Skip to content
వినోదం వార్తలు

స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో ఆస్పత్రి పాలైన నటి షకీలా.. గంటల తరబడి రీల్స్‌తో మెడకు సర్జరీ, నెటిజన్లకు హెచ్చరిక..

Prajapaksham 13 Aug 2026 0 నిమిషాల పఠనం వినోదం
స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో ఆస్పత్రి పాలైన నటి షకీలా.. గంటల తరబడి రీల్స్‌తో మెడకు సర్జరీ, నెటిజన్లకు హెచ్చరిక..

Actress Shakeela Undergoes Neck Surgery

గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోవడం ఎంతటి ప్రమాదకరమో చెప్పడానికి సీనియర్ నటి షకీలాకు ఎదురైన చేదు అనుభవమే నిదర్శనంగా నిలుస్తోంది. అతిగా ఫోన్ వాడే దురలవాటు కారణంగా తీవ్రమైన నరాల సమస్య బారిన పడిన ఆమె.. ఇటీవల మెడకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కీలక హెచ్చరిక చేశారు.

గత కొంతకాలంగా తాను మంచంపై తప్పుడు భంగిమలో పడుకుని గంటల తరబడి రీల్స్ చూడటం, ఫోన్ గేమ్స్ ఆడటమే పనిగా పెట్టుకున్నానని షకీలా తెలిపారు. కేవలం టీ, కాఫీ తాగేందుకు మాత్రమే విరామం తీసుకుంటూ సమయమంతా ఫోన్‌తోనే గడపడంతో మెడలోని ప్రధాన నరాలపై తీవ్ర ఒత్తిడి పడిందని వివరించారు. చివరికి ఈ అలవాటే తనను ఆపరేషన్ టేబుల్ వరకు తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేజర్ సర్జరీ కోసం సుమారు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని, భరించలేని శారీరక నరకాన్ని అనుభవించానని షకీలా కన్నీటిపర్యంతమయ్యారు. “ప్రస్తుతం కనీసం మంచం దిగాలన్నా, ఆహారం తినాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిన దీనస్థితిలో ఉన్నాను. నా పరిస్థితి చూసి అందరూ గుణపాఠం నేర్చుకోవాలి. దయచేసి ఎవరూ ఫోన్‌ను అతిగా వాడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు, స్క్రీన్ టైమ్ తగ్గించుకోండి” అని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచాలని, లేదంటే భవిష్యత్తులో చిన్న వయస్సులోనే తీవ్రమైన నరాల, వెన్నుముక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.