TDP Kapu Politics: టీడీపీలో కాపు ఉద్యమం సెగ.. పిఠాపురం వర్మ వర్సెస్ బొండా ఉమల మధ్య మాటల యుద్ధం..
Varma vs Bonda Uma
TDP Kapu Politics: తెలుగుదేశం పార్టీలో విజయావాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కాపు ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2019 శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం నడిపిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం వల్లే టీడీపీ ఓటమి పాలైందంటూ బొండా ఉమా చేసిన ప్రకటన సొంత పార్టీ నేతలనే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా పార్టీ చేసిన మంచి పనులను, లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రస్తావించాల్సింది పోయి.. ఓటమికి ముద్రగడ ఉద్యమాన్ని కారణమని పేర్కొనడం రాజకీయాన్ని వేడెక్కించింది.
ఈ పరిణామంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిపై స్పష్టమైన వివరణ తీసుకోవాల్సిందిగా మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తనకేమీ పార్టీ అధిష్ఠానం నుంచి నోటీసులు గానీ.. ఆదేశాలు గానీ రాలేదని బొండా ఉమా స్పష్టం చేస్తున్నారు.
ఈ వివాదం సద్దుమణగక ముందే.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బొండా ఉమా వ్యాఖ్యలకు బలమైన కౌంటర్ ఇచ్చారు. 2019 ఓటమికి ముద్రగడ ఉద్యమమే కారణమనడం బొండా ఉమా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పి ఉంటే బాగుండేదని హితవు పలికారు. కాపుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని వర్మ స్పష్టం చేశారు. కాపు కార్పొరేషన్ నిధుల కేటాయింపు, రిజర్వేషన్ల కల్పన, విదేశీ విద్య, స్వయం ఉపాధి పథకాలు, కాపు భవనాల నిర్మాణం వంటి అనేక విషయాల్లో చంద్రబాబు కాపులకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
తన కులం హక్కుల కోసం ముద్రగడ పోరాటం చేసిన మాట ఎంత నిజమో.. కాపు సామాజికవర్గానికి చంద్రబాబు ఎంతో మేలు చేశారనేది కూడా అంతే సత్యమని వర్మ పేర్కొన్నారు. ఇలాంటి వాస్తవాలను పక్కనబెట్టి.. వ్యక్తిగత ఎజెండాలను పార్టీకి అంటగట్టకూడదని సూచించారు. నాయకులు మాట్లాడే ఒక్క మాట రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. కాబట్టి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దని హెచ్చరించారు. చంద్రబాబుకు కులాలు ఉండవని.. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకోవడమే ఆయన లక్ష్యమని వర్మ స్పష్టం చేశారు.
సొంత పార్టీకే చెందిన వర్మ ఇలా బహిరంగంగా హితవు చెప్పడం.. పార్టీ పెద్దల ఆదేశాల ప్రచారం నేపథ్యంలో బొండా ఉమా ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన తక్షణమే దీనిపై స్పందించి వివరణ ఇస్తారా.. లేక తనపై సొంత పార్టీ నేతలే రాజకీయంగా దాడి చేస్తున్నారని భావించి సరైన సమయం కోసం వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది.