Skip to content
తెలంగాణ వార్తలు

ఆపరేషన్ ముస్కాన్‌లో 6,307 మంది చిన్నారుల విముక్తి

Prajapaksham 02 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఆపరేషన్ ముస్కాన్‌లో 6,307 మంది చిన్నారుల విముక్తి

ఆపరేషన్ ముస్కాన్‌లో 6,307 మంది చిన్నారుల విముక్తి

1,705 కేసులు నమోదు.. 1,710 మంది అరెస్టు

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్-12’ లో ఏకంగా 6,307 మంది చిన్నారులను రక్షించి, బాలల సంరక్షణలో మరోసారి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

ఈ ఆపరేషన్‌లో 5,041 మంది బాల కార్మికులను విముక్తి చేయడంతో పాటు 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్టు చేయడం గమనార్హం.

జులై 1 నుంచి 31 వరకు మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేశాయి.

రాష్ట్రంలోని 124 పోలీసు సబ్‌డివిజన్లలో 620 మంది పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, దాబాలు, నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, టీ దుకాణాలు, మాంసం దుకాణాలు, వెల్డింగ్ వర్క్‌షాపులు తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

రక్షించిన 6,307 మంది చిన్నారుల్లో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్‌కు చెందినవారు ఉన్నారు.

మొత్తం 5,041 మంది బాల కార్మికులు, ఒక బానిస కార్మికుడు, 647 మంది వీధి బాలలు, 43 మంది భిక్షాటన చేస్తున్న చిన్నారులు, 11 మంది ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే డ్రాప్‌అవుట్లు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత వంటి ఇతర విభాగాల్లో 563 మంది చిన్నారులను కూడా రక్షించారు.

ఆపరేషన్ సందర్భంగా నమోదైన కేసుల్లో 1,989 మంది చిన్నారులను రక్షించగా, కార్మిక శాఖ 1,381 తనిఖీ నివేదికలు జారీ చేసి, కనీస వేతనాల చట్టం కింద రూ.37.95 లక్షల జరిమానాలు విధించింది.

రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని కుటుంబాలకు అప్పగించగా, మిగిలిన 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టారు.

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అన్ని ప్రభుత్వ శాఖల సమిష్టి కృషితో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని మహిళా భద్రత విభాగం డైరెక్టర్ చారు సిన్హా తెలిపారు.

భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రత్యేక ఆపరేషన్లను మరింత విస్తృతంగా నిర్వహించి, ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు: Police Telangana Telangana Police