Skip to content
తెలంగాణ వార్తలు

Suryapeta Online Marriage: ఆన్‌లైన్‌లో కూతురి పెళ్లి చూసి అక్షింతలు వేసిన తల్లిదండ్రులు: సూర్యాపేట జిల్లాలో ఘటన (Video)

Prajapaksham 30 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Suryapeta Online Marriage: ఆన్‌లైన్‌లో కూతురి పెళ్లి చూసి అక్షింతలు వేసిన తల్లిదండ్రులు: సూర్యాపేట జిల్లాలో ఘటన (Video)

Suryapeta Online Marriage

Suryapeta Online Marriage: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సరిహద్దులు దాటి బంధాలు ముడిపడుతుండగా, అంతే వినూత్నంగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. వేల మైళ్ల దూరంలో అమెరికాలో జరిగిన తమ ఏకైక కుమార్తె వివాహాన్ని తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి, అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.

ప్రేమ వివాహం.. డిజిటల్ ఆశీర్వాదం:
వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు ఉద్యోగ రీత్యా అమెరికాలో నివాసముంటోంది. అక్కడే ఆమెకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో, ఇరువైపులా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

శుక్రవారం రాత్రి అమెరికాలో హిమబిందు – రోహిత్ కుమార్‌ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికా వెళ్లలేకపోయారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆన్‌లైన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. స్వగ్రామం నుంచి డిజిటల్ స్క్రీన్‌పై ప్రత్యక్షంగా జరుగుతున్న పెళ్లి తంతును వీక్షించిన జయరాజు, జ్యోతి దంపతులు.. నూతన వధూవరులను ఆన్‌లైన్ ద్వారానే అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం తమ కుమార్తె పెళ్లికి గుర్తుగా గ్రామంలోని బంధుమిత్రులు, గ్రామస్థులకు ఘనంగా పెళ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ వినూత్న వివాహ వేడుక ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాగ్‌లు: viral video update