CPI Mega Rally: మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సీపీఐ.. రాజ్యాంగ సంస్థలు, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తుందని మండిపాటు..
What should the Communists do now?
CPI Mega Rally: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో సెప్టెంబర్ 1న జరగనున్న తమ ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు అవసరం) బహిరంగ సభకు ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ దేశ సమాఖ్య తత్వాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించింది.
న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం అజోయ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడారు. పెరిగిన నిరుద్యోగం, ఆందోళన కలిగిస్తున్న ధరల పెంపు, పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి, ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు బలహీనపడటం వంటి పలు తీవ్రమైన సమస్యలతో దేశం సతమతమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యలపై గళమెత్తుతున్న విద్యార్థులు, యువతపై ప్రభుత్వం సాగిస్తున్న దాష్టీకాన్ని డి. రాజా ఖండించారు. ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌లు మరియు నిర్బంధ చర్యలు ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులను శాంతిభద్రతల సమస్యగా చూడటం బీజేపీ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. హక్కుల కోసం పోరాడేవారికి ‘దిమాగీ నక్సల్స్’ అని ముద్ర వేయడాన్ని తప్పుబట్టారు. వామపక్షాల పాలనలోని కేరళ తరహాలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించకుండా, మోదీ ప్రభుత్వం పేదలకు ఉచిత విద్యను దూరం చేస్తోందని ధ్వజమెత్తారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రబ్బరు స్టాంపులా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజా ఆరోపించారు. వివాదాస్పద ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ విధానం మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలు దేశ సమాఖ్య సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఫిరాయింపులు, రాజకీయ కుట్రల ద్వారా వ్యతిరేక పార్టీలను బలహీనపర్చాలని చూస్తున్నారని, అయితే ఐక్యంగా ఉన్న ప్రతిపక్షం ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను అడ్డుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పంటలకు కనీస మద్దతు ధరకు (MSP) చట్టబద్ధత కల్పించాలని, అయోధ్య రామమందిర విరాళాలపై పారదర్శకత ఉండాలని మరియు అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
దేశానికి స్పష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని, పాలనా దిశలో మార్పును చూపడమే లక్ష్యంగా సెప్టెంబర్ 1న జరగనున్న ‘బద్లావ్ జరూరీ హై’ ర్యాలీలో విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారని స్పష్టం చేశారు.
- Badlaav Zaroori Hai Video: నేడే ఢిల్లీ రాం లీలా మైదానంలో సీపీఐ బద్లావ్ జరూరీ హై సభ…సర్వం సిద్ధం..అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న మోదీ సర్కార్ (Video)
- September 1st Changes: సెప్టెంబర్ 1వ తేదీని నుంచి వచ్చే ముఖ్యమైన మార్పులు ఇవే..LPG గ్యాస్ సిలిండర్ నుంచి కార్ల ధరల వరకూ
- CM Revanth Reddy: ముఖ్యమంత్రికి నిరాకరణను తెలంగాణ గడ్డ సహించదు
- Article On Make In India: ఓ వైపు ‘మేక్ ఇన్ ఇండియా’.. మరోవైపు ప్రభుత్వ రంగ ఉపసంహరణ!
- USA Visa Issue: అమెరికా తలుపులు మూసుకుంటున్నాయా?