Skip to content
తెలంగాణ వార్తలు

CM Revanth Reddy: 16 మంది సీఎంలు రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. కేసీఆర్‌ ఒక్కరే రూ.8 లక్షల కోట్లు చేశారు.. బీఆర్ఎస్ మీద విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి

jagan 31 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
CM Revanth Reddy: 16 మంది సీఎంలు రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. కేసీఆర్‌ ఒక్కరే రూ.8 లక్షల కోట్లు చేశారు.. బీఆర్ఎస్ మీద విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy: మూసీ వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. రూ.52 కోట్ల వ్యయంతో నిర్మించిన 400 మీటర్ల పొడవైన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు.లక్షా యాభై వేల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఈ వంతెనను నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో అంబర్‌పేట–మూసారాంబాగ్ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ వేగంగా విశ్వనగరంగా ఎదుగుతోందని అన్నారు. విద్య, ఉద్యోగాలు, ఐటీ, సినిమా రంగాలకు కేంద్రంగా మారిన నగరం ప్రపంచంతో పోటీపడే స్థాయికి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు అభివృద్ధి విభాగాలుగా విభజించి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. క్యూర్‌లో సేవారంగం, ప్యూర్‌లో తయారీ రంగం, రేర్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.

అంబర్‌పేట నియోజకవర్గం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని సీఎం అన్నారు. మూసీ కాలుష్యం ఒకవైపు, వరదలు మరోవైపు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. చిన్నపాటి వర్షానికే పాత మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద ప్రవాహం ఏర్పడి ప్రమాదాలు జరిగేవని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం రెండేళ్లలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసిందని అన్నారు. అంబర్‌పేటలో పేదల కోసం 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ఇళ్ల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

కేసీఆర్ ఒక్కరే రూ.8.11 లక్షల కోట్ల అప్పు చేశారు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దివాలా తీసిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే రాష్ట్రం ఈ సంక్షోభంలోకి నెట్టబడిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లు మాత్రమే ఉంటే, కేసీఆర్ ఒక్కరే తన 9 ఏళ్ల పాలనలో దానిని ఏకంగా రూ. 8.11 లక్షల కోట్లకు పెంచేశారని సీఎం గణాంకాలతో సహా వివరించారు.

గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గమనించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నెల 7వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉండేదని ఆయన గుర్తుచేశారు. అయితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితిని చక్కదిద్ది, ప్రతినెల 1వ తేదీనే క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.ఉద్యోగులు మధ్య మధ్యలో నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, ఆనాడు పరిపాలన ఏ విధంగా ఉండేదో, నేడు తమ ప్రభుత్వంలో ఏ విధంగా సజావుగా సాగుతోందో వారే ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన భారీ అప్పుల భారాన్ని మోస్తూనే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

బతుకమ్మ కుంట, హైడ్రాపై వ్యాఖ్యలు

బతుకమ్మ కుంట ఆక్రమణల అంశంపై కూడా సీఎం స్పందించారు. కుంటను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటే హైడ్రాను తీసుకొచ్చారంటూ తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బతుకమ్మ కుంట ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ కొందరిపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల పరిరక్షణ విషయంలో ప్రజలు ఆలోచించాలని కోరారు. కబ్జాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డిపై బురద చల్లడానికి కొన్ని అల్లరి మూకలు బయల్దేరాయి. చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నామే తప్ప వాటిలో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు మేం కట్టలేదన్నారు.

1000 రోజుల ప్రజా పాలనపై వివరణ

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయ్యాయని సీఎం పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం నెలకు వేల కోట్ల రూపాయల అసలు, వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించారు.

అయితే తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ప్రతి నెలా నిర్ణీత సమయానికి జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతాల చెల్లింపులో మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రిటైర్మెంట్ బకాయిల్లో వేల కోట్ల రూపాయలను విడుదల చేశామని తెలిపారు.

ఉద్యోగాలు, విద్య, రైతుల కోసం చర్యలు

1000 రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం ప్రకటించారు. గతంలో నియామక పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నామని, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల కోసం 1000 రోజుల్లో రూ.1.70 లక్షల కోట్ల మేర ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కోసం రూ.20,617 కోట్లు వెచ్చించామని, ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. మహిళల కోసం కోటి మంది వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీ భారం తగ్గించే చర్యలు చేపట్టామని వివరించారు. మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రస్తావించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు

తన ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని ఆరోపించారు. పదేళ్లలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటి? 1000 రోజుల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటి? అనే అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం సవాల్ విసిరారు.** తెలంగాణకు సంబంధించిన అంశాలపై నమ్మకం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. ప్రతిపక్ష నేతగా విధులు నిర్వర్తించకపోతే ప్రజలకు జవాబుదారీతనం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కొత్త ఆస్పత్రులు, సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన

త్వరలో ఎల్‌బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు. అల్వాల్ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య, ఎల్‌బీ నగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్, వరంగల్ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను విస్తరించడంతో అడ్మిషన్లు పెరిగాయని చెప్పారు.