Skip to content
ఎడిట్ పేజి వార్తలు

సౌదీతో అణు ఒప్పందం ట్రంప్‌ మతిమాలిన పని

Prajapaksham 29 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
సౌదీతో అణు ఒప్పందం ట్రంప్‌ మతిమాలిన పని

సౌదీతో అణు ఒప్పందం ట్రంప్‌ మతిమాలిన పని

ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ధ్వంసం చేయటానికే దానితో యుద్ధం చేస్తున్నామని ప్రపంచాన్ని నమ్మించజూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సౌదీ అరేబియాతో పౌర అణుశక్తి ఒప్పందం కుదుర్చుకోవటం మతిమాలిన చర్య అని ఇట్టే అర్థమవుతుంది. అణు ఇంధనాన్ని శుద్ధి చేసి ఆయుధ గ్రేడ్‌ ఇంధనాన్ని తయారు చేసే అవకాశాన్ని సైతం రియాద్‌కు కల్పించిన ఈ ఒప్పందంపై స్వదేశంలో తీవ్ర విమర్శలు రావటంతో, దిద్దుబాటు చర్యగా, ‘అబ్రహం ఒప్పందాలకు (ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం) సౌదీ అరేబియా అంగీకరిస్తేనే అణు ఒప్పందం అమలు జరుగుతుంది’ అంటూ ట్రంప్‌ మరో తప్పు చేశారు. ‘అటువంటిదేదీ సంతకాలు జరిగిన ఒప్పందంలో లేదే! అందులో లేని విషయాలకు విలువ ఉండదు’ అని సౌదీ పాలకులు సున్నితంగా చురక అంటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఏకైక అణ్వస్త్ర దేశంగా ఇజ్రాయెల్‌ పరిగణించబడుతున్నది. సౌదీతో అమెరికా ఒప్పందంపై నెతన్యాహు ప్రభుత్వం గుంభనంగా ఉన్నా, రాజకీయ వర్గాల నుంచి అసాధారణ ఆందోళన వ్యక్తమైంది. ఇజ్రాయెల్‌ తలమీదుగా సౌదీతో ఒప్పందం తీవ్రమైన వ్యూహాత్మక వైఫల్యంగా మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ వ్యాఖ్యానించారు. సౌదీ గడ్డపై అణు ఇంధనం శుద్ధి ఈ ప్రాంతాన్ని అణ్వాయుధ పరుగుపందెంలో పెడుతుందని, అది ప్రమాదకరంగా అదుపు తప్పుతుందని ఆయన హెచ్చరించారు.

అమెరికా అణుశక్తి వ్యాప్తి నిరోధక విధానాన్ని గుణాత్మకంగా మార్పు చేసిన ఈ ఒప్పందం అమెరికా అణుశక్తి చట్టంలోని సెక్షన్‌ 123 కింద అధికారికంగా కుదుర్చుకోబడింది. అమెరికా ఎనర్జీ కార్యదర్శి క్రిస్‌ రైట్‌, సౌదీ అరేబియా ఇంధన మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ సంతకాలు చేసిన ఈ పౌర అణుశక్తి ఒప్పందం సౌదీ అరేబియాలో పౌర అణుశక్తి కార్యక్రమాన్ని (అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి) నిర్మించేందుకు అమెరికన్‌ కంపెనీలకు చట్టబద్ధ అనుమతి ఇస్తున్నది. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ తొలి ప్రభుత్వంలో 2008లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణుశక్తి ఒప్పందం ఈ చట్టం కిందనే జరిగింది. అయితే, అమెరికన్‌ కంపెనీలు సరఫరా చేసే అణు విద్యుత్‌ రియాక్టర్లలో లోపాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ కంపెనీలే పూర్తి పరిహారం చెల్లించాలన్న భారత్‌ చట్టం (లయబిలిటీ యాక్ట్‌) కారణంగా ఆ ఒప్పందం ఇంతవరకు అమలులోకి రాలేదు. పరిహార మొత్తాన్ని నిర్దిష్ట పరుస్తూ ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు కొద్దినెలల క్రితం వార్తలొచ్చాయి. సౌదీతో “పెక్కు బిలియన్‌ డాలర్ల” అణు ఒప్పందం కొన్ని దశాబ్దాలు (30 ఏళ్లు) అమలులో ఉంటుందని, అమెరికన్‌లకు ఉద్యోగాలు కల్పిస్తుందని, సౌదీ రాజ్యంతో సంబంధాలు పటిష్టం చేస్తుందనే వాదనను అమెరికా ఇంధన శాఖ ఈ ఒప్పందానికి సమర్థనగా వినిపిస్తున్నది. యురేనియం శుద్ధి, వినియోగించిన ఇంధన రీప్రాసెసింగ్‌ చేయకుండా రియాద్‌పై నిషేధం విధించలేదు. యూఏఈ తమ బరాఖ్‌ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మించేటప్పుడు ఆ షరతుకు అంగీకరించింది.

గల్ఫ్‌ రాజ్యాల్లో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన సౌదీ అరేబియా క్రూడ్‌ ఆయిలు ఎగుమతిలో ప్రపంచంలోనే మిన్న. అయితే, అంతర్గతంగా విద్యుచ్ఛక్తి, నీటినుంచి ఉప్పు తొలగించే కర్మాగారాలకు ప్రతిరోజూ, ముఖ్యంగా వేసవిలో, 10 లక్షల బ్యారల్స్‌కు పైగా ఆయిలు వినియోగిస్తున్నట్లు అంచనా. అందువల్ల అణు విద్యుచ్ఛక్తి కేంద్రాల స్థాపన ద్వారా తమ అవసరాలు నెరవేర్చుకుంటూ, ఆయిలు ఎగుమతిద్వారా ఆదాయార్జన పెంచుకోవాలని యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ 2030 ప్రణాళిక. ఇరాన్‌ గనుక ఎప్పుడైనా అణ్వాయుధం నిర్మిస్తే సౌదీ అరేబియా దానితో పోటీపడుతుందని యువరాజు చాలాసార్లు చెప్పారు. జో బైడన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సౌదీతో పౌర అణు ఒప్పందం ప్రతిపాదన తెచ్చారు. సౌదీ మధ్య సంబంధాల స్థాపనకు ప్రలోభంగా వచ్చిన ఆ ప్రతిపాదన గాజాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణ యుద్ధంతో నిలిచిపోయింది. ఇప్పుడు ట్రంప్‌ ఒప్పందం, ఇజ్రాయెల్‌తో మైత్రి షరతు లేకుండానే సౌదీకి అణుశక్తి సమకూర్చుకునే అవకాశం కల్పించింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీని శక్తిమంతంగా నిలబెట్టటమే ట్రంప్‌ ఆలోచన అయి ఉండవచ్చు. ఇరాన్‌ యురేనియం ఇంధనాన్ని ఆయుధ గ్రేడ్‌కు శుద్ధి చేసిందనే ఆరోపణతో ట్రంప్‌, నెతన్యాహుతో కలిసి గత ఏడాది జూన్‌లో ఇరాన్‌ అణు వసతులపై 12 రోజులు బాంబులు వేయించినా ఫలితం బహుపాక్షికమే. మళ్లీ ఈ సంవత్సరం జూన్‌లో ఏకంగా యుద్ధానికే దిగాడు. పరువుగా బయటపడేందుకు ట్రంప్‌ యుద్ధోన్మాదాన్ని ఆశ్రయించాడు. హార్ముజ్‌ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానం సాధించటంలో విఫలమైనాడు. ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేయటమే లక్ష్యమంటూ బాంబుదాడులు సమర్థించుకుంటున్నాడు.

సౌదీకి ఇచ్చే అణుశక్తి శాంతియుత ప్రయోజనాలకే కావచ్చు. కానీ, అది దానికి ఇప్పటివరకు లేని సాంకేతిక పునాదిని ఏర్పరుస్తుంది. ఇరాన్‌ అణుశక్తి ధ్వంసం లక్ష్యంగా బాంబులు వేస్తూ, సౌదీకి అదే టెక్నాలజీ అమెరికన్‌ నిపుణుల పర్యవేక్షణలో అయినప్పటికీ ఇవ్వటం ఇరాన్‌కు భవిష్యత్‌ చర్చల్లో బలమైన వాదనను అందిస్తుంది. సౌదీ అరేబియా అణ్వాయుధ శక్తిని సంతరించుకున్నాక యూఏఈ, టర్కీ, ఈజిప్టు సమాన ఏర్పాటు కోసం ఒత్తిడి చేస్తాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకందారులైన దేశాలు అణుశక్తి కార్యక్రమం చేపట్టరాదని (కొద్ది మినహాయింపులతో) 1970 నుంచి అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఇప్పుడు ట్రంప్‌ వెనక్కు మరలించాడు. సౌదీ అరేబియా గత సంవత్సరం పాకిస్థాన్‌తో పరస్పర సహకార రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమొస్తే తమ అణు కార్యక్రమాన్ని రియాద్‌కు విస్తరిస్తామని అప్పుడు పాక్‌ రక్షణ మంత్రి చెప్పారు.

ఇన్ని ప్రమాదాలతో కూడిన అమెరికా–అరేబియా అణు ఒప్పందం ఇప్పుడు కాంగ్రెస్‌ ఆమోదానికి వెళుతుంది. దాని సమీక్షకు 90 రోజుల వ్యవధి ఉంది. కాంగ్రెస్‌ దాన్ని తిరస్కరించాలంటే ఉభయ సభల్లో 2/3 మెజారిటీ లభించాలి. దుర్లభం.

ట్యాగ్‌లు: editorial