ప్రైవేటు రంగంలో క్షిపణుల ఉత్పత్తికి తలుపులు తెరిచిన భారత్
Missiles
టీఎన్ అశోక్
రక్షణ ఉత్పత్తుల్లో ప్రభుత్వ నియంత్రణకు చివరి ప్రధాన కంచుకోటలలో ఒకటైన సంప్రదాయ క్షిపణుల తయారీరంగంలో ప్రైవేట్ రంగానికి భారతదేశం తలుపు లు తెరిచింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) అర్హత కలిగిన భారతీయ ప్రైవేట్ కంపెనీలకు అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశ సైనిక సన్నద్ధతపైనా, ఆయుధ ఎగుమతిదారుగా ఎదుగుతున్న దాని ఆశయాలపైనా ఈ నిర్ణయం దీర్ఘకాలిక పర్యవసనాలకు
దారితీయనుంది.
ఈ చర్య సంప్రదాయబద్ధంగా అనేక భారతీయ క్షిపణులకు ప్రధాన ఉత్పత్తి సంస్థగా ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్)తో పాటు, ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ ఉత్పత్తిదారులతో ప్రైవేట్ పరిశ్రమను బలం గా పోటీ క్షేత్రంలోకి తీసుకువస్తుంది. బిడిఎల్ ఒక రకం గా గుత్తాధిపత్యాన్ని అనుభవించినప్పటికీ, ఇప్పుడు ఎగుమతులలో పోటీ సవాలును ఎదుర్కొంటోంది. ఇది పాత వ్యవస్థ నుండి ఒక గణనీయమైన మార్పు. పాత వ్యవస్థ ప్రకారం డిఆర్‌డిఒ ఒక క్షిపణిని రూపకల్పన చేసి అభివృద్ధి చేసేది. ఆ తర్వాత దానిని తయారు చేయడానికి ఒక ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్పత్తి సంస్థకు అప్పగించేవారు. కొత్త వ్యవస్థలో ప్రైవేట్ కంపెనీలు సాంకేతిక బదిలీ, అభివృద్ధి- ఒప్పందాల కోసం పోటీపడతాయి.
కానీ ఇందులో ఒక కీలకమైన పరిధి ఉంది. భారతదేశం తన సంప్రదాయ క్షిపణి ఆయుధాగారాన్ని తెరుస్తోందే తప్ప తన వ్యూహాత్మక అణు నిరోధక శక్తిని కాదు. అగ్ని, కె వంటి వ్యూహాత్మక క్షిపణులు బదిలీ కార్యక్రమం పరిధిలోకి రావు. బ్రహ్మోస్ కూడా దీని పరిధిలోకి రాదు. కానీ ఇందుకు వేరే కారణాలు ఉన్నాయి. అవి భారత్ ప్రత్యేక ఒప్పందాలతో నడిచే సంయుక్త కార్యక్రమం కాబట్టి.
ఇక్కడ ఒక సాంకేతిక సవరణ కూడా ఉంది. అగ్ని అనేది బాలిస్టిక్ క్షిపణుల కుటుంబానికి చెందినది. దీనిలోని అత్యంత సుదూర పరిధి గల రకాలను తరచుగా ఐసిబిఎం -తరగతిగా వర్ణిస్తారు. బ్రహ్మోస్ ఐసిబిఎం కాదు. ఇది భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని భూమి, సముద్రం, గాలి నుండి ప్రయోగించవచ్చు. ఇప్పుడు ఎందుకు తలుపులు తెరుస్తున్నారు? సమాధా నం చాలా సులువు. ప్రస్తుతం నమ్మకమైన ప్రభుత్వ-ఆధిపత్య వ్యవస్థ ఉత్పత్తి చేయగలిగే దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, చాలా వేగంగా భారతదేశానికి క్షిపణులు అవసరం. ఆధునిక యుద్ధ రంగంలో క్షిపణులు ఇకపై అప్పుడప్పుడు ప్రయోగించే ప్రతిష్టాత్మక ఆయుధాలు కావని రుజువైంది. ఉక్రెయిన్, మధ్య ప్రాచ్యం, పశ్చిమ ఆసియాలో ఇటీవల యుద్ధాలు భారీ సంఖ్యలో కచ్చితమైన ఆయుధాలు, వాయు రక్షణ ఇంటర్ సెప్టార్ లు, నౌకా విధ్వంసక క్షిపణులు, వ్యూహాత్మక బాలిస్టిక్ వ్యవస్థలను కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యతను చూపించాయి. భారతదేశం చైనా, పాకిస్తాన్ల నుండి కూడా రెండు వైపు ల భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. సైన్యానికి, వైమానిక దళానికి గగనతల రక్షణ క్షిపణులు అవసరం. నౌకాదళానికి నౌకా విధ్వంసక ఆయుధాలు కావాలి. యుద్ధ విమానాలకు గగనతల క్షిపణులు కావాలి. సాయుధ దళాలకు సుదూరాల్లోని రాడార్ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు, ఇతర లక్ష్యాలను ధ్వంసం చేయగల, మరింత అధునాతనమైన ఆయుధాలు అవసరం.
ఒకే ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్పత్తి కేంద్రం ఆ స్థాయిలో క్షిపణులను సులభంగా అందించలేదు. కాబట్టి ప్రభుత్వం క్షిపణులను ప్రయోగశాల నుండి కర్మాగారాల స్థాయికి తీసుకురావాలని కోరుకుంటోంది. ఈ కొత్త విధానం దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచుతుందని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, దేశీయ విలువ జోడింపును పెంచుతుందని, ఎంఎస్ఎంఇలు, సాంకేతిక భాగస్వాములను రక్షణ సరఫరా గొలుసులోకి మరింత లోతుగా తీసుకువస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది.
ప్రారంభంలో ఎంపికయ్యే అవకాశం ఉన్న వాటిలో అస్త్రా గగనతల క్షిపణులు, ఆకాశ్, ఆకాశ్ విషోరాడ్స్, రుద్రమ్ యాంటీ- రేడియేషన్ క్షిపణులు, నాగ్, ఇతర ట్యాంక్ విధ్వంసక ఆయుధాలు, నౌకా విధ్వంసక క్షిపణి, ప్రళయ్ మొదలైనవి ఉన్నాయి. ప్రత్యేకించి ప్రళయ్ ముఖ్యమైనది. ఎందుకంటే, ఇది గణనీయమైన దూరంలోని లక్ష్యాలపై కచ్చితమైన దాడుల కోసం రూపొందించబడిన, సాంప్రదాయ ఆయుధాలతో కూడిన క్వాసీ- బాలిస్టిక్ క్షిపణి. ప్రైవేట్ రంగం ఇప్పటికే క్షిపణి వ్యాపారంలోకి వేగంగా ప్రవేశిస్తోంది.
అదానీ డిఫెన్స్, భారత్ ఫోర్జ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో, సోలార్ ఇండస్ట్రీస్, ఐకామ్ టెలి వంటి కంపెనీలు ఇప్పటికే క్షిపణి సంబంధి త సామర్థ్యాలు, భాగస్వామ్యాలు లేదా డిఆర్‌డిఒ కార్యక్రమాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, అదానీ గ్రూపు మధ్యప్రదేశ్‌లోని ఒక పెద్ద ప్రైవేట్ రంగ క్షిపణి తయారీ వ్యవస్థలో రూ.2,500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. అదానీ ఇప్పటికే కొన్ని డిఆర్‌డిఒ క్షిపణి కార్యక్రమాలకు అభివృద్ధి- ఉత్పత్తి భాగస్వామిగా ఉండగా, భారత్ ఫోర్జ్, టాటా గణనీయమైన రక్షణ తయారీ సామర్థ్యాలను నిర్మించుకున్నాయి. సోలార్ ఇండస్ట్రీస్ కూడా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి నుండి అధునాతన రక్షణ వ్యవస్థల వైపు దూకుడుగా విస్తరించింది. ఈ కంపెనీలకు, క్షిపణులు ఒక భారీ కొత్త మార్కెట్‌ను సూచిస్తున్నాయి.
విదేశాలలో డబ్బు ఉంది. భారతదేశ రక్షణ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇవి రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు (సుమారు 4.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. ఇది అంతకు ముందు ఏడాది నమోదైన రూ.23,622 కోట్ల తో పోలిస్తే 62.66 శాతం పెరుగుదల. ఇందులో ప్రైవేట్ రంగం వాటా రూ.17,353 కోట్లు (45.16 శాతం) కాగా, రక్షణరంగ ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యు) వాటా రూ.21,071కోట్లుగా ఉంది. ప్రస్తుతం భారత్ 80కి పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవా లి. ఆ 4.5 బిలియన్ డాలర్ల మొత్తంలో క్షిపణి ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకించి అంకెలను ప్రచురించదు. కాబట్టి, 2025 భారతదేశం ఒక నిర్దిష్ట డాలర్ల విలువైన క్షిపణులను ఎగుమతి చేసిందని చెప్పడం తప్పుదోవ పట్టిస్తుంది. అయితే, బహిరంగంగా వెల్లడైన క్షిపణి ఒప్పందాలు వాటి సమర్థతను ప్రదర్శిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ 2022లో మూడు తీరప్రాంత క్షిపణి బ్యాటరీల కోసం 375 మిలియన్ డాలర్ల బ్రహ్మోస్ ఒప్పందంపై సంతకం చేసింది. దాదాపు 230 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంతో, ఆర్మేనియా ఆకాశ్ క్షిపణి వ్యవస్థకు మొదటి విదేశీ కొనుగోలుదారుగా నిలిచింది. ఇండోనేషియా ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు, అస్త్రా గగనతల- క్షిపణులకు సంబంధించిన ఒక ఒప్పందంలోకి ప్రవేశించింది. రాయిటర్స్ ఈ ప్యాకేజీ విలువ సుమారు 630 మిలియన్ డాలర్లుగా నివేదించింది. అయితే ఇండోనేషియా పక్షం బ్రహ్మోస్ విభాగానికి సంబంధించిన వివరణాత్మక విలువను విడిగా బహిరంగంగా వెల్లడించలేదు. వియత్నాంను కూడా బ్రహ్మోస్ కొనుగోలుదారుగా గుర్తించారు. అదే సమయంలో అనేక ఇతర దేశాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. భారతదేశ క్షిపణి దౌత్యం ఆగ్నేయాసియా, విస్తృత ఇండో పసిఫిక్‌లో ఎక్కువగా కేంద్రీకృతమవుతోంది. ఇక్కడి దేశాలు చైనాకు, పాశ్చాత్య సరఫరాదారులకు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. కచ్చితంగా అక్కడే ప్రైవేట్ రంగం అవకాశాన్ని చూస్తోంది. అయితే ప్రైవేట్ కంపెనీలు ఈ క్షిపణులను విదేశాలకు అమ్మగలవా? కేవలం వాటిని తయారు చేసినంత మాత్రాన కాదు. ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ ఒకానొక ఉదయం ఆకాశ్, అస్త్ర లేదా ప్రళయ వ్యవస్థను విదేశీ ప్రభుత్వానికి అమ్మాలని నిర్ణయించుకోలేదు. రక్షణ ఎగుమతులు కట్టుదిట్టమైన నియంత్రణలో ఉంటాయి. రక్షణ ఉత్పత్తి విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్), SCOMET ఫ్రేమ్‌వర్క్, ఇతర వర్తించే చట్టాల కింద సంబంధిత ఆయుధాల ఎగుమతి అనుమతులను జారీ చేస్తుంది. సైనిక సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతి ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటుందని డిఆర్‌డిఒ సొంత సాంకేతిక- బదిలీ విధానం స్పష్టం చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రైవేట్ ఉత్పత్తిదారు, ఎగుమతిదా రు కావచ్చు. కానీ ఒక సున్నితమైన ఆయుధాన్ని ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎగుమతి చేయాలా, వద్దా అనే దానిపై భారత ప్రభుత్వానికే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. ప్రభుత్వం తుది వినియోగదారు షరతులు, లైసెన్సింగ్ పరిమితులు, ఇతర రక్షణ చర్యలను కూడా విధించగలదు.
అయితే, ప్రైవేట్ క్షిపణి ఉత్పత్తి భద్రతాపరమైన ప్రమాదాన్ని సృష్టిస్తుందా? ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్న బలమైన వాదన ఇదే. క్షిపణులు కార్లు కావు. వాటి తయారీలో చోదక సాంకేతికత, మార్గదర్శక వ్యవస్థలు, సీకర్లు, ఎలక్ట్రానిక్స్, వార్హెడ్లు, నావిగేషన్, సాఫ్ట్వేర్, అత్యంత సున్నితమైన తయారీ ప్రక్రియలు ఉంటాయి.
మరో ప్రమాదం కూడా ఉంది. అది వాణిజ్య ఒత్తిడి. వాటాదారుల రాబడిని గరిష్ఠం చేయడమే లక్ష్యంగా ఉన్న సంస్థ, సహజంగానే సాధ్యమైనంత పెద్ద మార్కెట్‌ను కోరుకుంటుంది. అయితే, ఒక ఆయుధాన్ని అమ్మడం ప్రాంతీయ సైనిక సమతుల్యతను మార్చగలదనే కారణంతో, ప్రభుత్వం కొన్నిసార్లు లాభదాయకమైన వినియోగదారుడిని కూడా తిరస్కరించాల్సి వస్తుంది.
కాబట్టి వాణిజ్య ఆకాంక్ష ఎప్పటికైనా జాతీయ భద్రతతో ఢీకొంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
దీనికి ప్రభుత్వం సమాధానం ఏమిటంటే, ఈ ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రభుత్వం స్పష్టంగా విశ్వసిస్తోంది. ప్రైవేట్ కంపెనీలకు క్షిపణి ఆయుధాగారంపై అనియంత్రిత ప్రవేశం లభించదు. అవి అర్హత, ధృవీకరణ, భద్రత, నియంత్రణ అవసరాలను తప్పనిసరిగా పాటించాలి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సాంకేతిక పర్యవేక్షణలో డిఆర్‌డిఒ పాలుపంచుకుంటూనే ఉంటుంది. అత్యంత సున్నితమైన ఆయుధాలు ఈ కార్యక్రమానికి దూరంగా నే ఉంటాయి. ఆ వ్యత్యాసం చాలా కీలకం. భారతదేశం తన అణ్వాయుధ నిరోధక శక్తిని ప్రైవేటీకరించడం లేదు. అగ్ని కె వ్యూహాత్మక క్షిపణులు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండగా, బ్రహ్మోస్ మాత్రం భారత్- సంయుక్త భాగస్వామ్య చట్రం కిందనే కొనసాగుతోంది.
కాబట్ట్లి, ఈ విస్తృత వ్యూహం భారతదేశానికి మకుటం లాంటి ఆభరణాలను అమ్మడం కన్నా, ఒక పెద్ద, పోటీతత్వంతో కూడిన సాంప్రదాయ క్షిపణి పరిశ్రమను సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. దీని వెనుక ఉన్న తర్కం చాలా బలమైనది. భారతదేశం ఆధునిక యుద్ధం చేయాలనుకుంటే, దానికి పారిశ్రామిక స్థాయిలో ఆయుధ సామగ్రి అవసరం. ఒకవేళ అది బలమైనఆయుధ ఎగుమతిదారుగా ఎదగాలనుకుంటే, భారత సాయుధ దళాలకు కొరత లేకుండా విదేశీ వినియోగదారులకు సేవలు అందించగల ఉత్పత్తి శ్రేణులు దానికి అవసరం.
ప్రైవేట్ రంగం దీనిని ఒక లాభదాయకమైన అవకాశంగా చూస్తోంది. ప్రభుత్వం ఇందులో పారిశ్రామిక సామర్థ్యాన్ని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చూస్తోంది. సైన్యం మరింత విస్తృతమైన సరఫరా స్థావరం అవకాశాన్ని చూస్తోంది. జాతీయ భద్రత కంటే తక్షణ లాభాల వేటకే ప్రాధాన్యత ఇవ్వకుండా, ఈ మూడింటినీ భారతదేశం సాధించగలదా లేదా అన్నదే అసలైన పరీక్ష.