నాటుడే కానీ సంరక్షణేది…?…నాడు హరితహారం….నేడు వన మహోత్సవం… మొక్కల పెంపకం పేరిట కోట్లు వృథా
Haritha haram
ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే ప్రభుత్వ హడావుడి మొదలవుతుంది. ప్రతి ఏటా జూన్, జులై మాసాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, మొక్కలు నాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తుంది. గత ప్రభుత్వం హరితహారం పథకం ద్వారా మొక్కలు నాటిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవాల పేరిట మొక్కలు నాటిస్తోంది. కానీ ఈ మొక్కలు నాటే కార్యక్రమం అపహాస్యంగా మారుతోంది.
గత ప్రభుత్వంలో హరితహారం ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 10 నుంచి 14.34 కోట్ల మొక్కలు నాటినట్లు సమాచారం. ఈ ప్రభుత్వం కూడా వన మహోత్సవాల పేరిట ఈ ఏడాది 31.30 లక్షల మొక్కలు నాటాలని అధికారులకు లక్ష్యాన్ని విధించింది. మొక్కలు నాటే క్రమంలోనే అపశృతి మొదలవుతోంది. మొక్కలు వచ్చాయి కాబట్టి ఎక్కడో ఒక చోట నాటించే పని కొందరు చేస్తుండగా, మరికొందరి నిర్లక్ష్యం కారణంగా వేలాది మొక్కలు నర్సరీలోనే ఎండిపోతున్నాయి.
ప్రభుత్వం ఒక్కో మొక్కను దాని రకం, వయస్సును బట్టి ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుంది. మొక్కలు నాటేందుకు, వాటి సంరక్షణకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చిన సమయంలో హడావుడిగా మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడంతో ఈ కార్యక్రమం అపహాస్యమవుతోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత ప్రభుత్వంలో 14 కోట్ల మొక్కలు నాటి ఉంటే, అవి ఎదిగి మానులుగా తయారైతే పచ్చదనం ఎంతగా విస్తరించేదో ఆలోచించుకోవచ్చు. అధికారులు, గ్రామ పంచాయతీలు, వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, అటవీ అధికారులకు మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు.
వాటి సంరక్షణకు రోజూ నీళ్లు పోసేందుకు కూడా నిధులు ఇస్తున్న సమయంలో, మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అవగతం కావడం లేదు. ఇది ఒక తంతుగా మారుతోంది. నర్సరీలకు తీసుకొచ్చే మొక్కలు కొన్ని నర్సరీలలోనే పాడవుతున్నాయి. మరికొన్ని నాటేందుకు తీసుకెళ్లి పాడేస్తున్నారు. నాటిన మొక్కలను పట్టించుకోకుండా వదిలేయడంతో అవి ఎండిపోతున్నాయి.
ప్రధాన రహదారుల వెంట ప్రతి ఏడాది వన మహోత్సవాలు లేదా హరితహారం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నిరుడు నాటిన మొక్కలు ఏమయ్యాయని ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి ప్రశ్నించడు.
ఉదాహరణకు వైరా మండలం తాటిపూడి ప్రాథమికోన్నత పాఠశాలలో హరితహారమైనా, వన మహోత్సవమైనా ఇక్కడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొంటారు. గతంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆ పాఠశాలలో కొన్ని వేల మొక్కలు నాటారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలో చెట్లు లేవు, మొక్కలు లేవు. ఈ ఏడాది కూడా అదే పాఠశాలలో కార్యక్రమం నిర్వహిస్తారేమో తెలియదు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.
ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, కొన్ని అటవీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిర్దేశిత లక్ష్యాలు ఇచ్చి మొక్కలు నాటిన తర్వాత వాటిని వదిలేయకుండా, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. మొక్కలు నాటే కార్యక్రమం కొందరికి వ్యాపారంగా మారగా, మరికొందరికి ఆదాయ వనరుగా మారింది.
ఇప్పటికైనా మొక్కలు నాటేందుకు మాత్రమే కాకుండా, వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తే పచ్చదనంతో పాటు కోట్లాది రూపాయలు వృథా కాకుండా ఉంటాయి. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడిన వారమవుతాం. ఆ విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- Bankipur Bypoll Result: బద్దలవబోతున్న బీజేపీ కంచుకోట.. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ దూకుడు.. మంజల్పూర్లో బీజేపీ, దతియాలో కాంగ్రెస్ ముందంజ
- Metabolism: వయసు 60 దాటినా రేసు గుర్రంలా పరిగెత్తండి.. మీ మెటాబాలిజాన్ని పెంచే 10 చిట్కాలు
- ఈ నెల 16 నుంచి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు ముహూర్తం
- నాటుడే కానీ సంరక్షణేది…?…నాడు హరితహారం….నేడు వన మహోత్సవం… మొక్కల పెంపకం పేరిట కోట్లు వృథా
- గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఎనిమిది మంది మృతి..హమాస్ నిరాయుధీకరణపై నెతన్యాహూ నో..