Skip to content
తెలంగాణ వార్తలు

Prakash Raj: ద్రవిడ భావన ద్వేషానికి కాదు.. ‘ద్రవిడ-వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రకాష్ రాజ్

Prajapaksham 09 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Prakash Raj: ద్రవిడ భావన ద్వేషానికి కాదు.. ‘ద్రవిడ-వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రకాష్ రాజ్

ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదని, అది దక్షిణాది భాషలు, సంస్కృతి, చరిత్ర, స్వాభిమానాన్ని గౌరవించుకోవడమేనని ప్రముఖ నటుడు, రచయిత ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. భారతీయుడిగా గర్విస్తూనే దక్షిణాది ప్రత్యేకతను, అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చని ఆయన అన్నారు.

కె.ఎన్. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న ‘ద్రవిడ-వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో (దొడ్డి కొమురయ్య హాల్) శనివారం సాయంత్రం జరిగింది. ప్రగతిశీల రచయిత్రుల వేదిక (ప్రరవే), మలుపు బుక్స్ సంయుక్త ప్రచురణగా వెలువడిన ఈ గ్రంథాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్ రాజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, భారతదేశ బలం ఏకరూపతలో కాకుండా వైవిధ్యంలో ఉందన్నారు. ఒకే భాషను, ఒకే సంస్కృతిని దేశమంతటా బలవంతంగా రుద్దడం సరికాదని, అన్ని భాషలకు, సంస్కృతులకు సమాన గౌరవం లభించాలని ఆయన డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం రాకుండా చూడాలని ఆయన సూచించారు. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమని, వాటి ప్రయోజనాలను విస్మరిస్తే ఊరుకునేది లేదని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.

వైవిధ్యమే భారతీయత: ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ‘దక్షిణ స్వరం’ పుస్తకం భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతితో పాటు సమకాలీన రాజకీయ అంశాలను సమగ్రంగా చర్చిస్తుందన్నారు.

భాషను మతంతో ముడిపెట్టడం సరికాదని, భారతీయత అంటే ఏకరూపత కాదని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ప్రరవే అధ్యక్షురాలు తిరునగరి దేవకీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంపాదకులు కె.ఎన్. మల్లీశ్వరి సంపాదకీయ భావాలను పంచుకోగా, గుంపెనపల్లి సుష్మ పుస్తక సమీక్ష చేశారు. ప్రచురణకర్త మలుపు బాల్ రెడ్డి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రచయితలు, విశ్లేషకులు కాత్యాయనీ విద్మహే, మృణాళిని, ఎన్. వేణుగోపాల్, కె. శ్రీనివాస్, జిలుకర శ్రీనివాస్, సౌదా, కల్లూరి భాస్కరం తదితరులతో ముఖాముఖి నిర్వహించారు. కళ్యాణి కుంజ, కనీజ్ ఫాతిమా, అరుణ గంధం, శాంతి ప్రబోధ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు.