అవినీతిలో రెవెన్యూ శాఖ టాప్…ఏసీబీ దాడులతో బయట పడుతున్న అధికారుల అవినీతి లీలలు..
Kallepalli Sathish Kumar, Municipal Assistant Engineer, Municipal Office of Peddapally District was caught by the ACB Karimnagar Range unit. ( Source: X/ACB Telangana @TelanganaACB)
ప్రభుత్వ కార్యాలయంలో సాధారణ సేవ కోసం వెళ్లినా ఫైలు కదలాలంటే.., ‘సంతకం కావాలంటే….. ‘పని త్వరగా పూర్తవ్వాలంటే…’ అంటూ లంచం అడిగే ఘటనలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి వస్తున్న ఫిర్యాదులు మాత్రం ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఇంకా సవాలుగానే ఉందని సూచిస్తున్నాయి.
ఎసిబి ప్రతి ఏడాది నమోదు చేస్తున్న ట్రాప్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ఆకస్మిక తనిఖీలు పరిశీలిస్తే కొన్ని శాఖల పేర్లు పదేపదే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నిత్యం ప్రత్యక్ష సంబంధం ఉండే శాఖల్లోనే ఎక్కువ అవినీతి ఆరోపణలు నమోదవుతున్నాయని విశ్లేషణ చెబుతోంది. ఈ కోవలోనే రెవెన్యూ శాఖ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
భూమి రికార్డులు, మ్యూటేషన్లు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, సర్వేలు వంటి సేవలు అందించే రెవెన్యూ శాఖపై అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక సంతకం, ఒక ధృవీకరణ, ఒక రికార్డు సవరణ కోసం కూడా కొందరు అధికారులు, సిబ్బంది అక్రమంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల ఈ శాఖకు చెందిన అధికారులు ఎసిబి ట్రాప్లలో ఎక్కువగా చిక్కుతున్నారని గణాంకాల ధోరణి సూచిస్తోంది.
ఇక పోలీస్ శాఖలో కూడా పాస్పోర్ట్ వెరిఫికేషన్, విచారణలు, పరిపాలనా ప్రక్రియలు, ఇతర సేవలకు సంబంధించి లంచం ఆరోపణలపై కేసులు నమోదవుతున్నాయి. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే సేవల్లో పారదర్శకత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ శాఖలు, జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్ విభాగాలు కూడా ఎసిబి దృష్టిలో కీలకంగా నిలుస్తున్నాయి.
భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ ఆమోదాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, అక్రమ నిర్మాణాల వ్యవహారాల్లో లంచాల ఆరోపణలు తరచూ నమోదవుతున్నాయి. రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖలో ఆస్తుల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ నిర్ణయం, పత్రాల నమోదు వంటి ప్రక్రియల్లో అక్రమ డిమాండ్లపై ఫిర్యాదులు వస్తుండగా, రవాణా శాఖ (ఆర్టీఏ)లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు వంటి సేవలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఎసిబి దృష్టికి చేరుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనుల బిల్లులు, టెండర్లు, గ్రామ పంచాయతీ అనుమతులు, సంక్షేమ పథకాల అనుమతుల్లో కూడా అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అదే విధంగా విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పట్టణాభివృద్ధి వంటి ఇంజినీరింగ్ శాఖల్లో టెండర్లు, బిల్లుల చెల్లింపులు, పనుల ఆమోదాలకు సంబంధించిన కేసులు కూడా నమోదు అవుతున్నాయి.
ట్రాప్ కేసులే ఎక్కువ…
ఎసిబి నమోదు చేసే కేసుల్లో అత్యధికం ట్రాప్ కేసులే. ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఫిర్యాదు చేయడం, ఎసిబి ప్రణాళికాబద్ధంగా ఉచ్చు వేసి నగదు స్వీకరిస్తున్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం ఈ కేసుల ప్రత్యేకత. ఈ తరహా కేసులే ఎసిబి పనితీరులో ప్రధాన భాగంగా ఉంటున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులపై ప్రత్యేక దృష్టి:
ఇటీవలి కాలంలో ఎసిబి దృష్టి కేవలం ట్రాప్ కేసులకే పరిమితం కాకుండా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపైనా కేంద్రీకృతమైంది. కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, బంగారం, నగదు, విలాసవంతమైన వాహనాలు, పెట్టుబడులు బయటపడుతున్న కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. కొంతమంది అధికారులు తమ చట్టబద్ధ ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో బయటపడుతున్న సందర్భాలు ఉన్నాయి.
సాంకేతిక నిఘాతో దూకుడు…
ఎసిబి ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఫోన్ కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, షెల్ కంపెనీల అనుసంధానాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. అవసరమైన చోట ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేస్తూ అవినీతి మూలాలను గుర్తించే ప్రయత్నం చేస్తోంది.
ప్రజల పాత్ర కీలకం: ఎసిబి డిజి చారుసిన్హా
లంచం ఇవ్వకుండా, లంచం అడిగితే వెంటనే ఎసిబికి సమాచారం ఇవ్వడం ద్వారా మాత్రమే అవినీతిని తగ్గించవచ్చని ఎసిబి డిజి చారుసిన్హా చెబుతున్నారు. చాలా ట్రాప్ కేసులు ప్రజల ధైర్యమైన ఫిర్యాదుల వల్లే విజయవంతమయ్యాయని పేర్కొంటున్నారు. ప్రజల్లో అవగాహన పెరగడం, ప్రభుత్వ సేవలను మరింత డిజిటలైజ్ చేయడం, కార్యాలయాల్లో పారదర్శకత పెరగడం ద్వారా అవినీతికి గణనీయంగా అడ్డుకట్ట వేయవచ్చని చారుసిన్హా సూచిస్తున్నారు.
అవినీతిని అరికట్టే బాధ్యత కేవలం ఎసిబిదే కాదు, లంచం ఇవ్వకుండా ఉండే పౌరస్ఫూర్తి, పారదర్శక పరిపాలన, వేగవంతమైన దర్యాప్తు, న్యాయపరమైన చర్యలు ఈ నాలుగు కలిసి పనిచేసినప్పుడే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.