Skip to content
జాతీయం వార్తలు

సిద్ధాంతం గొప్పదే… ఆచరణలో మార్పు ఎప్పుడు?

Prajapaksham 25 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
సిద్ధాంతం గొప్పదే… ఆచరణలో మార్పు ఎప్పుడు?

What should the Communists do now?

మన్నారం నాగరాజు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు

కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యం దోపిడీ, అణచివేత, అసమానతలు లేని సమసమా జ నిర్మాణం. మనిషిని మనిషి దోచుకోని, ఒక వర్గం మరో వర్గాన్ని అణచివేయని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యం నిస్సందేహంగా గొప్పది. అయితే గొప్ప లక్ష్యం ఉండటం ఒక్కటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి సరైన కార్యక్రమం, స్పష్టమైన వ్యూహం, కాలానుగుణమైన ఎత్తుగడలు, ప్రజలతో నిరంతర సంబంధం అవసరం. లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా, దానికి చేరుకునే మార్గం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేకపోతే ఆ లక్ష్యం నినాదంగానే మిగిలిపోతుంది.
భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను పరిశీలిస్తే ఒక ముఖ్యమైన అంశం స్పష్టమవుతుంది. వివిధ కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు మధ్య సిద్ధాంతపరమైన భేదాలెన్ని ఉన్నప్పటికీ, సాయుధ పోరాటాలన్నీ రాజ్యస్వభావం, సాయుధ పోరాట మార్గం, చీలికలకు ప్రాతిపదికగా కనిపిస్తుంది.
ఎన్నికల్లో పాల్గొనే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల ను అంతిమ అధికార సాధన మార్గంగా భావించకపోవడం, ఎన్నికలను ఒక పరిమిత పోరాట రూపంగా మాత్రమే చూడటం వల్ల ఎన్నికల రాజకీయాలకు అవసరమైన ప్రాధాన్యత దక్కలేదు.
మరోవైపు, మావోయిస్టులు, కొన్ని నక్సలైట్‌ గ్రూపులు ఎన్నికలను పూర్తిగా వ్యతిరేకించాయి. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడమే కాకుండా, ఎన్నికల్లో పాల్గొనే ప్రజల ను, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న హింసాత్మక చర్యలకు కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.
ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్నను అడగాల్సిన సమయం వచ్చింది. భారతదేశంలోని ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలపై ప్రభావం చూపే ప్రధాన ప్రజాస్వామ్య పోరాట రూపం ఏది? ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని సాధించగల మార్గం ఏది? పాలకులను మార్చగల రాజ్యాంగబద్ధమైన మార్గం ఏది? ఈ ప్రశ్నలకు వాస్తవికంగా సమాధానం వెతికితే ఎన్నికల రాజకీయాలను నిర్లక్ష్యం చేయ డం సాధ్యం కాదు.
ఎన్నికలను ప్రధాన పోరాట రూపంగా గుర్తించడం అంటే విప్లవ లక్ష్యాలను వదులుకోవడం కాదు. ఎన్నికల్లో పాల్గొనడం అంటే పార్లమెంటరీ వ్యవస్థకు లొంగిపోవడం కూడా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందుబాటులో ఉన్న ఒక ముఖ్యమైన రాజకీయ వేదికను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం. ప్రజలను చైతన్యపరచడానికి, వారి సమస్యల ను రాజకీయ ప్రశ్నలుగా మార్చడానికి, పాలక విధానాలను బహిర్గతం చేయడానికి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించడానికి ఎన్నికలు ఒక ముఖ్యమైన సాధనం.
అయితే ఎన్నికలను ఒక పోరాట రూపంగా గుర్తించడం మాత్రమే సరిపోదు. ఎన్నికల్లో గెలవాలంటే దానికి తగిన రాజకీయ కార్యాచరణ ఉండాలి. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేయడం ద్వారా ఏ పార్టీ అయినా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టం. ఎన్నికలు పూర్తయ్యే రోజుతో ప్రజా సంబంధాలు ముగిసి, తదుపరి ఎన్నికల ముందు మళ్లీ ప్రారంభమయ్యే విధానం కమ్యూనిస్టు రాజకీయాలకు సరిపోదు.
ఎన్నికల్లో నిజమైన పోరాటాన్ని నిర్మించాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఏ నియోజకవర్గాలను లక్ష్యంగా ఎంచుకోవాలి? అక్కడి ప్రధాన సామాజిక వర్గాలు ఏవి? వారి జీవన సమస్యలు ఏమిటి? రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, చిన్న వ్యాపారు లు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ఏ ప్రాంతంలో పార్టీకి సామాజిక పునాది నిర్మించుకునే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు సిద్ధం చేసుకోవాలి.
అంతకంటే ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికను చివరి నిమి షం వ్యవహారంగా చూడకూడదు. ఎన్నికలు జరిగే కొద్ది నెలల ముందు ఒక వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి, అతడిని ప్రజలకు పరిచయం చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం సాధ్యం కాదు. అభ్యర్థి సంవత్సరాల తరబడి ప్రజల మధ్య పనిచేసే వ్యక్తిగా ఎదగాలి. ఒక నియోజకవర్గానికి ప్రత్యామ్నాయంగా ఇద్దరు ముగ్గురు నాయకులను ముందుగానే తయారు చేయాలి. వారిని ప్రజా సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించేలా తీర్చిదిద్దాలి. ప్రజలకు వారు కేవలం ఎన్నికల అభ్యర్థులుగా కాకుండా, తమ సమస్యల కోసం నిరంతరం పోరాడే ప్రతినిధులుగా కనిపించాలి.అదే విధంగా గ్రామం, వార్డు, బూత్‌ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం అవసరం. పోలింగ్‌ ఏజెంట్లు, బూత్‌ బాధ్యులు, ప్రచార బృందాలు, ప్రజా సంబంధాల కమిటీలు ముందుగానే ఏర్పడాలి. ప్రజలతో నిరంతర సంబంధం ఉండాలి. ఒక సమావేశం నుంచి మరో సమావేశం వరకు ఎంతమంది కొత్త కుటుంబాలతో సంబంధం ఏర్పడింది? ఎంతమంది కొత్త ఓటర్లు పార్టీ రాజకీయాలను అర్థం చేసుకున్నారు? ఎన్ని సమస్యలను ప్రజా పోరాటాలుగా మార్చగలిగాం? అనే ప్రశ్నలపై నిరంతర సమీక్ష జరగాలి. ఇది కేవలం ఎన్నికల నిర్వహణ కాదు, ప్రజా రాజకీయాల నిర్మాణం.
ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న ఒక మానసిక ధోరణి ని కూడా పునఃపరిశీలించాలి. ఎన్నికలను తక్కువ చేసి మాట్లాడటం, పార్లమెంటరీ రాజకీయాలను పూర్తిగా తృణీకరించడం, ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయడాన్ని సంస్కరణవాదంగా చూడటం వంటి ధోరణులు ప్రజలతో పార్టీకి ఏర్పడాల్సిన రాజకీయ సంబంధాన్ని బలహీనపరుస్తాయి. ప్రజల సమస్యలపై పోరాడటం ఎంత అవసరమో, ఆ సమస్యలకు పాలకుల విధానాలతో ఉన్న సంబంధాన్ని ప్రజలకు వివరించడం కూడా అంతే అవసరం.
ప్రజలు ఎందుకు పేదలుగానే మిగులుతున్నారు? రైతు లు ఎందుకు అప్పుల్లో కూరుకుపోతున్నారు? నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది? ప్రభుత్వ విద్య, వైద్యం ఎందుకు బలహీనపడుతున్నాయి? ప్రజా వనరులు ఎందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించబడుతున్నాయి? ఈ ప్రశ్నలకు పాలక విధానాలతో ఉన్న సంబంధాన్ని ప్రజలకు వివరించాలి. అంతేకాదు, తమ ఓటుకు తమ జీవితానికి ఉన్న సంబంధాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి.
ఒక ఓటు విలువను కేవలం ఎన్నికల రోజున ఇచ్చే డబ్బు లేదా తాత్కాలిక ప్రయోజనంతో కొలవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కొన్ని వందల రూపాయలు, వెయ్యి రూపాయలు లేదా తాత్కాలిక హామీ కోసం ఓటు వేస్తే, ఐదేళ్లపాటు తమ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని ప్రజలు ఇతరుల చేతుల్లో పెట్టినట్లవుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. బూర్జువా పార్టీలు ఈ చైతన్యాన్ని పెంచితే తమ ఎన్నికల ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని భావించవచ్చు. కానీ ప్రజా రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ విషయాన్ని బలంగా చెప్పకపోతే ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఒక కీలకమైన ఖాళీ ఏర్పడుతుంది.
ప్రజలకు సేవ చేయడం తప్పనిసరి. కానీ సేవ చేస్తున్నాం కాబట్టి ఓట్లు అడగం, మీరు ఓటు వేసినా వేయకపోయినా మేము మీ కోసం పనిచేస్తాం అనే సందేశం మాత్రమే ఇస్తే రాజకీయ ప్రతినిధిత్వం యొక్క అసలు అర్థం బలహీనపడుతుంది. ప్రజలకు సేవ చేయడంతో పాటు, మా విధానాలను సమర్థిస్తే, మా అభ్యర్థులను గెలిపిస్తే, మీ సమస్యలను శాసనసభలో, పార్లమెంటులో మీ తరఫున బలంగా వినిపిస్తాం అనే రాజకీయ సంబంధాన్ని కూడా నిర్మించాలి.
ఎన్నికలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు ప్రజాస్వామ్య స్థలాన్ని ఇతర రాజకీయ శక్తులకు వదిలిపెట్టినట్లవుతుంది. ప్రజలతో సంబంధం ఉన్నా, అధికారాన్ని ప్రభావితం చేసే రాజకీయ శక్తిగా ఎదగలేకపోతే ఆ సంబంధం పరిమితంగానే మిగిలిపోతుంది. ప్రజా సమస్యలపై పోరాటం, సంస్థాగత నిర్మాణం, రాజకీయ చైతన్యం, ఎన్నికల పోరాటం పరస్పరం అనుసంధానమైన ప్రక్రియలుగా చూడాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం తన పాత అంచనాలను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది. సాయుధ పోరాటం ఎప్పుడో ఒకరోజు వస్తుందనే ఊహతో ప్రస్తుత ప్రజాస్వామ్య అవకాశాలను నిర్లక్ష్యం చేయడం వాస్తవిక రాజకీయ మార్గం కాదు. సాయుధ పోరాటం కోసం ఎదురుచూస్తూ ఎన్నికలను నామమాత్రంగా చూడటం వల్ల ప్రజలలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించే అవకాశం కోల్పోతాం. అందుకే ప్రస్తు తం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల పోరాటాన్ని ఒక ప్రధాన ప్రజా పోరాట రూపంగా స్వీకరించి, దానికి తగిన దీర్ఘకాలిక కార్యాచరణను రూపొందించాలి.
ఇది ఎన్నికల భ్రమల్లో పడటం కాదు. అసలు ప్రశ్న ప్రజలను రాజకీయంగా చైతన్యపరచడానికి అందుబాటులో ఉన్న ప్రజాస్వామ్య మార్గాలను ఎంత సమర్థంగా వినియోగిస్తున్నామన్నదే. సాయుధ పోరాటమే ఏకైక మార్గమనే పాత అవగాహన నుంచి బయటనివారు ప్రజల మధ్య విస్తృతమైన ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని నిర్మించలేరు.
కమ్యూనిస్టుల లక్ష్యం సమసమాజమే అయితే, ఆ సమసమాజ లక్ష్యానికి ప్రజలను ఎలా సమీకరించాలి, ఎలా చైతన్యపరచాలి, ఎలా రాజకీయ శక్తిగా మార్చాలి అన్నదే కీలకం. అందుకు ప్రజల మధ్య నిరంతర పని, స్పష్టమైన రాజకీయ కార్యక్రమం, బలమైన సంస్థాగత నిర్మాణం, ఎన్నికల
పోరాటంపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.
నేటి పరిస్థితుల్లో ప్రజల తీర్పును ప్రజా మార్పు కోసం ఉపయోగించుకోవడం నుంచి వెనుకడుగు వేయడం విప్లవాత్మకత కాదు. ప్రజల ప్రజాస్వా మ్య ఆకాంక్షలను అర్థం చేసుకుని, వాటిని సమాజ మార్పు కోసం సంఘటితం చేయడమే అసలు రాజకీయ సవాలు.

ట్యాగ్‌లు: CPI CPI leaders CPI news