Telangana PRC: పీఆర్సీ కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల ఎదురు చూపులు…ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు నెరవేరుతాయా.. లేదా..?
Telangana PRC: పీఆర్సీ కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల ఎదురు చూపులు...ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు నెరవేరుతాయా.. లేదా..?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచినా తెలంగాణలో కొత్త Pay Revision Commission (PRC) ఇంకా అమలు కాలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నిజానికి గత ప్రభుత్వంలో అంటే 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన సవరణ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త Pay Revision Commission (PRC) గడువును తాజాగా మరో 6 నెలలు పొడిగించింది. PRC తన నివేదికను సమర్పించేందుకు కొత్త గడువుగా 2026 సెప్టెంబర్ 30ను ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2023 నుంచి వేతన, పెన్షన్ సవరణ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరోసారి నిరాశ ఎదురైంది.
ఇదిలా ఉంటే గత BRS ప్రభుత్వం హయాంలో పీఆర్సీ ఏర్పాటు చేయగా, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి కేవలం ఒక పీఆర్సీ మాత్రమే అమలు అయ్యింది. అయితే గతంలో పీఆర్సీ సందర్భంగా ఫిట్మెంట్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధికంగా 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో తెలంగాణ ఉద్యోగులను దేశంలో అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగులుగా నిలిపింది. ప్రస్తుతం అదే స్థాయి ప్రయోజనాలు కొనసాగడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత PRC గడువును మూడు సార్లు పొడిగించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.2026 జూలై 1 DAతో కలిపి మొత్తం ఆరు డీఏలు (Dearness Allowances) పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఉద్యోగులపై ఆర్థిక భారం పెరుగుతోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో PRC, DAలు అమలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మే నెలలో ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవగా, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వారితో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే సమావేశంలో PRC నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఆ ఆదేశాల తర్వాత కూడా PRC నివేదిక ఇంకా ప్రభుత్వానికి సమర్పించబడలేదు, దీంతో అమలు మరింత ఆలస్యమవుతోంది.
ఉద్యోగ సంఘాల ప్రకారం, PRC నివేదిక ప్రభుత్వం స్వీకరించిన తర్వాత 3 నుంచి 6 నెలల్లో కొత్త వేతనాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అందుకే నివేదిక ఆలస్యం కావడం ప్రధాన సమస్యగా మారింది. వివిధ ఉద్యోగ సంఘాలు 40 శాతం నుంచి 48 శాతం వరకు ఫిట్మెంట్ ఇవ్వాలని PRCకి ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే 48% ఫిట్మెంట్ సాధ్యపడకపోవచ్చని TGEJAC నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం 15 శాతం నుంచి 20 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా రాష్ట్ర ఖజానాపై సంవత్సరానికి సుమారు రూ. 5,000 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, గ్రాట్యుటీతో పాటు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇంకా చాలామందికి అందలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినప్పటికీ, PRC, DAలు, రిటైర్మెంట్ బకాయిలు పూర్తిగా పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.