Badlav zaroori Hai: కార్పొరేట్ల కోసమే మోదీ పాలన.. ‘మహిళా అభివృద్ధి’ అంతా డొల్ల: ఎన్ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
Badlav zaroori Hai: కార్పొరేట్ల కోసమే మోదీ పాలన.. ‘మహిళా అభివృద్ధి’ అంతా డొల్ల: ఎన్ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
Badlav zaroori Hai: తరతరాలుగా అడవుల్లో జీవిస్తున్న గిరిజనులను ఛత్తీస్‌గఢ్, మణిపూర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బుల్డోజర్లతో వెళ్లగొడుతున్నారు. గిరిజనుల నేలల కింద ఉన్న విలువైన ఖనిజ సంపదను అదానీ, అంబానీ కంపెనీలకు దోచిపెట్టడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి.
Badlav zaroori Hai: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సీపీఐ నిర్వహించిన ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు అత్యవసరం) జాతీయ బహిరంగ సభలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ (NFIW) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యురాలు అన్నీ రాజా ప్రసంగించారు. కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న ఫాసిస్ట్ ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి, అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే పనిచేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా అన్నీ రాజా మాట్లాడుతూ… “ఈ దేశం మనందరిది, ఎవరి అబ్బసొత్తూ కాదు. రాజ్యాంగాన్ని, పార్లమెంటును దుర్వినియోగం చేస్తూ దేశ సంపదనంతా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. తరతరాలుగా అడవుల్లో జీవిస్తున్న గిరిజనులను ఛత్తీస్‌గఢ్, మణిపూర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బుల్డోజర్లతో వెళ్లగొడుతున్నారు. గిరిజనుల నేలల కింద ఉన్న విలువైన ఖనిజ సంపదను అదానీ, అంబానీ కంపెనీలకు దోచిపెట్టడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి. గిరిజనులను ‘వనవాసులు’ అని పిలుస్తూ, జనగణనలో వారి స్వతంత్ర గుర్తింపును తుడిచేసి బలవంతంగా ఒకే మతం కింద నమోదు చేయిస్తున్నారు. దీనివల్ల వారి జనాభా తగ్గించి, బడ్జెట్ కేటాయింపులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కుదించాలని చూస్తున్నారు” అని ఆరోపించారు.
ఏ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు?
ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికలపై ‘మహిళా నాయకత్వంలో అభివృద్ధి’ అని గొప్పలు చెప్పుకోవడంపై అన్నీ రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మోదీ గారూ.. మీరు ఏ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? నెలకు కేవలం రెండుమూడు వేల రూపాయల అరకొర వేతనాలతో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల గురించా? మహారాష్ట్రలో జనవరి నుంచి నేటి వరకు చేసిన పనికి వేతనాలు అందక అలమటిస్తున్న మహిళల గురించా?” అని నిలదీశారు. ‘బేటీ బచావో – బేటీ పఢావో’ అనేది కేవలం ప్రచారానికే పరిమితమైందని, దేశంలో నేటికీ భ్రూణహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది ప్రాథమిక పాఠశాలలను మూసివేసి బాలికలను చదువుకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కాగితాల పుస్తకమే!
2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదని, ఎన్ఎఫ్‌ఐడబ్ల్యూ (NFIW) 2021లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఫలితంగానే మోదీ ప్రభుత్వం దిగివచ్చిందని అన్నీ రాజా గుర్తుచేశారు. అయితే ఆ చట్టాన్ని కూడా వెంటనే అమలు చేయకుండా డీలిమిటేషన్, జనగణన అనే అనవసరమైన నిబంధనలు పెట్టి కాగితాలకే పరిమితం చేశారన్నారు. పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం నేటికీ కేవలం 13 శాతానికే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుల వివక్షపై సమరం తప్పదు
దేశంలో నేటికీ కుల వ్యవస్థ, అంటరానితనం తీవ్రస్థాయిలో కొనసాగుతుండటం దారుణమన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఒక ప్రతిపక్ష నేత సభ నిర్వహించి వెళ్లిన తర్వాత ఆ ప్రదేశాన్ని ‘గోమూత్రంతో శుద్ధీకరణ’ చేశారంటే సంఘపరివార్ మనస్తత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను, సమానత్వాన్ని కాపాడుకోవడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈశాన్యం నుంచి గుజరాత్ వరకు మహిళలు, గిరిజనులు, దళితులు, కమ్యూనిస్టులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విరామం లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.