Rahul Gandhi: బీజేపీ సర్కార్ నన్ను అడ్డుకోలేదు..’ఛాత్రోన్ కీ గూంజ్’ అనుమతి రద్దుపై రాహుల్ మండిపాటు
Rahul Gandhi: బీజేపీ సర్కార్ నన్ను అడ్డుకోలేదు..'ఛాత్రోన్ కీ గూంజ్' అనుమతి రద్దుపై రాహుల్ మండిపాటు
ప్రయాగ్‌రాజ్‌లో తన ‘ఛాత్రోన్ కీ గూంజ్’కు అనుమతి రద్దుపై రాహుల్ గాంధీ మండిపాటు
విద్యార్థుల సమస్యలు వినడానికి బదులు వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తారా? అని నిలదీత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమానికి నిర్వాహకులు అనుమతిని రద్దు చేయడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా విద్యార్థుల గళాన్ని వినిపించకుండా తనను అడ్డుకోలేదన్నారు.
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి, ఈ నెల 8న ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో జరగాల్సిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమానికి కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని రద్దు చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమ స్థలంలో నీరు నిలిచిపోవడాన్ని కూడా రద్దుకు కారణంగా ట్రస్ట్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఫీజుల పెంపు, సీట్ల తగ్గింపునకు వ్యతిరేకంగా తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కానీ విద్యార్థుల మాట వినడానికి బదులుగా యంత్రాంగం వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోందని ఆరోపించారు.
యువత గళాన్ని అణచివేయడమే మోదీ ప్రభుత్వ విధానమని ధ్వజమెత్తారు. ప్రశ్న అడిగితే లాఠీచార్జ్, నిరసన తెలిపితే కేసులు, గళం విప్పితే పెల్లెట్ గన్ల దాడి ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
‘విద్యార్థుల సమస్యలను వినడానికి ప్రయాగ్‌రాజ్‌కు రావాలని నేను నిర్ణయించుకున్నప్పటి నుంచి, నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని గాంధీ చెప్పారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమానికి కూడా వారు భయపడుతున్నారని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
‘నేను విద్యార్థులకు అండగా ఉంటాను. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, వారి గళాన్ని వినిపించకుండా నన్ను అడ్డుకోలేదు’ అని స్పష్టం చేశారు.
కాయస్థ పాఠశాల ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి పీటీఐతో మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేపీ కాలేజీ మైదానాన్ని క్రీడలు, విద్యాపరమైన కార్యకలాపాలకు తప్ప ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 14, 2025 నాటి ఉత్తర్వుల్లో ఆదేశించిందని చౌదరి తెలిపారు.
వర్షం కారణంగా మైదానంలో నీరు నిలిచిపోయిందని, బహిరంగ కార్యక్రమానికి అది సురక్షితం కాదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన అనుమతి జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదానికి లోబడి ఉంటుందని చౌదరి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పేపర్ లీకేజీలు, విద్యార్థులను ప్రభావితం చేసే ఇతర అంశాలపై విద్యార్థులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత సంభాషించాల్సి ఉంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ బుధవారం ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. కేపీ ట్రస్ట్ సభకు అనుమతిని రద్దు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ ఈ నెల 8న ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి విద్యార్థులతో సంభాషిస్తారని రాయ్ స్పష్టం చేశారు.