Skip to content
బిజినెస్ వార్తలు

Hyderabad-Tirupati Flight Fares: హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలంటే రూ. 24 వేల ఖర్చా.. దందా వెనుక అసలు కారణం ఇదే

Prajapaksham 29 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Hyderabad-Tirupati Flight Fares: హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలంటే రూ. 24 వేల ఖర్చా.. దందా వెనుక అసలు కారణం ఇదే

Tirupati Airport

Hyderabad-Tirupati Flight Fares: తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళ్లే భక్తులకు విమానయాన సంస్థలు షాక్ ఇస్తున్నాయి. కేవలం గంట ప్రయాణానికి ఏకంగా రూ.24 వేల వరకు టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో ఇండిగో, అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నప్పటికీ.. ప్రయాణికులు చెల్లించాల్సిన ఛార్జీలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సాధారణ రోజుల్లో హైదరాబాద్-తిరుపతి విమాన టికెట్లు రూ.5,700 నుంచి రూ.13,500 వరకు లభిస్తుండగా, చివరి నిమిషంలో బుకింగ్ చేసుకునే వారికి ధరలు రూ.24 వేల వరకు చేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై వంటి దూర ప్రాంతాలకు రూ.3,500 నుంచి రూ.7,000 మధ్య టికెట్లు లభిస్తున్న సమయంలో.. సమీపంలోని తిరుపతికి ఇంత అధిక ధరలు వసూలు చేయడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ ధరలు విపరీతంగా పెరగడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అమలు చేస్తున్న శ్రీవాణి వీఐపీ దర్శన కోటా ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, ప్రతిరోజూ సుమారు 200 శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విమాన ప్రయాణికులకు కేటాయిస్తోంది.

చెల్లుబాటు అయ్యే బోర్డింగ్ పాస్ చూపించిన వారికి ముందు వచ్చిన వారికి ముందు అనే విధానంలో ఈ టికెట్లు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకునే ప్రయాణికులకు ఈ అవకాశం ఎక్కువగా ఉండటంతో.. విమానయాన సంస్థలు అదే డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఉదయం విమానాల టికెట్ ధరలను భారీగా పెంచుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై భక్తుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా స్పందించారు. భక్తుల విశ్వాసాలను వ్యాపార లాభాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని ఆయన విమానయాన సంస్థలను హెచ్చరించారు.

టికెట్ ధరలను వెంటనే తగ్గించకపోతే.. తిరుపతి విమానాశ్రయంలో కొనసాగుతున్న శ్రీవాణి టికెట్ల ప్రత్యేక కౌంటర్‌ను పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం విమాన ప్రయాణికులకు కేటాయిస్తున్న టికెట్ల కోటాను సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ లేదా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

తిరుపతి ఎంపీ, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎం. గురుమూర్తి కూడా విమాన చార్జీల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భక్తులపై ఇది మోయలేని ఆర్థిక భారం అవుతోందని, విమానయాన సంస్థలు తక్షణమే ధరలను సమీక్షించి తగ్గించాలని కోరారు.

ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చే భక్తుల అవసరాలను వ్యాపార అవకాశంగా మార్చుకుని విమాన టికెట్ ధరలను అమాంతం పెంచడం సరైన విధానం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీటీడీ హెచ్చరికలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి నేపథ్యంలో విమానయాన సంస్థలు ధరలను తగ్గిస్తాయా? లేక శ్రీవాణి కౌంటర్ రద్దు వరకు పరిస్థితి వెళ్తుందా? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్‌లు: Hyderabad Tirupati flight