Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Rainy Season Health Alert: వానాకాలంలో ఆఫీసుకు వెళ్లేవారికి అలర్ట్.. ఈ ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లతో జాగ్రత్త..

Prajapaksham 06 Aug 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Rainy Season Health Alert: వానాకాలంలో ఆఫీసుకు వెళ్లేవారికి అలర్ట్.. ఈ ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లతో జాగ్రత్త..

Infections

వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్య లో ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు వైరల్ జ్వరం, డెంగ్యూ, చికున్‌గున్యా, లెప్టోస్పిరోసిస్, టైఫాయిడ్, ఫుడ్ పాయిజనింగ్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు-ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Rainy Season Health Alert: వర్షాకాలంలో కార్యాలయాల్లో (ఆఫీసుల్లో) పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూసివున్న ప్రదేశాల్లో ఎక్కువ మంది గడపడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం, తేమ వాతావరణం, తడి దుస్తులు, బూట్లు వంటి కారణాల వల్ల ఆఫీసుల్లో ఇన్ఫెక్షన్లు అత్యంత వేగంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్‌లో ఉద్యోగులను వేధించే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ మార్గాలను నిపుణులు వివరించారు.

ఆఫీసుల్లో వేగంగా వ్యాపించే 8 ఇన్ఫెక్షన్లు:

  1. ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ): మీటింగ్ రూమ్‌లు, ఎలివేటర్లు (లిఫ్ట్‌లు) వంటి గాలి తక్కువగా ఉండే ప్రాంతాల్లో తుమ్మడం, దగ్గడం వల్ల వ్యాపిస్తుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తీవ్ర నీరసం దీని లక్షణాలు.
  2. కోవిడ్-19: సీజనల్‌గా శ్వాసకోశ సమస్యలతో ఫ్లూ మాదిరిగానే వ్యాపిస్తోంది.
  3. వైరల్ కండ్లకలక (పింక్ ఐ): ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి తాకిన వస్తువులను తాకి, ఆపై చేతులతో కళ్లను నలపడం వల్ల కళ్లు ఎర్రబడటం, నీరు కారడం మరియు దురద వస్తాయి.
  4. వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్: ప్యాంట్రీలలో కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తాయి.
  5. సాధారణ జలుబు: గాలిలోని తుంపర్ల ద్వారా, ప్రత్యక్ష స్పర్శ ద్వారా అత్యంత వేగంగా సోకే సమస్య.
  6. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు: ఆఫీసుల్లో తడి బూట్లు, సాక్సులు వేసుకోవడం వల్ల చర్మంపై దురద, తామర వంటివి ఉత్పన్నమవుతాయి.
  7. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్: పెద్దలలో కూడా అరుదుగా వస్తుంది. నోటిలో పుండ్లు, చేతులు-పాదాలపై దద్దుర్లు, జ్వరం దీని ప్రధాన సంకేతాలు.
  8. లెప్టోస్పిరోసిస్: కలుషిత వర్షపు నీటిలో నడవడం ద్వారా సోకుతుంది. జంతువుల మూత్రంతో కలుషితమైన నీటి వల్ల తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, కామెర్లు వస్తాయి.

ముప్పు పెంచుతున్న అలవాట్లు & ఆందోళనకర గణాంకాలు: భారతదేశంలో ‘ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్’ (IDSP) సమాచారం ప్రకారం 2021 నుండి 2025 మధ్య నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు 1.7 కోట్లకు (17 మిలియన్లు) పైగా నమోదయ్యాయి. ఆఫీసు డెస్క్‌ల వద్దే కూర్చుని భోజనం చేయడం, ఇతరుల వస్తువులను వాడటం, అస్వస్థతగా ఉన్నప్పటికీ ఆఫీసుకు రావడం వంటి అలవాట్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.

తీసుకోవాల్సిన నివారణ చర్యలు:

చేతుల పరిశుభ్రత: తరచూ సబ్బుతో చేతులు కడగడం లేదా హ్యాండ్ శానిటైజర్ వాడాలి.
డెస్క్ శానిటైజేషన్: కంప్యూటర్, కీబోర్డ్, మౌస్, ఫోన్ వంటి పరికరాలను రోజూ శుభ్రం చేసుకోవాలి.
సిక్ లీవ్: జ్వరం లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు ఆఫీసుకు రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం.
వ్యక్తిగత వస్తువులు: ఇతరుల కర్చీఫ్‌లు, బాటిళ్లు, వ్యక్తిగత వస్తువులు వాడకూడదు.
తడి సాక్సులు/బూట్లు: ఆఫీసుకు రాగానే తడిసిన బూట్లు, సాక్సులను మార్చుకోవాలి.
వ్యాక్సినేషన్: ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ సీజన్ వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చు.