UPI చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి.. స్పష్టం చేసిన పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
UPI
దేశవ్యాప్తంగా కోట్ల మంది రోజువారీ డిజిటల్ లావాదేవీలకు ఆధారమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై ఛార్జీలు విధించనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి పాయింట్ ఆఫ్ సేల్, డిజిటల్ చెల్లింపుల సమాఖ్య పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (PCI) తెరదించింది. సాధారణ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని.. అలాగే చిన్న వ్యాపారుల నుంచి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయబోమని పీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
2016లో ప్రవేశపెట్టినప్పటి నుంచి యూపీఐ సేవలు ప్రజలకు ఎటువంటి రుసుములు లేకుండా ఉచితంగానే అందుబాటులో ఉన్నాయని పీసీఐ గుర్తుచేసింది. భవిష్యత్తులోనూ సాధారణ వినియోగదారుల లావాదేవీలపై ఛార్జీలు విధించే ఆలోచన లేదా ప్రతిపాదన ఏదీ లేదని తేల్చిచెప్పింది. భారతీయ పౌరులందరూ ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా తక్షణమే డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని భరోసా ఇచ్చింది.
అదేవిధంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో చిన్న వ్యాపారులు సైతం యూపీఐ ద్వారా కస్టమర్ల నుంచి డబ్బులు స్వీకరించేందుకు ఎలాంటి పన్నులు లేదా ఎండీఆర్ (MDR) రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ వివరించింది.
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవస్థ సుస్థిరత, నిర్వహణ వ్యయాలపై గత కొంతకాలంగా ఆర్థిక వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. డిజిటల్ చెల్లింపుల్లో సర్వర్ల సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం, సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేయడం, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టడం వంటి విధులకు భారీగా నిధులు అవసరమవుతున్నాయి.
ఈ మౌలిక వసతుల వ్యయాన్ని భర్తీ చేసేందుకు యూపీఐ లావాదేవీలపై స్వల్ప ఛార్జీలు విధించే ప్రతిపాదన రావచ్చునంటూ వ్యాపార, నిరుద్యోగ రంగాలు, సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేశాయి. ఈ వార్తలతో వ్యక్తమవుతున్న సందేహాలను పటాపంచలు చేస్తూ పీసీఐ ఈ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు సంయుక్తంగా కృషి చేసి ఈ డిజిటల్ విప్లవాన్ని సాకారం చేశాయని పీసీఐ తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరగడానికి యూపీఐ ఉచిత సేవల విధానమే ప్రధాన కారణమని తెలిపింది. భవిష్యత్తులో చట్టపరమైన మార్పులు లేదా విధానపరమైన నిర్ణయాలు జరిగినప్పటికీ.. ప్రస్తుతానికి సామాన్య వినియోగదారులు, చిన్న వ్యాపారులపై ఎటువంటి ఆర్థిక భారం పడదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమైంది.
- Hyderabad Heavy Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచన..
- HYDRAA Driver Jobs: తెలంగాణలో ఇంతమంది నిరుద్యోగులా.. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల కోసం తరలివచ్చిన వేలాది మంది..
- UPI చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి.. స్పష్టం చేసిన పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
- తెలంగాణ ఖజానా ఖాళీ.. ఉచిత పథకాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన.. కోటీశ్వరులకు రైతుబంధు ఇవ్వడంపై నిలదీత..
- మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు దిశగా సర్కారు యోచన ..