CM Revanth Reddy: ముఖ్యమంత్రికి నిరాకరణను తెలంగాణ గడ్డ సహించదు
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం రాజకీయ దురుద్దేశపూరితమే కాకుండా, ఒక విధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆయన పర్యటనకు కొద్ది రోజుల ముందు గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతించి, రేవంత్రెడ్డికి నిరాకరించడం సంకుచితత్వాన్ని సూచిస్తున్నది.
ఇద్దరు ముఖ్యమంత్రుల పర్యటన ఉద్దేశం తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడమే. అయినప్పటికీ ఒక రాష్ట్రాన్ని విస్మరించి కేవలం ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్కే పెట్టుబడులు రావాలని ఈ నిర్ణయం వెనుక ఆంతర్యమా? రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం మన దేశం ఫెడరల్ స్ఫూర్తికి పెద్దపీట వేసింది. విభిన్న మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, భావాలకు నిలయమైనందున భిన్నత్వం ఏకత్వంగా పేర్కొనబడింది. కానీ ఈ మధ్యకాలంలో కేంద్రం, రాష్ట్రాల హక్కులను హరిస్తూ నియంతృత్వ పోకడలతో అణచివేతకు పూనుకుంటున్నది.
గత 40 సంవత్సరాల క్రితం కూడా కేంద్రం, రాష్ట్రాల సంబంధాలపై సర్కారియా కమిషన్ నియమించబడింది. ఆ కమిటీ చక్కటి రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రాలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో అందులో పేర్కొనబడింది.
అయితే 12 సంవత్సరాల క్రితం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప పూర్తిగా కేంద్రీకృత, నియంతృత్వ విధానాలను అమలుపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని, సర్కారియా కమిషన్ సిఫార్సులను పాతరేస్తూ ఏకపక్ష పాలన సాగుతున్నది. మోడీ ఎంచుకున్న మార్గం ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి విరుద్ధం. కేంద్రీకృత ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తూ, వికేంద్రీకరణను తుంగలో తొక్కేశాడు.
అందుకు ఆయన పెద్ద నోట్ల రద్దు చేసి విఫలమైన తదుపరి ఒకే దేశం ఒకే విధానమనే కేంద్రీకృత నినాదంతో, లౌకిక వ్యవస్థకు విఘాతం కల్పిస్తూ ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తూ, ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తూ, రాజద్రోహం లాంటి కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరొకవైపు ప్రతిపక్షాల ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్రీకృత నియంతృత్వానికి రూపకల్పన చేస్తున్నాడు.
జిఎస్టి ద్వారా నిధులను కేంద్రానికి చేరిన తర్వాత రాష్ట్రాలకు విడుదల చేస్తున్నారు. ఇది నియంతృత్వానికి నిదర్శనం కాదా? అంతకుముందు రాష్ట్రాల నుండి కేంద్రానికి పంపించబడేవి. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కారు అంటూ బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో ఉండాలని వ్యవహరిస్తున్నారు.
అచ్చేదిన్ అంటూ అభివృద్ధిని అడ్డుకోవడం ఏమిటి? రాష్ట్రాలు అభివృద్ధి కాకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం 2047 రైసింగ్ తెలంగాణ విధానంతో అనేక దేశాల నుండి పరిశ్రమలను ఆకర్షిస్తూ, ఫ్యూచర్ సిటీతో సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే అనేక దేశాల నుండి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ బాట పెట్టారు.
అందులో భాగంగానే అమెరికా, లండన్ దేశాల పర్యటన వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దాని నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఇప్పటికే ప్రతిపక్షాల రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడంలో సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది.
రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాంటి ఆలోచనలకు తిలోదకాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం అంటే తెలంగాణ రాష్ట్రం, ప్రజలపై చిన్న చూపు, నిర్లక్ష్యం, అణచివేత. ఈ తెలంగాణ గడ్డ ఎవ్వరికి తలవంచదు, తలదించదు. ఆత్మగౌరవ పరిపాలన కావాలని కోరుకునే ఉద్యమాల గడ్డ అని మరువరాదు.
చాడ వెంకట్ రెడ్డి
మాజీ శాసనసభ్యులు, సిపిఐ