Skip to content
బిజినెస్ వార్తలు

AI కోసం భారీ ఖర్చు.. ఒక్కో ఉద్యోగిపై రూ.7 లక్షలు వెచ్చిస్తున్న టాప్ కంపెనీలు..

Prajapaksham 17 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
AI కోసం భారీ ఖర్చు.. ఒక్కో ఉద్యోగిపై రూ.7 లక్షలు వెచ్చిస్తున్న టాప్ కంపెనీలు..

Top Companies Spend Rs 7 Lakh Per Employee on AI as Corporate Adoption Surges

ప్రస్తుత ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉత్పత్తుల తయారీ నుండి కస్టమర్ సేవలు, కోడింగ్, కంటెంట్ సృష్టి వరకు ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం అనివార్యంగా మారింది. దాదాపు ప్రతి చిన్న, పెద్ద సంస్థ తమ ఉద్యోగులను ఏఐ సాధనాలను ఉపయోగించేలా ప్రోత్సహిస్తోంది. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానం కంపెనీల పనితీరును మెరుగుపరుస్తున్నప్పటికీ.. మరోవైపు వాటి ఖర్చుల భారం ఆకాశాన్ని తాకుతోందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ ‘రాంప్ (Ramp)’ విడుదల చేసిన ‘ఏఐ ఇండెక్స్’ నివేదిక ప్రకారం, ప్రముఖ టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల ఏఐ వినియోగం కోసం భారీ మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి.

రాంప్ నివేదిక ప్రకారం.. అమెరికాలోని అగ్రశ్రేణి 1 శాతం కంపెనీలు గత నెలలో తమ వద్ద పనిచేసే ఒక్కో ఉద్యోగికి ఏఐ సాధనాల (AI Tools) కోసం సగటున $7,400 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 7 లక్షలు) వరకు ఖర్చు చేశాయి. ఈ వ్యయం ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా పెరగడం గమనార్హం. ఇదే ఏడాదినె ప్రారంభంలో, అంటే జనవరి మాసంలో ఈ అగ్రశ్రేణి 1 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగికి $2,590 (సుమారు రూ. 2.47 లక్షలు) మాత్రమే వెచ్చించగా, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఆ ఖర్చు మూడు రెట్లకు పైగా పెరిగింది.

ఈ వ్యయాల భారీ పెంపునకు ప్రధాన కారణం ఏఐ అభివృద్ధి సంస్థలు అమలు చేస్తున్న ధ‌రల విధానమే. ఓపెన్‌ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic) వంటి ప్రముఖ ఏఐ ల్యాబ్‌లు ‘పర్-టోకెన్’ (Per-token) ఆధారిత బిల్లింగ్ మోడల్‌కు మారాయి. ఈ విధానంలో యూజర్లు ఏఐ సాధనాల ద్వారా ఎంత ఎక్కువగా సమాచారాన్ని ప్రాసెస్ చేస్తే లేదా ప్రశ్నిస్తే, అంత ఎక్కువగా టోకెన్లు వినియోగమవుతాయి. ఉద్యోగులు రోజువారీ పనుల్లో ఏఐతో ఎక్కువగా సంభాషించడం వల్ల కంపెనీల బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

పెరుగుతున్న అంతరాలు – పరిమితులు విధిస్తున్న కార్పొరేట్ దిగ్గజాలు: నివేదిక ప్రకారం ఏఐపై పెట్టుబడులు పెట్టే కంపెనీల విధానాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. భారీగా ఖర్చు చేసే సంస్థలకు.. చాలా తక్కువగా వాడే సంస్థలకు మధ్య అంతరం స్పష్టంగా పెరుగుతోంది.

అగ్రశ్రేణి 1% కంపెనీలు: ఒక్కో ఉద్యోగిపై సంవత్సరానికి $7,400 (సుమారు రూ. 7 లక్షలు) ఖర్చు చేస్తున్నాయి.
అగ్రశ్రేణి 10% కంపెనీలు: ఒక్కో ఉద్యోగిపై $650 (సుమారు రూ. 62,000) వెచ్చిస్తున్నాయి.
మధ్యస్థ (సగటు) కంపెనీలు: ఉద్యోగికి కేవలం $11.95 (సుమారు రూ. 1,140) మాత్రమే ఖర్చు చేస్తున్నాయి.

పెరుగుతున్న ఈ భారంతో అప్రమత్తమైన ఉబెర్, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి బహుళజాతి దిగ్గజాలు తమ ఉద్యోగుల ఏఐ టోకెన్ వినియోగంపై కఠినమైన పరిమితులు (Caps) విధించడం ప్రారంభించాయి. ఆరంభంలో ఊహించిన దానికంటే బడ్జెట్‌లు దాటిపోతుండటంతో టెక్ పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ గతంలో స్పందిస్తూ, “కంపెనీల వార్షిక బడ్జెట్ మొత్తం మొదటి త్రైమాసికంలోనే ఖర్చయిపోతోందని, దీన్ని మరింత సమర్థవంతంగా చేయగలరా అని కంపెనీలు మమ్మల్ని కోరడం సాధారణమైపోయింది” అని వ్యాఖ్యానించారు. ఎన్విడియా (Nvidia) ఎగ్జిక్యూటివ్ బ్రయాన్ కాటన్జారో కూడా తమ బృందానికి ఉద్యోగుల వేతనాల కంటే కంప్యూటింగ్ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొనడం తీవ్రతను తెలియజేస్తోంది.

మార్కెట్ పోటీ – ఓపెన్ సోర్స్ వైపు అడుగులు:

కార్పొరేట్ వ్యాపారాలలో ఏఐ వినియోగానికి సంబంధించి ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ 43.5 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలవగా, ఓపెన్‌ఏఐ 39.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ ఏఐ (xAI) 4 శాతం వాటాను కలిగి ఉంది. కాగా, భారీ బిల్లుల భారాన్ని తట్టుకోలేక పలు సంస్థలు చౌకగా లభించే ఓపెన్-సోర్స్ (Open-source) మోడల్స్ మరియు కొన్ని చైనీస్ ఏఐ మోడల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. జూలై నాటికి ఈ ఓపెన్-సోర్స్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 6.1 శాతానికి పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో ఏఐపై చేసే ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు ఓపెన్-సోర్స్ సాధనాలను తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.