Skip to content
జాతీయం వార్తలు

Sonia Gandhi Memoir: నీ జీవితం ఎంత కష్టమో మాకు మాత్రమే తెలుసు.. తల్లి జీవితంపై రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్..

Prajapaksham 20 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Sonia Gandhi Memoir: నీ జీవితం ఎంత కష్టమో మాకు మాత్రమే తెలుసు.. తల్లి జీవితంపై రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్..

Rahul and Sonia Gandhi

Sonia Gandhi Memoir: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ (Sonia Gandhi) తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అనుభవాలతో ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పేరుతో రాసిన ఆత్మకథ నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పుస్తక ముఖచిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగ వ్యాఖ్యలను పంచుకున్నారు.

తల్లి ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 35 ఏళ్ల క్రితం తమ తండ్రి రాజీవ్ గాంధీ దూరమైనప్పటి నుండి తమ తల్లి సోనియా గాంధీ జీవితంలో ఎదురైన ప్రతి సవాలునూ ఎంతో ధైర్యంతో, హుందాగా ఎదుర్కొన్నారని తెలిపారు. నాన్న దూరమైన తర్వాత అమ్మ పడిన కష్టాలు, ఎదుర్కొన్న తీవ్రమైన పరిస్థితులు కేవలం నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు” అని అన్నారు.

ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచే సోనియా గాంధీ.. తొలిసారిగా తన జీవిత కథను పుస్తకం ద్వారా ప్రపంచానికి చెప్పేందుకు ముందుకు రావడం ఎంతో గర్వంగా ఉందన్న రాహుల్, నేడు స్వర్గం నుంచి తన తండ్రి రాజీవ్ గాంధీ గర్వంగా, చిరునవ్వుతో ఆమెను చూస్తుంటారని పేర్కొన్నారు.మరోవైపు ప్రియాంక గాంధీ స్పందిస్తూ, తమ తల్లిదండ్రుల ప్రేమ బంధం ఈ కాలపు అత్యుత్తమ ప్రేమకథలలో ఒకటని అభివర్ణించారు.

మా అమ్మ ఎంతటి కరుణార్ద్ర హృదయం కలిగిన మహిళో.. అవసరమైన సమయాల్లో అంతటి ధీరవనితగా నిలబడ్డారని కొనియాడారు. ఇప్పటివరకు సోనియా గాంధీని ఒక రాజకీయ నాయకురాలిగానే చూసిన ప్రపంచానికి.. ఈ పుస్తకం ద్వారా ఆమె వ్యక్తిత్వంలోని నైతికత, నిజాయితీ, కుటుంబం, దేశం పట్ల ఆమెకున్న అపరిమితమైన ప్రేమ అవగతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 544 పేజీలు కలిగిన ఈ పుస్తకాన్ని ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ (Alfred A. Knopf) ప్రచురణ సంస్థ వేదికగా విడుదల చేయనున్నారు.