లఖింపూర్ హింసాకాండ కేసులో.. ఆశిష్ మిశ్రా బెయిల్ షరతుల సడలింపునకు ‘సుప్రీం’ నో
లఖింపూర్ హింసాకాండ కేసులో.. ఆశిష్ మిశ్రా బెయిల్ షరతుల సడలింపునకు 'సుప్రీం' నో
లఖింపూర్ ఖేరీ హింసాకాండ (2021) కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ షరతులను మరింత సడలించడానికి గురువారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జోయా మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, తన బెయిల్ షరతులను సడలించాలని, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తన స్వగ్రామానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆశిష్ మిశ్రా దాఖలు చేసిన దరఖాస్తును సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.
ప్రస్తుతం ఉన్న ఆంక్షల కారణంగా ఆశిష్ మిశ్రా తన కుమార్తెల పుట్టినరోజు వేడుకలు సహా కుటుంబ కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నారని మిశ్రా తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ, ఈ దశలో మిశ్రా అభ్యర్థనను స్వీకరించడానికి ఎటువంటి ఆధారమూ లేదని చెబుతూ దరఖాస్తును కొట్టివేస్తున్నామని సీజేఐ పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా బాధిత రైతుల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. విచారణ జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ అతివేగంగా, తొందరపాటుతో జరుగుతున్నందువల్ల ప్రత్యక్ష సాక్షులతో సహా పలువురు కీలక సాక్షులను కూడా తొలగిస్తున్నారని ప్రశాంత్ భూషణ్ వాదించారు.
ఈ ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఒక దరఖాస్తును దాఖలు చేయనున్నట్లు బెంచ్‌కు తెలిపారు. స్పందించిన సీజేఐ, అటువంటి ఫిర్యాదులను తొలుత ట్రయల్ కోర్టులోనే లేవనెత్తాలని అన్నారు.
“ఈ అభ్యర్థనను స్వీకరించడానికి మేం ప్రధాన వేదిక ఎందుకు అవుతాం? మీరు ముందుగా ట్రయల్ కోర్టునే ఆశ్రయించి, వీరే కీలక సాక్షులని తెలియజేయాలి” అని ధర్మాసనం ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేసింది.
సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిపై ఛార్జిషీట్ దాఖలైన మరో కేసులోని కొన్ని డాక్యుమెంట్లను అనువదించి, వాటిని పరిశీలిస్తున్నారని రైతుల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి తెలిపారు. ఆ వ్యక్తి ఆశిష్ మిశ్రా మద్దతుదారుడన్న వాదనను ఆశిష్ మిశ్రా తరఫు న్యాయవాది వ్యతిరేకించారు.
2021 అక్టోబర్ 3న ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యా ఆ ప్రాంత పర్యటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన సందర్భంగా నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే.
2023 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు ఆశిష్ మిశ్రా సహా 12 మంది ఇతరులపై హత్య, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలతో సహా పలు అభియోగాలను నమోదు చేసింది.