Skip to content
జాతీయం వార్తలు

Badlav zaroori Hai: మోదీ, అమిత్ షాలను గుజరాత్‌కు పంపాల్సిందే: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ

Krishna Rao 01 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Badlav zaroori Hai: మోదీ, అమిత్ షాలను గుజరాత్‌కు పంపాల్సిందే: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ

Badlav zaroori Hai: మోదీ, అమిత్ షాలను తిరిగి వారి సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు పంపే వరకు ఈ పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.

Badlav zaroori Hai: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సీపీఐ నిర్వహించిన ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు అత్యవసరం) జాతీయ బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ, వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు ఆయన విప్లవ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కె. రామకృష్ణ మాట్లాడుతూ… “కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీపీఐ నేతలను అరెస్టులు చేసినా, కేరళ వంటి చోట్ల ప్రత్యేక రైళ్లను రద్దు చేసినా లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా దేశం నలుమూలల నుంచి కార్యకర్తలు ఢిల్లీకి తరలిరావడం చారిత్రాత్మకం. జంతర్ మంతర్ వద్ద దేశ యువత, విద్యార్థులు గళమెత్తిన తర్వాత, దేశంలో మార్పు అత్యవసరమని గుర్తించి ‘బద్లావ్ జరూరీ హై’ అనే నినాదాన్ని ఎత్తుకున్న తొలి రాజకీయ పార్టీ సీపీఐ. లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులన్నింటినీ ఏకం చేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. మోదీ, అమిత్ షాలను తిరిగి వారి సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు పంపే వరకు ఈ పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ గత 12 ఏళ్ల పాలనలో నెరవేర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసరాల ధరల గురించి మాట్లాడకుండా కేవలం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో భారతదేశాన్ని, ప్రధానిని అవమానించినా మోదీ నోరు విప్పలేక లొంగిపోయారని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో ఎన్డీయే కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. “ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అలాగే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లాంటి లౌకిక భావాలు కలిగిన నేతలు దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మతాల పేరిట సమాజాన్ని విడదీస్తూ, మైనారిటీలు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేస్తున్న బీజేపీకి, మోదీ-అమిత్ షాల జోడీకి మద్దతు ఇవ్వడం తగదు” అని హితవు చెప్పారు.

కేంద్రంలో బీజేపీని గద్దె దించి, రాష్ట్రాల్లోనూ ఆ పార్టీని తుడిచిపెట్టే వరకు కమ్యూనిస్ట్ పార్టీ లౌకిక శక్తులను కలుపుకొని సమరశీల పోరాటాలు కొనసాగిస్తుందని రామకృష్ణ స్పష్టం చేశారు.