Skip to content
ప్రపంచం వార్తలు

అమెరికాతో చర్చలు జరగడం లేదు: తేల్చి చెప్పిన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాఘ్చీ

Prajapaksham 10 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
అమెరికాతో చర్చలు జరగడం లేదు: తేల్చి చెప్పిన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాఘ్చీ

మధ్యవర్తులతో సందేశాల మార్పిడి చర్చలు కాదు

ఇరాన్-ఒమన్ సారథ్యంలో కొత్త జలమార్గాల ఏర్పాటు

అమెరికాతో ఇరాన్ ప్రస్తుతం ఎలాంటి చర్చలు ఏ స్థాయిలోనూ జరపడంలేదని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్యా బహిరంగంగా మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ, అంతర్గతంగా తెర వెనుక సంభాషణలు కొనసాగుతున్నాయన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్యా సందేశాల మార్పిడి జరుగుతోందని, కానీ ఈ ప్రక్రియను చర్చలు అని పిలవకూడదని అన్నారు. శత్రుపక్షం (అమెరికా) ‘ఇస్లామాబాద్ ఒప్పందాన్ని’ ఉల్లంఘించడం ముగించే వరకూ, ఇప్పటివరకూ చేసిన ఉల్లంఘనలకు పరిహారం చెల్లించేవరకూ చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఇరాన్ కొత్త షరతులు విధించిందని, ఈ షరతులను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తెలియజేశామన్నారు.

ప్రస్తుతం ఎలాంటి చర్చలూ జరగడంలేదని అరాఘ్చీ ఆదివారం మొహర్రం అషూరా కార్యక్రమం సందర్భంగా పాత్రికేయులకు చెప్పారు. చేసుకున్న ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండకుండా ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శించారు. కట్టుబాట్లను వదిలిపెట్టి అమెరికా ఇష్టానుసారంగా వ్యవహరించినంతకాలం ఈ దేశంలో ఎలాంటి చర్చలకు అవకాశం లేదని చెప్పారు. అమెరికా తక్షణం ఒప్పంద కట్టుబాట్ల ఉల్లంఘన చర్యలు నిలిపివేయాలని, యుద్ధంవల్ల ఇరాన్‌కు కలిగిన తీవ్ర నష్టానికిగాను పరిహారం చెల్లించాలని, అప్పటివరకూ చర్చలు ఉండబోవన్నారు.

ఐతే, రెండు దేశాలను ఒకచోటకు చేర్చి చర్చలు జరిపేలా చూసేందుకు మధ్యవర్తి దేశాలు ఇప్పటికీ తమవంతు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇరాన్‌పై అమెరికా అక్రమంగా రుద్దిన యుద్ధం ముగించేందుకు ఇరు పక్షాల అంగీకారంతో జూన్ 18వ తేదీన 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం “ఇస్లామాబాద్ ఒప్పందం” కుదిరింది. ఆ తర్వాత హోర్ముజ్ జలసంధి జలమార్గాల విషయంలో తగాదా ప్రారంభం కావడంతో ఒప్పందాన్ని రద్దుచేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ట్రంప్ అనేకసార్లు ఉల్లంఘించారు.

కాగా, హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఒమన్‌తో చర్చలు పురోగతిలో ఉన్నాయని, ఈ మేరకు కొత్త జలమార్గాలు ఏర్పాటు చేస్తామని, నౌకలు వెళ్లేందుకు, వచ్చేందుకు ఇరు దేశాల ప్రాదేశిక జలాల నుండి ఈ మార్గాలు ఉంటాయని, ఈ కొత్త పటాలపై కసరత్తు జరుగుతోందని అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఐతే, ఈ ఒప్పందానికి చేరువకావడమంటే జలసంధిని తెరుస్తున్నట్లు అర్థం కాదని, ఇతర షరతులను కూడా నెరవేర్చడంపైనే జలసంధి తెరుచుకోవడం ఆధారపడి ఉంటుందని చెప్పారు.

మాది మానవత్వ దౌత్యం

ఇరాన్ చేస్తున్నది మానవత్వ దౌత్యమని అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. అన్యాయం, అమానుషత్వం అనే తుఫానుకు వ్యతిరేకంగా ఇరాన్ దృఢంగా నిలబడిందని, ఇదే మార్గంలో త్యాగాలతో ముందుకు సాగుతుందన్నారు. స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సైద్ధాంతిక, వ్యూహాత్మక అవగాహనతో ఇరాన్ అన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నదన్నారు. ఇస్లామిక్ విప్లవోద్యమ నాయకుడు ఆయతోల్లా అలీ ఖమేనీకి ఇచ్చిన వాగ్దానానికి తాము కట్టుబడి పనిచేస్తున్నామన్నారు.

అన్యాయంగా మేం రక్తాన్ని చిందించాం, దీనిని మరచిపోలేం, న్యాయం కోసం పోరాడే వృక్షం భూమిలో మరింత బలంగా నాటుకుపోతుందని విస్మరించకూడదన్నారు. ఇరాన్ సంకుచిత అవకాశవాది కాదని, తమ దేశం చేస్తున్నది మానవత్వ దౌత్యమని అన్నారు.