన పాత్ర ఉండాలని ఆ పరిణామం స్పష్టం చేసింది.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిక పత్రాల్లో కూడా నియమగిరి తీర్పు గ్రామసభ కేంద్ర పాత్రను పునరుద్ఘాటించినట్లు నమోదైంది. ఇది కేవలం ఒక తీర్పు ప్రభావం కాదు.
అటవీ హక్కుల చట్టం మొత్తం నిర్మాణంలోనే గ్రామసభకు ప్రత్యేక స్థానం ఉంది. చట్టం గ్రామసభకు హక్కుల నిర్ధారణతో పాటు సామూహిక అటవీ వనరుల సంరక్షణ బాధ్యతను కూడా ఇస్తుంది. అంటే ప్రభుత్వం ఒకవైపు అడవిని రక్షించాలి, మరోవైపు అడవిపై ఆధారపడి జీవించే సమాజాన్ని రక్షించాలి. ఈ రెండు లక్ష్యాలను పరస్పర విరుద్ధాలుగా చూడాల్సిన అవసరం లేదు. నిజానికి గిరిజన సమాజాల భాగస్వామ్యం లేకుండా అటవీ సంరక్షణకు దీర్ఘకాలిక బలం రావడం కష్టం.
అదే సమయంలో, గ్రామసభ సమ్మతి లేదా చట్టపరమైన ప్రక్రియను ప్రాజెక్టు చివరి దశకు వాయిదా వేస్తే, ఆ సమయానికి ప్రాజెక్టు దాదాపు ఖరారైపోయే ప్రమాదం కూడా ఉంది. భూమి ఎంపిక, పెట్టుబడులు, పరిపాలనా అనుమతులు, ఒప్పందాలు అన్నీ ముందుకు వెళ్లిన తర్వాత గ్రామసభ అభిప్రాయాన్ని అడిగితే అది నిజమైన నిర్ణయ ప్రక్రియగా మిగలదు. ఒకసారి ప్రాజెక్టు రాజకీయ, ఆర్థిక, పరిపాలనాపరంగా ముందుకు వెళ్లిన తర్వాత స్థానిక సమాజానికి సమ్మతి చెప్పడం తప్ప మరొక వాస్తవిక మార్గం లేకుండా పోవచ్చు.
అందుకే, చట్టం ఏమి చెబుతుందో స్పష్టంగా ప్రకటించడం అవసరం. అటవీ భూమి మళ్లింపులో అటవీ హక్కుల చట్టం కింద హక్కుల గుర్తింపు ఏ దశలో పూర్తి కావాలి? గ్రామసభ పాత్ర ఏమిటి? ఏ సందర్భాల్లో గ్రామసభ తీర్మానం అవసరం? పునరావాసం, పరిహారం, సామూహిక హక్కులు ఎలా రక్షించాలి? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన, చట్టబద్ధమైన వివరణ ఇవ్వాలి.
గిరిజనుల విషయంలో మరో పెద్ద సమస్య చట్టం ఉండటం కాదు. చట్టం అమలు కావడం. అమలుకానప్పుడు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా గిరిజనులకు న్యాయం జరగదు. అటవీ సంరక్షణ, అభివృద్ధి ఏకకాలంలో సాధ్యంకావాలంటే, చట్టాలను సమర్థంగా అమలు చేసి తీరాలి.